ఆ 8 మంది అధికారులను ఏపీ నుంచి తప్పించండి

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సజావుగా, స్వేచ్ఛగా, ప్రజాస్వామ్య బద్ధంగా జరగడానికి 8 మంది అధికారులను తక్షణం బదిలీ చేయాలని ఎన్డీయే కూటమి పార్టీల నేతలు మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.

Updated : 17 Apr 2024 06:51 IST

కేంద్ర ఎన్నికల సంఘానికి ఎన్డీయే నేతల ఫిర్యాదు
జాబితాలో సీఎస్‌, డీజీపీ, ఇంటెలిజెన్స్‌ డీజీ, విజిలెన్స్‌ ఐజీ సహా మరికొందరు

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సజావుగా, స్వేచ్ఛగా, ప్రజాస్వామ్య బద్ధంగా జరగడానికి 8 మంది అధికారులను తక్షణం బదిలీ చేయాలని ఎన్డీయే కూటమి పార్టీల నేతలు మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ నేతృత్వంలో తెదేపా ఎన్నికల కో-ఆర్డినేటర్‌ కనకమేడల రవీంద్రకుమార్‌, జనసేన ప్రధాన కార్యదర్శి నాదెండ్ల మనోహర్‌, భాజపా మాజీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు, భాజపా జాతీయ మీడియా సహ ఇన్‌ఛార్జి సంజయ్‌ మయూఖ్‌ నిర్వచన సదన్‌లోని సీఈసీ రాజీవ్‌కుమార్‌, కమిషనర్లు జ్ఞానేష్‌కుమార్‌, సుఖ్‌బీర్‌సింగ్‌ సంధులను కలిసి వినతి పత్రం సమర్పించారు. అందులో ఒక్కో అధికారి గురించి పూర్తి వివరాలు వెల్లడించారు. మార్చి 16న తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు, ఈనెల 4న భాజపా అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌రెడ్డిలు రాసిన లేఖలకు కొనసాగింపుగా తాము ఈ వినతిపత్రం సమర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘‘ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథరెడ్డి, ఐజీపీ కొల్లి రఘురామ్‌రెడ్డితోపాటు మరో అయిదుగురు అధికారుల దుష్ప్రవర్తనపై ఎన్నికల సంఘం తక్షణం దృష్టిసారించాలి. వీరంతా జూనియర్‌ అధికారులైనప్పటికీ సీనియర్లను పక్కకు తప్పించి కీలక స్థానాలను ఆక్రమించారు. ఈ ఒక్క అంశం వారి నిష్పాక్షికతలోని డొల్లతనాన్ని, అనుచిత వైఖరిని చాటుతోంది. తమను అడ్డదారిలో అందలం ఎక్కించిన మాస్టర్లకు ప్రస్తుతం ప్రతిఫలం చెల్లించే పనిలో తలమునకలై ఉన్నారు. చీఫ్‌ సెక్రెటరీ, డీజీపీ, సీనియర్‌ ఐపీఎస్‌, ఐఏఎస్‌ అధికారులు కుమ్మక్కై అక్రమాలు, ఆశ్రిత పక్షపతానికి ఎలా పాల్పడుతున్నదీ ఇదివరకే సమర్పించిన వినతిపత్రాల్లో వివరించాం. వచ్చే ఎన్నికల్లో వైకాపాను ప్రోత్సహించడానికి ఈ అధికారులంతా ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డితో పూర్తిగా కుమ్మక్కయ్యారు. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడానికి వీరు కుట్రలు పన్నుతున్నారు’’ అని మూడు పార్టీల కూటమి ఎన్నికల సంఘానికి ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొంది. (ఎన్డీయే నేతలు మొత్తం 8 మంది అధికారుల గురించి ఈసీకి ఫిర్యాదు చేయగా, వారిలో ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ డి.వాసుదేవరెడ్డిపై ఈసీ మంగళవారం సాయంత్రమే బదిలీ వేటు వేసింది.)


1). అరాచకాలకు పెద్దన్న ఈయన..
కేఎస్‌ జవహర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

ఆరుగురు సీనియర్‌ అధికారులను పక్కనపెట్టి ఈయనను కేవలం కులం, ప్రాంతం ప్రాతిపదికగానే చీఫ్‌ సెక్రెటరీ పదవిలో కూర్చోబెట్టారు. ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశాలకు అనుగుణంగా తమకు లొంగి ఉండి, ఎన్నికల్లో వైకాపాకు ప్రయోజనం కల్గించే కలెక్టర్లు, ఎస్పీలు, రిటర్నింగ్‌ అధికారులు, ఎస్‌డీపీఓలను నియమించారు. ఓటర్ల జాబితా సవరణ సమయంలో జిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేసి బోగస్‌ ఓట్ల నమోదు, అసలైన ఓట్ల తొలగింపులో ఈయన కీలకపాత్ర పోషించారు. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన తర్వాత కూడా వ్యక్తిగత ప్రయోజనాలను పంపిణీ చేయమని కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశారు. ఇళ్లపట్టాల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన స్క్రీనింగ్‌ కమిటీ మీటింగ్‌లు, పేరెంట్‌ టీచర్‌ మీటింగ్‌లు, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించి సెక్రెటరీ స్థాయి మీటింగ్‌లు, నిర్వహిస్తున్నారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కార్యదర్శి కె.ధనుంజయ్‌రెడ్డితో కలిసి సీఎఫ్‌ఎంఎంస్‌ నిబంధనలకు విరుద్ధంగా తమకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు ట్రెజరీ నుంచి నిధులు విడుదల చేస్తున్నారు. వైకాపా అనుకూల వాతావరణం సృష్టించేందుకు వ్యక్తిగత ప్రయోజనాల వర్షం కురిపించారు. పింఛనుదారులకు ఇంటివద్దే పింఛన్లు అందించాలన్న ఈసీఐ ఉత్తర్వులను పెడచెవినపెట్టి, మండుటెండలో వారిని దూరాభారం నడిపించి ఎన్డీయే పార్టీల పైకి ఆ నెపం నెట్టే ప్రయత్నం చేశారు. సీఎస్‌ అనుచిత చర్య కారణంగా 33 మంది పింఛనుదారులు చనిపోయారు. ఆయన్ను కొనసాగిస్తే రాష్ట్రంలో స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకు మరణశాసనం రాసినట్లే.


2). అధికార పార్టీకి వీరవిధేయ పోలీస్‌బాస్‌
కేవీ రాజేంద్రనాథరెడ్డి, ఇన్‌ఛార్జి డీజీపీ

13 మంది సీనియర్‌ అధికారులను పక్కనపెట్టి ఈయన్ను డీజీపీ ఇన్‌ఛార్జి పోస్టులో నియమించారు. ముఖ్యమంత్రి స్వస్థలం కడప నుంచి వచ్చిన ఈయన తనను అనుచితంగా అందలం ఎక్కించినందుకు బదులుగా గత రెండేళ్లుగా అధికార పార్టీకి, ముఖ్యమంత్రికి ఎనలేని విధేయత ప్రదర్శిస్తున్నారు. ఆయన వైఖరివల్ల రాష్ట్రంలో శాంతిభద్రతలు గాలిలో దీపంలా మారాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించిన ప్రతిపక్షపార్టీలు, సామాజిక కార్యకర్తలపై వందల కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఎంతోమంది తెదేపా కార్యకర్తలను వేధించారు.. చంపేశారు. ఎన్నికల సమయంలో తమకు అనుకూలమైన సామాజికవర్గానికి చెందిన కొందరు అవినీతి పోలీసు అధికారులను ప్రత్యర్థి పార్టీలు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో నియమించి వేధించే ప్రయత్నం చేస్తున్నారు. గతనెల 17న చిలకలూరిపేటలో జరిగిన ఎన్డీయే సమావేశానికి హాజరైన ప్రధానమంత్రికి తగిన భద్రత కల్పించడంలోనూ ఘోరంగా విఫలమయ్యారు. ఆ ఘటనపై డీజీపీ ఇంతవరకూ విచారణ జరిపించి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకున్న పాపానపోలేదు. అందువల్ల రాజేంద్రనాథ్‌రెడ్డిని డీజీపీగా కొనసాగించి ఎన్నికలు నిర్వహించడం అన్నది ఒక ప్రకృతి విపత్తులాంటిదే.


3). అధికార పార్టీకి ఈయనో సైన్యం
పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, ఇంటెలిజెన్స్‌ డీజీపీ

రాష్ట్ర ప్రభుత్వం ఈయనకంటే సీనియర్లతోపాటు ఈయనకూ 2022లో డీజీపీ ప్రమోషన్‌ ఇచ్చింది. అందుకు ప్రతిఫలంగా ఆయన వైకాపా పార్టీ చేతిలో పావుగా మారిపోయి ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా అన్నిరకాల అనుచితచర్యలకు పాలడుతున్నారు. చిత్తూరు జిల్లా అంగళ్లులో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడిపై దాడికి ఆయన ఇంటెలిజెన్స్‌ వైఫల్యమే కారణం. మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడిగా ఉన్న వైఎస్‌ అవినాష్‌రెడ్డి కర్నూలు ప్రైవేటు ఆసుపత్రిలో దాక్కున్నపుడు సీబీఐ ఆయన్ని అరెస్ట్‌ చేయకుండా రాష్ట్ర పోలీసులతో కుమ్మక్కై అవాంఛనీయ శక్తులు పోగై సీబీఐ సిబ్బందిని అడ్డుకొనేలా చేశారు. ఆ హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఎస్పీని భౌతికంగా బెదిరించి, ఆయనకు వ్యతిరేకంగా ఏపీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అధికార పార్టీ ప్రైవేటు సైన్యంలా పనిచేస్తున్న ఏపీ పోలీసుల తీరుకు ఇదో కేస్‌ స్టడీ. పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు తన ఇంటెలిజెన్స్‌ విభాగాన్నీ మొత్తం రెడ్లు, ఇతర అనుకూలమైన వ్యక్తులతో నింపేశారు. చంద్రబాబునాయుడు, లోకేశ్‌, మాజీమంత్రి నారాయణ, ఇతర ముఖ్యనాయకులను లక్ష్యంగా చేసుకోవడంలో వ్యక్తిగతంగా జోక్యం చేసుకుంటున్నారు. చంద్రబాబునాయుడి భద్రతను తగ్గించడంలో ఇతను కీలకం. హైకోర్టు జోక్యంతో భద్రతాసిబ్బందిని పునఃనియమించారు. ప్రతిపక్ష పార్టీ నేతల కదలికలు, ఎన్నికల వ్యూహాలను అధికారపార్టీకి చేరవేయడానికి ఇతను ఫోన్‌ట్యాపింగ్‌కు పాలడుతున్నట్లు వార్తలున్నాయి. వైకాపా పోలీస్‌ ప్రైవేట్‌ సైన్యంలో ఈయన కీలకవ్యక్తి. ఆయన్ను కొనసాగించడం అంటే స్వేచ్ఛా యుత ఎన్నికలకు మరణశాసనం లాంటిదే.


4). తప్పుడు కేసులు పెట్టారు.. రికార్డులు కాల్చేశారు..
కొల్లి రఘురామిరెడ్డి, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఇన్‌ఛార్జి డీజీపీ

ఇటీవల ఐజీపీ ర్యాంక్‌కు ప్రమోట్‌ అయిన ఈయన్ను విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా నియమించారు. 22 మంది డీజీపీ/అదనపు డీజీపీ స్థాయి అధికారులను పక్కనపెట్టి 2024 జనవరిలో ఐజీపీ హోదా పొందిన రఘురామిరెడ్డిని పూర్తి దురుద్దేశపూరితంగా ఆ పదవిలో కూర్చోబెట్టారు. జగన్‌మోహన్‌రెడ్డికి విశ్వాస పాత్రుడు, వైకాపా కార్యకర్త. కేంద్ర డిప్యుటేషన్‌ను కుదించుకొని జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో చేరారు. ప్రస్తుత ఎన్నికల్లో పోటీచేస్తున్న ప్రతిపక్ష పార్టీ నేతలను వేధిస్తున్నారు. నారాయణ గ్రూప్‌పై దాడి చేసి మాజీమంత్రి పి.నారాయణపై కేసు నమోదు చేశారు. ఈయన ఆదేశాల మేరకు వారి విభాగానికి చెందిన అధికారులు ప్రతిపక్ష నేతల ఇళ్లు, వ్యాపార సంస్థలపై దాడి చేసి వేధింపులకు గురిచేస్తున్నారు. ఇంతవరకూ అధికార పార్టీ నేతల ఇళ్లు, వ్యాపారాలపై ఒక్క దాడి చేసిన దాఖలాకూడా లేదు. ప్రతిపక్షపార్టీల నేతలు ఎన్నికల ప్రచారంలో తిరగకుండా వారిపై కేసులుపెట్టి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. చంద్రబాబునాయుడు కేసు సీబీసీఐడీకి చెందినది అయినప్పటికీ ఈయన ఇంటెలిజెన్స్‌ డీఐజీ హోదాలో చంద్రబాబు అరెస్ట్‌ను వ్యక్తిగతంగా దగ్గరుండి పర్యవేక్షించారు. చంద్రబాబునాయుడు, ఆయన కుటుంబ సభ్యులను తప్పుడు కేసుల్లో ఇరికించడానికి ప్రయత్నించి అందుకు సంబంధించిన రికార్డులను కాల్చేలా చేశారు. వారికి వ్యతిరేకంగా సాక్ష్యాలు సంపాదించడంలో విఫలమై, ఇపుడు ఎన్నికల సమయంలో భయపడి రికార్డులను కాల్చివేసే కుట్రకు పాల్పడ్డారు. ఇటీవల ఆయన ఎన్నికల ప్రచారం చేయకుండా ఎన్డీయే అభ్యర్థిని బెదిరించిన ఈ అధికారిని వెంటనే బదిలీ చేయాలి.


5). సీనియర్లను పక్కనపెట్టి ఈయనకు పెద్దపీట
వై.రిషాంత్‌రెడ్డి, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ ఎస్పీ, ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌ఛార్జి డీఐజీ

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత జూనియర్‌ అధికారి అయిన రిషాంత్‌రెడ్డిని కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ ఎస్పీ, ఎర్రచందనం స్మగ్లర్ల నియంత్రణ, టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌ఛార్జి డీఐజీగా నియమించింది. ఎస్‌టీఎఫ్‌ చీఫ్‌ పోస్ట్‌లో కనీసం 14 ఏళ్ల సర్వీసు ఉన్న డీఐజీ/ఐజీపీ ర్యాంకు అధికారి ఉండాలి. అయితే అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారన్న ఉద్దేశంతో సీనియర్లను పక్కన పెట్టి ఈయనకు కీలక బాధ్యతలు అప్పగించారు. స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ చీఫ్‌గా ఈయనకు రాయలసీమ జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల బాధ్యతలు అప్పగించారు. ఇక్కడున్న రాజకీయ ప్రాబల్యం వైకాపాకు మద్దతు పలుకుతోంది. ఎర్రచందనం స్మగ్లింగ్‌ పేరుతో  ప్రతిపక్ష నేతల వాహనాలను నిరంతరం తనిఖీ చేస్తూ వారిని ఇబ్బంది పెడుతున్నారు. ఆయన్ను ఆ పదవిలో కొనసాగించడం అన్నది ఎన్డీయే అభ్యర్థులకు శాపం. అందువల్ల తక్షణం ఆ పోస్ట్‌ నుంచి బదిలీ చేయాలి.


6) వివేక్‌యాదవ్‌, ఎక్సైజ్‌ కమిషనర్‌

వైకాపా నాయకులతో కుమ్మక్కై జగన్‌మోహన్‌రెడ్డి బంధువులకు సంబంధించిన డిస్టిలరీలు, బెవరేజెస్‌ నుంచి చట్టవిరుద్ధంగా పెద్దమొత్తంలో మద్యం సేకరిస్తున్నారు. ఎన్నికల సమయంలో లెక్కాపత్రం లేకుండా పెద్దమొత్తంలో మద్యం పంపిణీ చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా, శాంతియుతంగా జరగాలంటే వివిధ ప్రాంతాల్లో అక్రమంగా దాచిన మద్యం నిల్వలపై సోదాలు నిర్వహించాలి. ఈ కుట్రను ఛేదించడానికి తక్షణం ఈయనను బదిలీ చేయాలి.


7) తొమ్మిదేళ్లుగా ఈయన కొండ దిగలేదు..
ఏవీ ధర్మారెడ్డి, టీటీడీ ఈఓ

ఇదివరకు పనిచేసిన జేఈవో కాలంతో కలిపి ఈయన తిరుమల తిరుపతి దేవస్థానంలో 9 ఏళ్లుగా కొనసాగుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వంలో ఆయన డెప్యుటేషన్‌ను ఏడేళ్లు పొడిగించారు. తితిదే ఈవో పోస్టులో నాన్‌ ఐఏఎస్‌ అధికారి ఉండటం చరిత్రలో ఇదే తొలిసారి. తితిదే ఈవోకు పలు విచక్షణాధికారాలు ఉంటాయి కాబట్టి అవి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల నిర్వహణపై నేరుగా ప్రభావం చూపుతాయి.  వైకాపా నాయకులకు తితిదే దర్శన టికెట్లు ఖరారుచేయడం రాజకీయ ప్రేరితం. ప్రస్తుత తితిదే ఛైర్మన్‌, తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డికుమారుడు అభినయరెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యేగా పోటీచేస్తున్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడానికి కొంతముందు తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో పనులు  చేపట్టడానికి తితిదేకి చెందిన రూ.1,500 కోట్ల నిధులు ఇచ్చారు. దీనికి తితిదే బడ్జెట్‌ ఆమోదం లేకపోయినా ఈఓ విడుదల చేశారు. ఇందుకోసం వచ్చిన ముడుపులను తిరుపతి ఎన్నికలకోసం ఉపయోగిస్తున్నారు.

తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ నిర్వహణకోసం తితిదే రూ.100 కోట్లు విడుదల చేయడాన్ని హైకోర్టు నిలిపేసింది. తితిదే ఛైర్మన్‌ కరుణాకర్‌రెడ్డి, ఈవీఓ ధర్మారెడ్డిలు తమ విచక్షణాధికారాలను వైకాపా అభ్యర్థుల ప్రచారం కోసం ఉపయోగిస్తున్నారు. అందువల్ల ధర్మారెడ్డిని ఆ పదవిలో కొనసాగించడం అధికారపార్టీకి రాజకీయ ప్రయోజనకరంగా ఉంటుంది కాబట్టి ఆయన్ను బదిలీచేయాలి అనికోరారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర భద్రతాబలగాలను మోహరించాలని విజ్ఞప్తిచేశారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక పోలీసు పరిశీలకుడిని నియమించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పోలింగ్‌ బూత్‌లో వీడియోగ్రఫీ తీయించాలని, మహిళ బోగస్‌ ఓట్లను గుర్తించడానికి ప్రతి బూత్‌లో తగిన సంఖ్యలో మహిళా సిబ్బందిని నియమించాలని కోరారు. రాష్ట్రంలో అనధికారికంగా నిల్వ చేసిన డబ్బు, మద్యం నిల్వలను కనిపెట్టి వాటిని ఎన్నికల సమయంలో దుర్వినియోగం చేయకుండా అడ్డుకోవాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని