రాష్ట్రానికి విజనరీ కావాలా.. ప్రిజనరీ కావాలా?

ధర్మానికి, అధర్మానికి; న్యాయానికి, అన్యాయానికి; నీతికి, అవినీతికి; టూరిజానికి, శాడిజానికి; విజనరీకి, ప్రిజనరీకి మధ్య జరుగుతున్న పోరాటంలో ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని తెలంగాణ తెదేపా నేత నర్సిరెడ్డి పిలుపునిచ్చారు.

Updated : 17 Apr 2024 08:22 IST

జనం వీపులు నిమిరి.. నెత్తిన చేతులు పెట్టిన జగన్‌
ఆకట్టుకున్న తెలంగాణ తెదేపా నేత నర్సిరెడ్డి ప్రసంగం

ఈనాడు, అమరావతి: ధర్మానికి, అధర్మానికి; న్యాయానికి, అన్యాయానికి; నీతికి, అవినీతికి; టూరిజానికి, శాడిజానికి; విజనరీకి, ప్రిజనరీకి మధ్య జరుగుతున్న పోరాటంలో ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని తెలంగాణ తెదేపా నేత నర్సిరెడ్డి పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో తెదేపా ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ‘ప్రజాగళం.. గురజాల ఆత్మగౌరవ సభ’లో నర్సిరెడ్డి ప్రసంగం ఆకట్టుకుంది. ‘చంద్రబాబు హయాంలో రెండు డీఎస్సీలు వేస్తే, జగన్‌ ఒక్కటీ పూర్తి చేయలేదు. తెదేపా ప్రభుత్వం 4.32 లక్షల మందికి నిరుద్యోగ భృతి చెల్లిస్తే దాన్నీ తీసేశారు. నైపుణ్య కేంద్రాల్లో అవినీతి జరిగిందని కుట్ర పన్ని బాబును జైలుకు పంపిన దుష్టుడు జగన్‌’ అని మండిపడ్డారు. ‘ఇద్దరికి రెండు ఓట్లు వేసి, ముగ్గురితో పని చేయించుకోండి. ఎమ్మెల్యేగా యరపతినేని శ్రీనివాసరావు, ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయలుతో పాటు ఎమ్మెల్సీగా ఉన్న జంగా కృష్ణమూర్తితోనూ సేవలు పొందవచ్చ’ని సూచించారు.

నర్సిరెడ్డి ప్రసంగంలోని వ్యంగ్యోక్తులు.. విసుర్లు

 • జగన్‌.. 2014లో నాన్న లేడు అన్నారు. జనం నమ్మారు. 2019లో చిన్నాన్న లేడు అన్నారు. జనం నమ్మారు. ఒక్క అవకాశమివ్వండి, అంటే అక్కలంతా కరిగిపోయి ఓటేశారు. ఆ పాపానికి ఇంట్లో వెలుగు, నదిలో ఇసుక, గుడిలో విగ్రహాలు పోయాయి. నేరాలు పెరిగిపాయే.. ఘోరాలు జరిగిపాయే.. పరిశ్రమలు పారిపాయే.. అప్పులు పెరిగిపాయే.. అమ్మకు గౌరవాధ్యక్ష పదవి పాయే.. చెల్లికి ఆస్తి పాయే.. బాబాయి పైకి పాయే.. బాబు జైలుకు పాయే.. రాజశేఖరరెడ్డి కుమారుడని నమ్మిన పాపానికి.. మనల్నే అమ్మిన దుష్టుడు జగన్‌.
 • ఐదేళ్లలో జగన్‌ ప్రజలకు కనిపిస్తే బ్రేకింగ్‌ న్యూస్‌. మాట్లాడితే షాకింగ్‌ న్యూస్‌. మెరుపు తీగ వచ్చినట్లు పరదాల మధ్యన వచ్చిపోతారు.
 • నేను 130 సార్లు బటన్‌ నొక్కాను. నా కోసం ఒక్కసారి నొక్కాలని జగన్‌ అంటుంటే.. అనంతపురం జిల్లాలో ఓ ఎంపీ లైవ్‌లో బటన్‌ చించుకొని నొక్కుకున్నారు. ఇంతటి మహానాయకులు వీరు.
 • ‘ఆడుదాం అంధ్రా’ అని ఆటల పోటీ పెడితే అంబటి రాంబాబు గంట ఆడుదామన్నారు. అవంతి శ్రీనివాస్‌ అరగంట చాలన్నారు.
 • గన్‌ కంటే తొందరగా జగన్‌ వస్తారని రోజక్క చెబుతున్నారు. గన్‌ కంటే వేగంగా వైకాపా నాయకులు ఈవినింగ్‌ డార్లింగ్‌.. మార్నింగ్‌ డైవర్స్‌ అంటున్నారు.
 • రాష్ట్రంలో బడిలో పిల్లోడికి, గుడిలో దేవుడికి రక్షణ లేదు. పట్టపగలు వీధిలోకి వెళ్లినోడు ఇంటికి చేరే గ్యారెంటీ లేదు.
 • పాదయాత్రలో జగన్‌ జనం నుదుట ముద్దులు పెట్టారు. చెంపకు చెంపలు కలిపారు. గవదకు గంధం పూశారు. వీపున చేతులు నిమిరారు. అధికారంలోకి రాగానే నెత్తిన చేతులు పెట్టారు.
 • 99.5 శాతం హామీలు అమలు చేశానని చెబుతున్న జగన్‌.. 730 హామీలిచ్చి 85 శాతం కూడా అమలు చేయలేదు. 2.30 లక్షల ఉద్యోగాలేమయ్యాయి? 1.40 లక్షల బ్యాక్‌లాగ్‌ పోస్టులేమయ్యాయి? మెగా డీఎస్సీ ఏదీ? కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఏదీ? జాబ్‌ క్యాలెండర్‌ లేదు. మద్య నిషేధం అమలుకాలేదు. చెరుకు ఫ్యాక్టరీలు తెరవలేదు. ప్రత్యేక హోదా రాలేదు. రైల్వే జోన్‌ రాలేదు. దుగరాజపట్నం పోర్టు రాలేదు. కడపకు ఉక్కు ఫ్యాక్టరీ తేలేదు.
 • ఫ్యానుకు ఓటేసిన పాపానికి రాష్ట్రంలో ఫ్యాను వేసుకునే పరిస్థితి లేదు. 9 సార్లు కరెంటు ఛార్జీలు, 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. మద్యం, గ్యాస్‌, పెట్రోలు, డీజిల్‌ ధరలు పెంచుడే కాదు, చెత్త మీదా పన్ను వేసి మన ముఖాన మన్ను కొట్టిన మహానుభావుడు జగన్‌. ఇంతటి సక్కనైన పాలనకు 40 మంది సలహాదారులు సజ్జలు, జొన్నలు, రాగులు..
 • తనకు టీవీ, పత్రిక లేవని చెప్పుకొనే జగన్‌.. బ్రాహ్మణి స్టీల్స్‌, రఘురామ్‌ సిమెంట్‌, కర్ణాటక, సిక్కింలో పవర్‌ ప్రాజెక్టులు, జింపెక్స్‌ సంస్థ, సాక్షి పత్రిక, ఛానెల్‌, బెంగళూరులో వెయ్యెకరాల భూమి, రూ.250 కోట్ల కాంప్లెక్స్‌, హైదరాబాద్‌లో 60 ఎకరాల జాగా.. ఎవరివో మాత్రం చెప్పరు. ఇన్ని ఉండీ, చెల్లి షర్మిల ఆస్తిలో వాటా అడిగితే గొంతు పట్టుకుంటారా?
 • రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రానికి నాడు సీఎం అయిన చంద్రబాబు.. బస్సులోంచే పాలన సాగించి, ఎన్నో సంక్షేమ పథకాలతో మెప్పిస్తే ఆయన్ను ఓడగొట్టారు. 11.40 లక్షల ఇళ్లు కట్టించి, 4 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇచ్చి, డ్వాక్రా మహిళలకు రూ.20 వేల కోట్ల రుణాలిచ్చి, 1.87 లక్షల మందికి సైకిళ్లు ఇచ్చి, 1.47 లక్షల మందికి పౌష్టికాహారం అందించి, రోడ్లు నిర్మించి, రవాణా సౌకర్యం కల్పించి, తాగునీరు, సాగునీరు, షాదీఖానాలు ఇస్తే ఆయన్ను ఓడించారు. పాలిచ్చే బర్రెను కాదని, తన్నె దున్నపోతును కొనుక్కున్నట్లైంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని