జే గ్యాంగ్‌ బెదిరింపులతోనే అరబిందో ఇన్‌ఫ్రాకు కాకినాడ పోర్టు

దేశంలో ఎక్కడా పోర్టులు నిర్మించిన, నిర్వహించిన అనుభవం లేని.. కనీసం పోర్టు గోడలకు రంగులు కూడా వేయని ఓ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ అయిన అరబిందో ఇన్‌ఫ్రాకు అత్యంత కీలకమైన కాకినాడ పోర్టును ఎలా కట్టబెట్టారని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ధ్వజమెత్తారు.

Published : 17 Apr 2024 05:22 IST

చంపేస్తామని తుపాకీ గురిపెట్టి భయపెట్టారు
జగన్‌రెడ్డికి వాటా ఉందనే ఆఘమేఘాల మీద షేర్ల బదిలీని ఆమోదించారా?
తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: దేశంలో ఎక్కడా పోర్టులు నిర్మించిన, నిర్వహించిన అనుభవం లేని.. కనీసం పోర్టు గోడలకు రంగులు కూడా వేయని ఓ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ అయిన అరబిందో ఇన్‌ఫ్రాకు అత్యంత కీలకమైన కాకినాడ పోర్టును ఎలా కట్టబెట్టారని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ధ్వజమెత్తారు. పోర్టును అప్పగించాలని, లేకపోతే చంపేస్తామని కాకినాడ సీపోర్టు ప్రైవేట్‌ లిమిటెడ్‌ (కేఎస్‌పీఎల్‌) యాజమాన్యాన్ని, వారి కుటుంబ సభ్యుల్ని తుపాకీతో జే గ్యాంగ్‌ బెదిరించిందని, జైలుకు పంపుతామని హెచ్చరించిందని ఆరోపించారు. అరబిందో కంపెనీ జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో ఏ2గా ఉన్న విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడైన పెనక శరత్‌చంద్రారెడ్డిది కాబట్టే ఆఘమేఘాల మీద బదిలీకి ఆమోదం తెలిపారా అని నిలదీశారు. ఈ వ్యవహారంలో సీఎం జగన్‌ వాటా ఎంతని ప్రశ్నించారు. జే గ్యాంగ్‌ బెదిరింపులు, వేధింపుల వల్లే రూ.1,780 కోట్ల విలువైన పోర్టును తక్కువ ధరకు విక్రయించారని ఆరోపించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆనం విలేకర్లతో మాట్లాడారు. ‘చంద్రబాబు హయాంలో కాకినాడ పోర్టు అభివృద్ధికి  కృషి చేస్తే, జగన్‌ ఆ పోర్టు షేర్లు కొట్టేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. కాకినాడ పోర్టుకు 2020లో రూ.170 కోట్లు, 2021లో రూ.205 కోట్లు, 2022లో రూ.241 కోట్లు, 2023లో రూ.240 కోట్లు లాభాలు వచ్చాయి. మొత్తం టర్నోవర్‌లో 32 శాతం లాభాలున్న సంస్థను ఎవరైనా అమ్ముతారా?’ అని ఆనం ప్రశ్నించారు.

రూ.965 కోట్లు ఎగ్గొట్టినట్లు తప్పుడు నివేదిక

‘కేఎస్‌పీఎల్‌ యాజమాన్యాన్ని లొంగదీసుకోవడానికి దొంగ ఆడిట్‌ చేయించారు. ప్రభుత్వానికి చెల్లించకుండా రూ.965.65 కోట్లు ఎగ్గొట్టారని తప్పుడు నివేదిక సృష్టించారు. వాటిని చెల్లించాలని ఒత్తిడి తెచ్చారు. ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఈ కుట్రలో చేరింది. వాటాల బదిలీకి కంపెనీ యాజమాన్యం నుంచి 2020 డిసెంబర్‌ 5న బలవంతంగా లేఖలు రాయించుకున్నారు. అయిదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ మారిటైం బోర్డు నుంచి అనుమతి తీసుకొని వాటాలు బదిలీ చేయించారు. పోర్టు అరబిందో సంస్థ చేతుల్లోకి వెళ్లగానే మళ్లీ ఆడిటింగ్‌ చేయించి, గతంలో కట్టాలని చెప్పిన రూ.965.65 కోట్లను రూ.9 కోట్లుగా మార్చారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుల్ని కూడా మాఫీ చేశారు’ అని ఆనం వివరించారు.

డైరెక్టర్ల మార్పు వెనక జగన్‌, విజయసాయిరెడ్డి

‘కాకినాడ పోర్టు నిర్వహణ కోసం 20 ఏళ్ల క్రితం కేఎస్‌పీఎల్‌ను ఏర్పాటు చేశారు. జగన్‌ ప్రభుత్వం వచ్చాకే తొలిసారిగా ఇందులో డైరెక్టర్లను మార్చారు. ఓజిలి కోదండరామిరెడ్డి, జెట్టి శివరామప్రసాద్‌, మరో ఇద్దర్ని డైరెక్టర్లుగా చేర్చారు. వీళ్లంతా ఎవరు? జగన్‌రెడ్డి, విజయసాయిరెడ్డితో వీళ్లకున్న సంబంధాలేంటి?’ అని ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. ఈ మార్పుచేర్పుల వెనక కర్త, కర్మ, క్రియ ఈ తోడుదొంగలేనన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని