త్రిమూర్తులుపై వేటా.. సీటా..?

దళితుల శిరోముండనం కేసులో శిక్ష పడిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులును ఇప్పుడు మండపేట నియోజకవర్గ అభ్యర్థిగా వైకాపా తప్పిస్తుందా..? లేదా ఎమ్మెల్సీ అనంతబాబులాగే కొనసాగిస్తుందా అన్న చర్చ జరుగుతోంది.

Updated : 17 Apr 2024 07:37 IST

అనంతబాబు తరహాలోనే కొనసాగిస్తారా? 
పైకి సాత్వికుడు.. చేసేవన్నీ దౌర్జన్యాలే!

ఈనాడు, అమరావతి: దళితుల శిరోముండనం కేసులో శిక్ష పడిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులును ఇప్పుడు మండపేట నియోజకవర్గ అభ్యర్థిగా వైకాపా తప్పిస్తుందా..? లేదా ఎమ్మెల్సీ అనంతబాబులాగే కొనసాగిస్తుందా అన్న చర్చ జరుగుతోంది. త్రిమూర్తులు పైకి సాత్వికుడిలా కనిపిస్తారు గానీ, చేసేవన్నీ దౌర్జన్యాలు, దాష్టీకాలు, అక్రమాలే. నిత్యం 25-50 మంది అనుచరులను వెంటబెట్టుకుని తిరుగుతారు. అరాచకాలకు పాల్పడటాన్నే ప్రామాణికంగా అమలుచేస్తున్న వైకాపా అధిష్ఠానం.. త్రిమూర్తులుకు శిక్ష పడటాన్ని అదనపు అర్హతగా భావిస్తుందేమో!

త్రిమూర్తులుపై కేసులు

  • 1997లో ద్రాక్షారామ పోలీసుస్టేషన్‌లో శిరోముండనం కేసు
  • ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధిలోని నాగర్‌కర్నూలు పోలీసుస్టేషన్‌లో 2005లో ఒక కేసు
  • కాకినాడ జిల్లా సర్పవరం పోలీసుస్టేషన్‌లో 2006లో ఒక కేసు
  •  త్రిమూర్తులు సోదరుడు కొన్నేళ్ల క్రితం హత్యకు గురయ్యారు. ఆ హత్యలో భాగస్వాములైన 11 మంది తర్వాత హతమయ్యారు. త్రిమూర్తులు వర్గానికి చెందిన తండ్రీకొడుకులను ప్రత్యర్థివర్గం హత్యచేసింది. హైదరాబాద్‌లో దాక్కున్న వారిని.. కొందరు పోలీసుల వేషంలో వెళ్లి తీసుకొచ్చారు. తర్వాత వారు చనిపోయారు. ఇందులో కీలకపాత్ర త్రిమూర్తులుదేనని కొందరు అంటున్నా.. కేసుల్లో ఎక్కడా ఆయన పేరు లేదు. ఇలా చేతికి మట్టి అంటకుండా చేస్తారని అంటారు.
  •  గతంలో జడ్పీ సమావేశంలో ‘చెంప దెబ్బ తింటావ్‌’ అంటూ ప్రస్తుత ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ను త్రిమూర్తులు దూషించారు.
  • త్రిమూర్తులు వ్యవహారశైలి దూకుడుగా ఉంటుంది. ఎవరినైనా తిడతారు.. బెదిరిస్తారు. అధికారులనైనా సరే, ‘చెప్పిన పని చెయ్‌’ అని బెదిరిస్తారు. ఆర్టీసీ భూమిని లీజుకు తీసుకుని, అక్కడ థియేటర్‌ కట్టారు. దీనిపై ఒక సామాజిక కార్యకర్త నిరసన చేపడితే కేసులతో భయపెట్టారు. చివరకు థియేటర్‌ ప్రారంభ సమయంలో త్రిమూర్తులుకు శుభాకాంక్షలు చెబుతూ బ్యానర్‌ కట్టేలా చేశారు.పెద్దగా చదువుకోని త్రిమూర్తులు మొదట్లో అమలాపురం ప్రాంతంలో దూడల మారు బేరగాళ్లుగా ప్రస్థానం ప్రారంభించారు. తర్వాత రామచంద్రపురం చేరుకుని.. 1994లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. అప్పట్నుంచి గేర్‌ మార్చారు. సెటిల్‌మెంట్లు, భూ దందాలు, పంచాయితీకి వచ్చినవారిని బెదిరించి తానే రాయించుకోవడం వంటి అక్రమాలకు తెరతీశారు. కాజులూరు మండలం పల్లెపాలెంలో 32 ఎకరాలు ఇలాగే రాయించుకున్నారని ఆరోపణలున్నాయి. దీనిపై 2022 నవంబరులో జనసేన నేత లీలాకృష్ణ కలెక్టర్‌కు ఫిర్యాదుచేశారు. కానీ, ఎలాంటి చర్యలూ లేవు.

అన్ని పార్టీలూ తిరిగొచ్చి...

1994లో రామచంద్రపురంలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన త్రిమూర్తులు తర్వాత తెదేపా, ప్రరాపా, కాంగ్రెస్‌లకు మారారు. గత ఎన్నికల్లో తెదేపా అభ్యర్థిగా రామచంద్రపురంలో ఓడిపోయాక వైకాపాలో చేరి, అదే పార్టీ ఎమ్మెల్సీగా 2021 నుంచి కొనసాగుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని