ఎన్డీయే ప్రచారానికి ఎన్నారైలు సిద్ధం

ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని కమిటీల్లోనూ ప్రవాసాంధ్రులకు సముచిత స్థానం కల్పిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెదేపా ఎన్నారై విభాగం అధ్యక్షుడు వేమూరి రవికుమార్‌ వెల్లడించారు.

Published : 17 Apr 2024 05:06 IST

వివరాలు నమోదు చేసుకున్న 1500 మంది
ఉద్యోగాలు, వ్యాపారాలు వదిలి స్వరాష్ట్రానికి రాక
తెదేపా కేంద్ర కార్యాలయంలో కార్యశాల

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని కమిటీల్లోనూ ప్రవాసాంధ్రులకు సముచిత స్థానం కల్పిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెదేపా ఎన్నారై విభాగం అధ్యక్షుడు వేమూరి రవికుమార్‌ వెల్లడించారు. కూటమి అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను ప్రతి ఒక్కరికి చెబుతూ ప్రజల్ని చైతన్యవంతులను చేయాలని పిలుపునిచ్చారు. ప్రవాసాంధ్రులంతా క్షేత్రస్థాయిలో ఎన్డీయే గెలుపునకు ప్రచారం చేయాలని కోరారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో తెదేపా ఎన్నారై సభ్యులతో ఎన్‌-రీచ్‌ కార్యక్రమం నిర్వహించారు. అమెరికా, యూరోప్‌, గల్ఫ్‌ సహా వివిధ దేశాల్లో ఉద్యోగ, వ్యాపారాలు నిర్వహిస్తున్న సుమారు 1,500 మంది బూత్‌స్థాయిలో ఎన్డీయే అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు తమ పేర్లు, వివరాల్ని నమోదు చేసుకున్నారు.  ఈ సందర్భంగా క్షేత్రస్థాయి పరిస్థితులు, ఎన్డీయే అభ్యర్థుల బలాబలాలు, పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రచారంలో పాటించాల్సిన మెలకువలు సహా వివిధ అంశాలపై చర్చించారు. ‘చంద్రబాబును సీఎం చేయడమే లక్ష్యంగా స్వరాష్ట్రానికి వచ్చాం. పలువురు ప్రవాసాంధ్రులు 175 నియోజకవర్గాల్లో ఎన్డీయే అభ్యర్థుల విజయానికి కృషి చేయడానికి ఉవ్విళ్లూరుతున్నారు’ అని ఎన్నారై తెదేపా సమన్వయకర్త రాధాకృష్ణ వెల్లడించారు. నియోజకవర్గాల వారీ పరిస్థితులు, పార్టీ సంస్థాగత నిర్మాణం, బూత్‌, క్లస్టర్‌, యూనిట్‌ వ్యవస్థ గురించి టీడీపీ నేత కోనేటి సురేష్‌ వివరించారు. కార్యక్రమంలో తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు టీడీ జనార్దన్‌, ఎమ్మెల్సీ అశోక్‌బాబు, సుమారు 300 మంది ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు.

‘విజన్‌ ఫర్‌ విక్టరీ’తో..

‘ఒక్క ఓటుతో ఫలితాలు తారుమారైన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఖండాలు దాటుకుని ఎన్డీయే గెలుపు కోసం స్వరాష్ట్రానికి రావడం అభినందనీయం’ అని తెదేపా నేత బుచ్చి రామ్‌ప్రసాద్‌ అన్నారు. ‘ఇప్పటికే వివిధ దేశాల నుంచి 2వేల మంది రాష్ట్రానికి వచ్చారు. నెలాఖరుకు మరో 3 వేల మంది వచ్చి ప్రచారంలో భాగస్వాములవుతారు. ‘విజన్‌ ఫర్‌ విక్టరీ’ కార్యక్రమం ద్వారా రాయలసీమ అంతా విస్తృతంగా పర్యటించి, అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తాం. వైకాపా అరాచక పాలన గురించి ప్రజలందరికీ వివరిస్తాం’ అని ఎన్నారై తెదేపా యూఎస్‌ నేత కోమటి  జయరాం తెలిపారు. వైకాపా ప్రభుత్వంలో అల్లకల్లోలమైన రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టడం చంద్రబాబుతోనే సాధ్యమవుతుందని పలువురు ఎన్నారైలు స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని