175కు 175 స్థానాలూ ఇవ్వండి

‘రాష్ట్రంలో 58 నెలల మా పాలనా కాలంలో కొత్తగా 17 మెడికల్‌ కళాశాలలు, నాలుగు సీ పోర్టులు, పది ఫిషింగ్‌ హార్బర్లు, ఫిష్‌ లాండింగ్‌ సెంటర్లు, డిజిటల్‌ గ్రంథాలయాలు ప్రారంభించి పనులు చేయిస్తున్నాం.

Updated : 17 Apr 2024 06:43 IST

మీరంతా రాష్ట్రాభివృద్ధిని కోరుకునేవారైతే ఒక్కటీ తగ్గొద్దు
భీమవరం ‘మేమంతా సిద్ధం’ సభలో సీఎం జగన్‌

ఈనాడు, భీమవరం: ‘రాష్ట్రంలో 58 నెలల మా పాలనా కాలంలో కొత్తగా 17 మెడికల్‌ కళాశాలలు, నాలుగు సీ పోర్టులు, పది ఫిషింగ్‌ హార్బర్లు, ఫిష్‌ లాండింగ్‌ సెంటర్లు, డిజిటల్‌ గ్రంథాలయాలు ప్రారంభించి పనులు చేయిస్తున్నాం. నాడు-నేడు కింద బడులు, ఆసుపత్రులు, వసతి గృహాలు బాగుపడ్డాయి. గ్రామాల్లో ఆర్బీకేలు, ఫైబర్‌ గిడ్లు కనిస్తున్నాయి. రాష్ట్రానికి రూ.లక్ష కోట్లకుపైగా పెట్టుబడులు వచ్చాయి. కొత్తగా భోగాపురం విమానాశ్రయం నిర్మిస్తున్నాం. రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమే అయితే మన పార్టీకి 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలకు ఒక్కటి కూడా తగ్గడానికి వీల్లేద’ని ప్రజలకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. పశ్చిమగోదావరి జిల్లాలో మంగళవారం ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర చేసిన జగన్‌.. భీమవరంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు.

జిల్లాలో వైకాపా తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను పరిచయం చేసి, వారిని గెలిపించాలని కోరారు. అనంతరం బస్సు యాత్ర పిప్పర, దువ్వ మీదుగా తేతలి వద్ద ముగిసింది. సీఎం రాత్రికి అక్కడే బస చేశారు. బుధవారం శ్రీరామనవమి సందర్భంగా యాత్రకు విరామం ప్రకటించారు. గురువారం తిరిగి ప్రారంభమవుతుంది. భీమవరం సభలో జగన్‌ ప్రసంగిస్తూ.. ‘నేను ఒంటరివాణ్ని కాదు. నాకు మద్దతుగా ప్రజల సైన్యముంది. ప్రతి ఇంట్లోనూ ఆశీర్వదించే పింఛనుదారులు, అక్కచెల్లెమ్మలు ఉన్నారు. ఇంగ్లిష్‌ మీడియం కోరుకునే పిల్లలు, వారి తల్లిదండ్రులు, ఉచిత మందులతో ఆరోగ్యం మెరుగైన పేదలున్నారు’ అని పేర్కొన్నారు. ‘ఎన్నో మంచి పనులు చేసిన మనం.. జెండాలు జత కట్టిన వారితో తలపడుతున్నాం. ఈ ఎన్నికలు ఎమ్మెల్యేలను, ఎంపీలను గెలిపించడానికో కాదు. జగన్‌కు, చంద్రబాబుకు మధ్య జరుగుతున్నవీ కాదు. పేదలకు, చంద్రబాబుకు మధ్య జరుగుతున్న ఎన్నికలు. ఆయన సాధ్యంకాని హామీలు ఇస్తున్నారు. సంక్షేమ పథకాలు ముందుకు సాగాలా, నష్టపోవాలా అన్నది మీరే తేల్చుకోవాలి’ అని సీఎం పిలుపునిచ్చారు.

చంద్రబాబు శాపనార్థాలు పెడుతున్నారు

‘చంద్రబాబు నాపై కోపంతో శాపనార్థాలు పెడుతున్నారు. నాకేదో అవ్వాలని కోరుకుంటారు. ‘రాళ్లు వేయండి, అంతం చేయండి’ అని పిలుపునిస్తుంటారు. దత్తపుత్రుడు నియోజకవర్గాలను అలవోకగా వదిలేస్తున్నారు. నేనేమైనా అంటే అతనికి కోపం వస్తుంది. చంద్రబాబు వదినకు కూడా కోపం ఎక్కువే. పేదలకు మంచి చేసిన జగన్‌కు వ్యతిరేకంగా జనం మద్దతు లేని చంద్రబాబు వీరందరితో కలిసి దండయాత్ర చేస్తున్నారు. వాళ్లంతా బాణాలు గురి పెట్టుకుని ఉన్నారు. వాళ్ల బాణాలు తగిలేది జగన్‌కా, ప్రజలకా?’ అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చాక రకరకాల ప్రణాళికలు చెప్పి, ఏవీ అమలు చేయలేదని జగన్‌ ఆరోపించారు. మోసాలే చంద్రబాబు ట్రాక్‌ రికార్డు అని విమర్శించారు. ఈసారి హామీల పత్రంపై మోదీ, పవన్‌ చిత్రాలు వేయించారని, గతంలో వీరు ఏ హామీలు అమలు చేశారని ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని