గ్రంధి శీనన్న లోకల్‌ హీరో అట!.. కారుమూరి మనసు వెన్నట!

మమకారం పంచే గోదావరి జిల్లాలు.. వెటకారానికీ పెట్టింది పేరు. ‘అయ్యబాబోయ్‌...చాలా గొప్పోరు అండి మీరు’ అంటే అందులో చాలా వెటకారం ధ్వనిస్తుంది.

Updated : 17 Apr 2024 06:48 IST

ముఖ్యమంత్రి జగన్‌ పరిచయ వాక్యాలు
జనం నోట చర్చనీయాంశమైన మాటలు..

ఈనాడు, అమరావతి: మమకారం పంచే గోదావరి జిల్లాలు.. వెటకారానికీ పెట్టింది పేరు. ‘అయ్యబాబోయ్‌...చాలా గొప్పోరు అండి మీరు’ అంటే అందులో చాలా వెటకారం ధ్వనిస్తుంది. ఆ పొగడ్తలోనే తెగడ్త కూడా మిళితమై ఉంటుంది. ఇది నరనరాన వంట పట్టించుకున్న ఆ ప్రాంతంలో మంగళవారం ముఖ్యమంత్రి జగన్‌  వైకాపా తరఫున ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను పరిచయం చేస్తూ వారిని పొగిడిన తీరులో స్థానికులకు ఒక వెటకారం కూడా కనిపించింది.  ఎమ్మెల్యేలుగా ఇప్పటికే తమ ప్రతాపం చూపించి... నియోజకవర్గాల్లో అనేక సమస్యలున్నా పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని మళ్లీ అభ్యర్థులుగా పోటీలో నిలపడమే కాకుండా వారిని సౌమ్యులు, జెంటిల్మన్‌.. మంచివాడు అంటూ జగన్‌ పొగడటాన్ని చూసి స్థానికులు అవాక్కైయ్యారు. ‘వీళ్లందరూ సౌమ్యులట, మంచివాళ్లట, చెప్పినోడికి లేకపోతే వినే వాళ్లం మనకైనా కాస్త మంచీ చెడూ ఉండొద్దా’ అంటూ వెటకారమాడటం కనిపించింది.


గ్రంధి శ్రీనివాస్‌ లోకల్‌ హీరోనా లేక..

భీమవరం ఎమ్మెల్యే.. ప్రస్తుత వైకాపా అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్‌ను ముఖ్యమంత్రి జగన్‌ ఏకంగా లోకల్‌ హీరో అని పొగిడేశారు. ‘శీనన్న మంచివాడు, సౌమ్యుడు, మీ అందరికీ మంచి చేస్తాడు’ అని మరీ పొగడ్తలతో ముంచెత్తారు. భీమవరం నియోజకవర్గంలో గత అయిదేళ్లలో సాగిన అనేక వ్యవహారాలను ప్రజలు గుర్తు చేసుకుంటూ ఆయన హీరోనా అని ఆశ్చర్యపోతున్నారు. తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ పర్యటనకు వచ్చినప్పుడు ఆ ఊళ్లో గొడవ జరిగింది. కొందరు అల్లరి సృష్టించారు. అయినా తిరిగి తెదేపా వారిపైనే కేసులు పెట్టారు. 70 ఏళ్లు దాటిన ఒక మహిళా నాయకురాలు అక్కడికి వచ్చి రాళ్లు వేసినట్లు కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆవిడ రాళ్లు వేయడం ఏమిటని నవ్వుకునే పరిస్థితి ఏర్పడింది ఈ ‘సౌమ్యుడు’ నాయకత్వం వహించిన నియోజకవర్గంలోనే. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక చోట జనసేన గెలిస్తే అధికారపార్టీ వారు కర్రలు, రాడ్లతో దాడికి వెళ్లింది కూడా ఈ సౌమ్యుడి పాలనలోనే. అలాగే ఇక్కడ సెటిల్‌మెంట్ల ఆరోపణలు ఉన్నాయి. కొందరిపై రౌడీషీట్లు మాయమైపోయిన ఉదంతాలూ ఉన్నాయి. అంతే కాదు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ భీమవరంలో ఇల్లు కట్టుకుందామని అనుకుంటే భయపడి ఎవరూ భూమి అమ్మేందుకు ముందుకు రాలేదు. అలాంటి చోట గ్రంధి శ్రీనివాస్‌లో ముఖ్యమంత్రి జగన్‌కు మంచితనం కనిపించిందట!


కొట్టు మనసు వెన్నట!

తాడేపల్లిగూడెం నుంచి పోటీ చేస్తున్న కొట్టు సత్యనారాయణను జగన్‌ పరిచయం చేస్తూ ‘కొట్టన్న మంచివాడు, సౌమ్యుడు, కాస్త మాట కటువు. మనసు వెన్న, మంచి చేస్తాడు’ అని పరిచయం చేశారు. నిజానికి తాడేపల్లిగూడెంలో ఇల్లు కట్టుకోవడమే కష్టమైన పరిస్థితిని అయిదేళ్లుగా ఇక్కడి ప్రజలు చూస్తున్నారు. ఇల్లు కట్టుకోవాలంటే ఎన్నో ఇబ్బందులు. రియల్‌ ఎస్టేట్‌ పూర్తిగా మందగించింది. ఇందుకు కారణాలు ఈ సౌమ్యుడైన కొట్టు సత్యనారాయణకు తెలిసినా చక్కదిద్దలేదు. అయినా కొట్టు ప్రజలందరికీ మంచి చేస్తాడు అని జగన్‌ ప్రకటించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఏం జరిగిందో తలచుకుని జనం అవాక్కవుతున్నారు. ఇక్కడ జరిగిన టీడీఆర్‌ బాండ్ల కుంభకోణమూ చర్చనీయాంశమవుతోంది. ప్రజాధనం రూ.కోట్లలో ఇక్కడ దుర్వినియోగమైంది. ఇందుకు బాధ్యులు ఎవరో కొట్టు సత్యనారాయణకు తెలియదా అని జనం ప్రశ్నిస్తున్నారు.


ప్రసాదరాజు మంచితనం ప్రజలే చెప్పాలి!

నరసాపురం అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే ప్రసాదరాజును జగన్‌ పరిచయం చేస్తూ...‘మంచి స్నేహితుడు, మంచివాడు. మనిషిలో వ్యక్తిత్వం ఉంది. ఇలాంటి వారు రాజకీయాల్లో ఏ పొద్దు అయినా ప్రజలకు మంచి చేస్తారు. రాబోయే రోజుల్లో మరింత మంచి చేస్తాడు. చేయిస్తాడు..’ అని పేర్కొన్నారు. నరసాపురం నియోజకవర్గంలో  ఎసైన్డ్‌, డీపట్టా, జిరాయితీ భూములపై కొందరి కన్ను పడింది. రైతులను భయపెట్టి కొందరు చాలా తక్కువ ధరకు 200 ఎకరాలను కొనిపించారు. నిబంధనలకు విరుద్ధంగా ఆ భూమిని క్రమబద్ధీకరించేందుకు కొందరు ప్రభుత్వ యంత్రాంగంపైనా ఒత్తిడి తెచ్చారు. నియోజకవర్గంలో ఇన్ని వ్యవహారాలు జరుగుతున్నా ఏ మాత్రం తొణకని, బెణకని మంచివాడు. అందరికీ మంచిచేసే వాడు అని జగన్‌ చెప్పడాన్ని చూసి ప్రజలు విస్తుపోతున్నారు. కొవిడ్‌ సమయంలో రోగులకు, పేదలకు భోజనాలు, సేవా కార్యక్రమాల పేరుతో ఇక్కడ కొందరు పెద్ద దందా చేశారు. భారీగా విరాళాలు వసూలు చేసి ఎలాంటి కార్యక్రమాలూ చేయలేదు. ఇలాంటివి అనేకం సాగుతున్నా ఆయన ఏ మాత్రం పట్టించుకోనంత ‘మంచి’ చేసేవాడు ప్రసాదరాజు అన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.


రైతులను ఎర్రిపప్ప అనేంత సౌమ్యుడు కారుమూరి

ప్రస్తుత మంత్రి, తణుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్న కారుమూరి నాగేశ్వరరావును పరిచయం చేస్తూ ‘మనిషి గంభీరం మనసు మాత్రం వెన్న’ అని జగన్‌ పరిచయం చేశారు. రైతులను ఎర్రిపప్పలుగా అభివర్ణించిన మంత్రి కారుమూరి మనసు వెన్న అని ముఖ్యమంత్రి కితాబు ఇవ్వడం విశేషం. తణుకులో జరిగిన రూ.వందల కోట్ల టీడీఆర్‌ బాండ్ల కుంభకోణం రాష్ట్రాన్ని కుదిపేసింది. ఎందరికో నష్టం కలిగించింది. తణుకు ప్రజాప్రతినిధిగా అప్రమత్తమై ఇలాంటివి నిరోధించాల్సింది పోయి ఇతరత్రా విమర్శలు మూటగట్టుకున్నారు. అంతే కాదు మొదటి నుంచి ఆయనతో ఉన్న పలువురు వైకాపా నాయకులు కారుమూరి వ్యవహారశైలి నచ్చక దూరమయ్యారు. అలాంటి నాయకుడి మనసు వెన్న అన్న కితాబు ప్రజల్లో చర్చనీయాంశమవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని