నాకే పాపం తెలియదు

కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిడు, కడప: వివేకా హత్య కేసులో తనకెలాంటి ప్రమేయం లేదని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి పునరుద్ఘాటించారు.

Updated : 17 Apr 2024 06:42 IST

సీబీఐ కక్షపూరితంగా వ్యవహరిస్తోంది
షర్మిల, సునీతలవి నిరాధార ఆరోపణలు

కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిడు, కడప: వివేకా హత్య కేసులో తనకెలాంటి ప్రమేయం లేదని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి పునరుద్ఘాటించారు. షర్మిల, సునీతలు తనపై కక్ష పెంచుకుని వారం రోజులుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కడపలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సునీత తనపై లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్టు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారని అన్నారు. హత్య కేసులో నిందితుడైన దస్తగిరిని అప్రూవర్‌గా చేసిన విధానం అందరూ గమనించాలని.. ఆయన బెయిల్‌ పిటిషన్‌కు సునీత, సీబీఐ ఎలాంటి అభ్యంతరం తెలపలేదని గుర్తు చేశారు. చీకటి ఒప్పందంతోనే దస్తగిరి అప్రూవర్‌గా మారారని ఆరోపించారు. చట్టప్రకారం విచారణ పూర్తయ్యేవరకు అప్రూవర్‌ను బయటకు పంపరాదనే నిబంధనను ఉల్లంఘించి వదిలిపెట్టారని వివరించారు. సీబీఐ, సునీత, దస్తగిరి లాలూచీని నిరూపించే ఉదంతాలున్నాయని తెలిపారు. ఇచ్చిన వాంగ్మూలాన్నే కొన్ని రోజులయ్యాక తనది కాదని సునీత చెబితే సీబీఐ ఎలా అంగీకరిస్తుందని ప్రశ్నించారు.

వివేకా మరణించిన ముందు రోజు రాత్రి 11 గంటల వరకు జగన్‌ సీఎం కావాలని, తనను ఎంపీ చేయాలని ప్రచారం చేశారని, ఇందుకోసం తపించారని చెప్పారు. అలాంటప్పుడు ఎంపీ టిక్కెట్‌ కోసమే సంఘటన జరిగినట్లు ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఈ కేసులో పలుమార్లు వాంగ్మూలాలు ఇచ్చిన సునీత తనకు బెయిల్‌ వచ్చాక 2023 మే తర్వాత సవరణలు చేస్తూ మొత్తం 13 సార్లు వాంగ్మూలమిచ్చారని తెలిపారు. ఏ కేసులోనూ ఇన్నిసార్లు వాంగ్మూలాలు ఇచ్చిన దాఖలాల్లేవని చెప్పారు. హత్య విషయం అవినాష్‌కు ముందే తెలుసని, మూడో వ్యక్తి ఫోన్‌ చేస్తే వెళ్లి సాక్ష్యాలు చెరిపేశారని సునీత చెబుతున్నారని, తనకు ఫోన్‌ చేసిన శివప్రకాశ్‌రెడ్డి వివేకా బామ్మర్ది అని, ఆయన మూడో వ్యక్తి ఎలా అవుతారని ప్రశ్నించారు. వివేకా చనిపోయారని శివప్రకాశ్‌రెడ్డి చెబితే జమ్మలమడుగు వెళుతున్న తాను వెనక్కు మళ్లి సంఘటన స్థలం వద్దకు చేరుకున్నానని తెలిపారు. తాను వెళ్లాక ఎర్రగంగిరెడ్డి అక్కడికి వచ్చారని చెప్పారు. సీబీఐ, సునీత విచారణను అనుకూలంగా మార్చుకుని కావాల్సిన సమాధానాలు రాయించుకుని నిందలు మోపుతున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో తన కుటుంబం తీవ్ర ఇబ్బందుల పాలైందని, తన తండ్రి భాస్కరరెడ్డి ఏడాదిగా జైల్లో ఉన్నారని వాపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని