మైనారిటీల మమత!

హోరాహోరీ పోరు నెలకొన్న పశ్చిమ బెంగాల్‌లో ప్రతి ఓటూ కీలకంగానే భావించి తృణమూల్‌ కాంగ్రెస్‌, భాజపా పోరాడుతున్నాయి. దీంతో ఏయే వర్గాల ఓట్లు ఎటు పడతాయన్న ఆసక్తి నెలకొంది.

Updated : 17 Apr 2024 06:11 IST

బెంగాల్‌లో తృణమూల్‌కే మొగ్గు..
భాజపా ఓటమే వారి లక్ష్యం?
లౌకిక కూటమికి మద్దతు కష్టమే..
ముస్లిం మహిళల ఓట్లపై కాషాయ పార్టీ ఆశ
ట్రిపుల్‌ తలాఖ్‌, సందేశ్‌ఖాలీ మేలు చేస్తాయనే భావన

హోరాహోరీ పోరు నెలకొన్న పశ్చిమ బెంగాల్‌లో ప్రతి ఓటూ కీలకంగానే భావించి తృణమూల్‌ కాంగ్రెస్‌, భాజపా పోరాడుతున్నాయి. దీంతో ఏయే వర్గాల ఓట్లు ఎటు పడతాయన్న ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో దాదాపు 30శాతంగా ఉన్న మైనారిటీల ఓట్లపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. లౌకిక కూటమిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్‌-లెఫ్ట్‌ పోటీలో ఉన్నా పెద్దగా ప్రభావం చూపించే అవకాశం కనిపించడం లేదు.

రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో మైనారిటీలైన ముస్లింల పాత్ర కీలకంగా ఉంది. మైనారిటీ నేతలు చెబుతున్న ప్రకారం.. వారి ఓట్లన్నీ తృణమూల్‌ కాంగ్రెస్‌కే దక్కే అవకాశం కనిపిస్తోంది. భాజపా విజయాన్ని నిలువరించడానికి మమతకు మద్దతుగా నిలుస్తామని వారంటున్నారు. ముర్షీదాబాద్‌, మాల్దా, ఉత్తర్‌ దినాజ్‌పుర్‌ జిల్లాల్లో మైనారిటీలే అధికంగా ఉంటారు. ఇండియన్‌ సెక్యులర్‌ ఫ్రంట్‌ (ఐఎస్‌ఎఫ్‌) ఒంటరిగా బరిలోకి దిగడంతో మైనారిటీల ఓట్లను గెలుచుకోవాలన్న కాంగ్రెస్‌-లెఫ్ట్‌ ఆశలకు గండిపడినట్లే. దీంతో భాజపాను బలంగా ఢీకొనగలిగే మమతవైపే వారు మొగ్గుతున్నారు. రామ మందిరం, పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)తో మిగిలిన ఓట్లను పోలరైజ్‌ చేసేందుకు భాజపా ప్రయత్నిస్తుండటంతో మైనారిటీలు మమతను ఎంచుకుంటున్నట్లు కనిపిస్తోంది.

కశ్మీర్‌, అస్సాంల తర్వాత..

దేశంలో జమ్మూకశ్మీర్‌, అస్సాంల తర్వాత అత్యధిక ముస్లింలున్నది పశ్చిమబెంగాల్‌లోనే. రాష్ట్ర ప్రభుత్వంపట్ల బెంగాల్‌ ముస్లింలలో కొంత అసంతృప్తి ఉన్నా భాజపాను అడ్డుకోవడానికి వారు మమతకే ఓటేస్తారని మైనారిటీ నేతలు అంటున్నారు. 2019లో మైనారిటీ ప్రాబల్యమున్న ప్రాంతాల్లోనూ భాజపా కొన్ని విజయాలు సాధించింది. దీంతో స్థానిక ఇమామ్‌లు ఓట్లు చీలకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. ‘ఉత్తర బెంగాల్‌లో కాంగ్రెస్‌-లెఫ్ట్‌ కూటమి బలంగా ఉన్నచోట ఫర్వాలేదు. కానీ మిగిలిన చోట్ల మమతకే మద్దతు పలకాల్సి ఉంటుంది’ అని ఖాజీ ఒకరు తెలిపారు. ముర్షీదాబాద్‌, మాల్దా, ఉత్తర్‌ దినాజ్‌పుర్‌లలోని మైనారిటీలు తృణమూల్‌, కాంగ్రెస్‌-లెఫ్ట్‌ కూటముల మధ్య ఎవరికి ఓటేయాలో తేల్చుకోవడం కష్టమేనని ఇమామ్‌ల సంఘం అధ్యక్షుడు మహమ్మద్‌ యాహ్యా పేర్కొన్నారు. ఉత్తర దినాజ్‌పుర్‌లో గత ఎన్నికల్లో చీలిక కారణంగా భాజపా లాభపడిందని తెలిపారు. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వారంతా మమతకు మద్దతుగా నిలిచారు. రాష్ట్రంలో దాదాపు 40,000 మసీదులున్నాయి.

చీలికతో లాభపడిన భాజపా

మైనారిటీల ఓట్లలో చీలిక కారణంగా 2019లో ఉత్తర బెంగాల్‌లోని మాల్దా ఉత్తర, రాయ్‌గంజ్‌ నియోజకవర్గాల్లో భాజపా గెలిచింది. ఈ నియోజకవర్గాల్లో 45శాతం మైనారిటీలున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 30శాతం ముస్లిం ఓటర్లున్నా వారి ప్రభావం 16 నుంచి 18 నియోజకవర్గాల్లో అధికంగా ఉంటుంది.

కాంగ్రెస్‌-లెఫ్ట్‌ ఆశలు

రాష్ట్రంలో దిగజారిన జీవన ప్రమాణాలు, కుంభకోణాలు, ప్రభుత్వ వ్యతిరేకత, మతపరమైన అంశాలపై కాంగ్రెస్‌-లెఫ్ట్‌ కూటమి ఆశలు పెట్టుకుంది. దీనివల్ల మైనారిటీ ఓట్లు తమకే దక్కుతాయని అంటోంది. 2023లో జరిగిన సాగర్‌దిగి ఉప ఎన్నికల్లో తమ విజయమే దీనికి సంకేతమని చెబుతోంది. మైనారిటీలు తృణమూల్‌ను వదిలి తమవైపే మొగ్గుచూపుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్‌ సలీం అంటున్నారు.

ముస్లింల ప్రాబల్యమున్న నియోజకవర్గాలు

రాయ్‌గంజ్‌, కూచ్‌బెహార్‌, బలూర్‌ఘాట్‌, మాల్దా ఉత్తర, మాల్దా దక్షిణ, ముర్షీదాబాద్‌, డైమండ్‌ హార్బర్‌, ఉలుబెరియా. హావ్‌డా, బిర్‌భమ్‌, కాంతి, తమ్‌లుక్‌, జాయ్‌నగర్‌.

ఐఎస్‌ఎఫ్‌ సవాల్‌?

రాష్ట్రంలోని ప్రధాన పార్టీలను ఐఎస్‌ఎఫ్‌ భయం వెంటాడుతోంది. మైనారిటీల ఓట్లను ఆ పార్టీ చీల్చుతుందనే ఆందోళన నెలకొంది. 2021 ఎన్నికల్లో ఐఎస్‌ఎఫ్‌కు 1.35 శాతం ఓట్లే వచ్చాయి. ఆ పార్టీ నుంచి నౌషద్‌ సిద్దిఖీ ఒక్కరే ఎమ్మెల్యేగా గెలిచారు. అయినా ముస్లింల ఓట్లను ఆ పార్టీ చీల్చుతుందని ప్రధాన పార్టీలైన తృణమూల్‌, కాంగ్రెస్‌, లెఫ్ట్‌ ఆందోళన చెందుతున్నాయి. ఐఎస్‌ఎఫ్‌ జాదవ్‌పుర్‌, బలూర్‌ఘాట్‌, ఉలుబెరియా, బారక్‌పుర్‌, డైమండ్‌ హార్బర్‌, బసిర్‌హట్‌లలో పోటీ చేస్తోంది.

గతంలో..

చరిత్రను చూస్తే బెంగాల్‌లోని మైనారిటీలు తొలుత కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచారు. అప్పట్లో వారు హిందూ మహాసభ, జనసంఘ్‌కు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 1960ల చివరి నుంచి వారంతా లెఫ్ట్‌వైపు మొగ్గారు. జ్యోతి బసు లాంటి నేతల వెంట నిలిచారు. 2008లో సచార్‌ కమిటీ నివేదిక తర్వాత వారు క్రమంగా లెఫ్ట్‌కు దూరం జరుగుతూ వచ్చారు. 2011 నాటికి వారంతా తృణమూల్‌కు మద్దతుగా నిలిచారు.

  • 2014లో మైనారిటీల మద్దతుతో 34 లోక్‌సభ సీట్లు గెలుచుకున్న తృణమూల్‌.. 2019కి వచ్చేసరికి 22 సీట్లకు పరిమితమైంది.
  • 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మైనారిటీలు మళ్లీ మమతకే ఓటేశారు. దీంతో మూడోసారి ఆమె ఘన విజయం సాధించారు.

సందేశ్‌ఖాలీ ఘటనపై భాజపా ఆశలు

ట్రిపుల్‌ తలాఖ్‌ రద్దు అంశం, సందేశ్‌ఖాలీ సంఘటనతో ముస్లిం మహిళల్లో తమ పట్ల ఆదరణ పెరిగిందని భాజపా విశ్వసిస్తోంది. తృణమూల్‌ నేతలు మహిళలను లైంగికంగా వేధించడం పట్ల వారంతా ఆగ్రహంగా ఉన్నారని చెబుతోంది. దీంతో వారి ఓట్లు తమకే పడతాయని ఆశ పడుతోంది.

ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని