ఎన్నికల్లో కూటమి ప్రభంజనం ఖాయం

తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించబోతోందని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ధీమా వ్యక్తంచేశారు. 

Updated : 17 Apr 2024 06:41 IST

జగన్‌కు ఓటేస్తే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లే
‘స్వర్ణాంధ్ర సాకార యాత్ర’లో నందమూరి బాలకృష్ణ

ఈనాడు, కర్నూలు, ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించబోతోందని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ధీమా వ్యక్తంచేశారు. జగన్‌కు ఓటేస్తే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లేనని అన్నారు. ‘స్వర్ణాంధ్ర సాకార యాత్ర’లో భాగంగా మంగళవారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శివ సర్కిల్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.‘వైకాపా పాలనలో రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయాయి. జగన్‌ ఒక నియంతలా, నయవంచకునిలా మారారు. రూ.లక్షల కోట్లు దోపిడీచేశారు. రూ.1,600 కోట్ల ప్రజాధనాన్ని హోర్డింగుల కోసం వెచ్చించారు. ప్రజల ప్రాణాలకూ రక్షణ లేకుండా పోయింది. దళిత బిడ్డలకు శిరోముండనం చేశారు. ప్రశ్నిస్తే దాడులకు తెగబడ్డారు. రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మార్చేశారు. జగన్‌ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజలు తమ భూములు, ఆస్తులు వదులుకుని రాష్ట్రం వదలిపోవాల్సిందే. ప్రజలంతా ఏకమై దుర్మార్గ పాలనను మట్టి కరిపించాలి. ఓటును సద్వినియోగం చేసుకుని ప్రజాస్వామ్య పరిరక్షణకు పూనుకోవాలి’ అని బాలకృష్ణ పిలుపునిచ్చారు.

రూ.350 కోట్ల రుణాలు ఎగ్గొట్టి డబ్బులు పంచుతున్నారు

వైకాపా అభ్యర్థిని బుట్టా రేణుక కుటుంబానికి చెందిన సంస్థలు ఎల్‌ఐసీ నుంచి తీసుకున్న రూ.350 కోట్ల రుణం ఎగ్గొట్టి..... సంచులకు సంచులు డబ్బులు తీసుకువచ్చి ఎమ్మిగనూరులో పంచుతున్నారని బాలకృష్ణ ఆరోపించారు. అలాంటి ఆమెను జగన్‌ సౌమ్యురాలు, సామాన్యురాలు, పేదరాలు అంటున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మిగనూరు వైకాపా ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి బంధువులు కడిమెట్ల గ్రామానికి చెందిన విరూపాక్షిరెడ్డి, చెన్నారెడ్డి, బాలకృష్ణారెడ్డి, రాళ్లదొడ్డికి చెందిన కరుణాకర్‌రెడ్డి, చెన్నారెడ్డి తమ అనుచరులతో కలిసి బాలకృష్ణ సమక్షంలో తెదేపాలో చేరారు. ఎమ్మిగనూరులో బాలకృష్ణ సభ జరుగుతున్న సమయంలో పలుమార్లు విద్యుత్తు ప్రసారంలో అంతరాయం ఏర్పడింది. ఇది వైకాపా నేతల పనేనని తెదేపా నాయకులు ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని