కోడ్‌ ఉండగా వైకాపా వాళ్లు ధర్నాలెలా చేస్తారు?

సీఎం జగన్‌పై రాయితో దాడి జరిగిన రోజున వైకాపా వాళ్లు రహదారులపైకి వచ్చి ధర్నాలు, నిరసనలు చేయడం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని తెదేపా నేతలు తెలిపారు.

Published : 17 Apr 2024 05:44 IST

సీఈవోకు తెదేపా నేతల ఫిర్యాదు

ఈనాడు డిజిటల్‌, అమరావతి : సీఎం జగన్‌పై రాయితో దాడి జరిగిన రోజున వైకాపా వాళ్లు రహదారులపైకి వచ్చి ధర్నాలు, నిరసనలు చేయడం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని తెదేపా నేతలు తెలిపారు. ధర్నా చేస్తుంటే వాళ్లను పోలీసులు కనీసం అడ్డుకోలేదన్నారు. మండపేట వైకాపా అభ్యర్థి తోట త్రిమూర్తులు, కనిగిరి వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్‌ తదితరులు వాలంటీర్లతో సమావేశాలు నిర్వహించి, ఎన్నికల ప్రచారం చేయాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. అవసరమైతే రాజీనామా చేయాలని వాలంటీర్లను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా అంశాలపై మంగళవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌ కుమార్‌ మీనాకు ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకర్లతో వర్ల రామయ్య మాట్లాడుతూ.. పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్‌ లాంటి వాళ్లు వైకాపా తొత్తుల్లా వ్యవహరిస్తూ, ఐఏఎస్‌ అధికారుల పరువు తీస్తున్నారని వర్ల దుయ్యబట్టారు. ‘‘23వ తేదీన విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలని ఉపాధ్యాయులు ఆదేశించారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చింది?’’ అని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో ‘కోడి కత్తి’ నాటకంతో లబ్ధిపొందిన జగన్‌...ఈసారి గులక రాయిని వాడుకొంటున్నారని ఎద్దేవా చేశారు. ఆయన వెంట తెదేపా నేతలు కేఎస్‌ జవహర్‌, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్‌ రామకృష్ణ, మన్నవ సుబ్బారావు, సయ్యద్‌ రఫీ తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని