రెండో దశలో సంపన్నులు వీరే..

లోక్‌సభకు రెండో దశలో పోలింగ్‌ జరగనున్న స్థానాల్లోని అభ్యర్థులందరిలో అత్యంత సంపన్నుడిగా కర్ణాటకలోని మండ్య కాంగ్రెస్‌ అభ్యర్థి వెంకటరమణ గౌడ నిలిచారు.

Published : 17 Apr 2024 04:41 IST

రూ.622 కోట్ల ఆస్తులతో తొలిస్థానంలో మండ్య కాంగ్రెస్‌ అభ్యర్థి వెంకటరమణ
రెండో స్థానంలో డీకే సురేశ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: లోక్‌సభకు రెండో దశలో పోలింగ్‌ జరగనున్న స్థానాల్లోని అభ్యర్థులందరిలో అత్యంత సంపన్నుడిగా కర్ణాటకలోని మండ్య కాంగ్రెస్‌ అభ్యర్థి వెంకటరమణ గౌడ నిలిచారు. అఫిడవిట్‌ ప్రకారం ఆయన ఆస్తుల విలువ రూ.622 కోట్లకు పైనే. ఇక కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ సోదరుడు డీకే సురేశ్‌ రూ.593 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. అలనాటి బాలీవుడ్‌ నటి, మథుర సిట్టింగ్‌ ఎంపీ హేమామాలిని మూడో స్థానంలో నిలిచారు. ఈ ఎన్నికల్లో భాజపా తరఫున మరోసారి ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆమె ఆస్తుల విలువ రూ.278 కోట్లని ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ (ఏడీఆర్‌) నివేదిక వెల్లడించింది. రెండో విడతలో మొత్తం 33% అంటే 390 మంది కోటీశ్వరులు ఉన్నట్లు తెలిపింది. అభ్యర్థుల సగటు ఆస్తుల విలువ రూ.5.17 కోట్లుగా ఉంది. రెండో దశ పోలింగ్‌ ఏప్రిల్‌ 26న జరగనుంది. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 89 స్థానాలకు ఆ రోజున ఓటింగ్‌ జరగనుంది. ఇందులో మొత్తం 1,210 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

21% మంది నేర చరితులు..

దిల్లీ: లోక్‌సభకు రెండో దశలో పోలింగ్‌ జరగనున్న స్థానాల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న అభ్యర్థుల్లో 250 మంది నేర చరితులేనని ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ (ఏడీఆర్‌), నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ల నివేదిక పేర్కొంది. వారిలో ముగ్గురిపై హత్యాభియోగాలు సైతం ఉన్నట్లు వెల్లడించింది. మొత్తం 1,198 మంది అభ్యర్థులు రెండో దశలో  పోటీచేస్తుండగా వారిలో 1,192 మంది అభ్యర్థుల ప్రమాణపత్రాలను విశ్లేషించిన అనంతరం ఏడీఆర్‌, నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌లు ఈ విషయాన్ని వెల్లడించాయి. 1,192 మంది అభ్యర్థుల్లో 250 మందిపై (21 శాతం) క్రిమినల్‌ కేసులు ఉన్నాయని చెప్పింది. ఆ 250 మందిలో 167 మందిపై తీవ్రమైన నేరాభియోగాలు నమోదయ్యాయని పేర్కొంది. 24 మందిపై హత్యాయత్నం కేసులు నమోదయ్యాయని, 25 మందిపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నాయని వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని