కాంగ్రెస్‌లో వలసల ప్రభావమెంత?

కాంగ్రెస్‌లోకి కొనసాగుతున్న భారీ వలసలు లోక్‌సభ ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతాయన్నది చర్చనీయాంశంగా మారింది.

Updated : 18 Apr 2024 06:22 IST

 భారాస, భాజపాల నుంచి భారీగా చేరికలు
హస్తం బలంగా ఉన్న నియోజకవర్గాల్లోనూ ఇదే తీరు
6 లోక్‌సభ నియోజకవర్గాలపై పార్టీ ప్రధాన దృష్టి

ఈనాడు, హైదరాబాద్‌: కాంగ్రెస్‌లోకి కొనసాగుతున్న భారీ వలసలు లోక్‌సభ ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతాయన్నది చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్‌ బలహీనంగా ఉండి అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ ఓట్లు వచ్చిన చోటే కాకుండా బలంగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా చేరికలు కొనసాగుతున్నాయి. ప్రత్యేకించి స్థానిక సంస్థల ప్రతినిధులు, మండల, గ్రామ స్థాయిలోని ఇతర పార్టీల్లో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు ఎక్కువగా చేరుతున్నారు. భారాస నుంచే కాకుండా, భాజపా నుంచీ చేరికలు పెరిగాయి. అసెంబ్లీ ఎన్నికల్లో భారాస నుంచి గెలుపొందిన ముగ్గురు ఎమ్మెల్యేలు చేరగా, భాజపా అభ్యర్థులుగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో కొందరు హస్తం గూటికి చేరారు. ఇందులో కొందరు గతంలో కాంగ్రెస్‌లో ఉండి తర్వాత భాజపాలో చేరిన వారు కాగా, కొందరు ముందు నుంచి భాజపాలో పని చేస్తున్నవారు.

  భాజపా నుంచి...

భాజపా నేత, మహబూబ్‌నగర్‌ మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, ఆయన కుమారుడు.. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ నుంచి పోటీ చేసిన మిథున్‌రెడ్డి గత నెలలో కాంగ్రెస్‌లో చేరారు. భాజపా తరఫున మక్తల్‌ నుంచి పోటీ చేసిన జలంధర్‌రెడ్డి ఇటీవల పార్టీలోకి వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు 45వేల ఓట్లు వచ్చాయి. అలాగే కుత్బుల్లాపూర్‌ బరిలో నిలిచిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌, సంగారెడ్డి నుంచి పోటీ చేసిన పులిమామిడి రాజు, మానకొండూరు నుంచి బరిలోకి దిగిన మోహన్‌ తదితరులున్నారు. మాజీ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావు కూడా హస్తం గూటికి చేరారు. కూన శ్రీశైలంగౌడ్‌కు లక్ష ఓట్లకు పైగా వచ్చాయి. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా నుంచి పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన శ్రీగణేశ్‌ ఇప్పుడు కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఉప ఎన్నికలో పోటీ చేస్తున్నారు. వారంతా చేరినంత మాత్రాన నాడు భాజపాకు వచ్చిన ఓట్లన్నీ కాంగ్రెస్‌కు పడే అవకాశం లేదు. భాజపా తరఫున ఎవరు పోటీ చేసినా వచ్చే ఓట్లు కొన్ని ఉంటాయి. అయితే ఆయా నియోజకవర్గాల్లో చేరికల ప్రభావం కొంతమేర ఉండే అవకాశం ఉంది. ఇది కాంగ్రెస్‌కు లోక్‌సభ ఎన్నికల్లో ఏ మేరకు ఉపయోగపడుతుందో వేచి చూడాల్సి ఉంది.

  భారాస నుంచి ...

భారాస నుంచి కాంగ్రెస్‌కు భారీగా వలసలున్నాయి. ప్రత్యేకించి పలు నియోజకవర్గాల్లోని   స్థానిక సంస్థల ప్రతినిధులు చేరారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు కాంగ్రెస్‌ కండువా ధరించారు. దానం సికింద్రాబాద్‌ లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా, వరంగల్‌ లోక్‌సభ నుంచి కడియం శ్రీహరి కుమార్తె కావ్య బరిలోకి దిగారు. ఎంపీలు రంజిత్‌రెడ్డి, వెంకటేశ్‌, పసునూరి దయాకర్‌తోపాటు సిర్పూర్‌, ముథోల్‌, నర్సాపూర్‌ మాజీ ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, విఠల్‌రెడ్డి, మదన్‌రెడ్డి చేరారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు పురాణం సతీష్‌, రాజేశ్వర్‌, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి తదితరులు కాంగ్రెస్‌ గూటికి వచ్చారు. హైదరాబాద్‌ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ తదితరుల చేరికలపై కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ప్రత్యేకించి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, చేవెళ్ల, మహబూబ్‌నగర్‌, మల్కాజిగిరి, సికింద్రాబాద్‌ నియోజకవర్గాలపై ఎక్కువ దృష్టి సారించి పార్టీ చేరికలను ప్రోత్సహిస్తున్నట్లు స్పష్టమవుతోంది. కాంగ్రెస్‌లో చేరిన ఎంపీ రంజిత్‌రెడ్డిని మళ్లీ చేవెళ్ల నుంచి పోటీకి దింపగా, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి సతీమణి, వికారాబాద్‌ జడ్పీ ఛైర్‌పర్సన్‌గా ఉన్న సునీతారెడ్డిని మల్కాజిగిరి నుంచి బరిలో నిలిపారు. బలమైన అభ్యర్థులు అని అనుకొన్నవారిని కాంగ్రెస్‌లో చేర్చుకొని ఎంపీ టికెట్లు కూడా ఇచ్చింది.

లోక్‌సభ ఎన్నికల ప్రాధాన్యం దృష్ట్యా..

కొన్ని చోట్ల ఈ చేరికల పట్ల కింది స్థాయి నాయకుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది కూడా. మండల, జిల్లా స్థాయుల్లో పదవుల్లో ఉండి ప్రజా వ్యతిరేకత కూడగట్టుకోవడం వల్ల ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని చోట్ల ప్రజలు వ్యతిరేకంగా ఓటు వేశారని, ఇప్పుడు ఆ నాయకులనే చేర్చుకొంటే కాంగ్రెస్‌పై ఉన్న సానుకూలత వ్యతిరేకంగా మారుతుందనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల ఇప్పటికే రెండు గ్రూపులుంటే కొత్తగా చేరే వారితో మూడో గ్రూపు తయారవుతుందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అయితే లోక్‌సభ ఎన్నికలకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా ఏ అవకాశాన్నీ వదులుకోకూడదన్న అభిప్రాయం కాంగ్రెస్‌ ముఖ్యనాయకుల్లో వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మూడో స్థానం వచ్చింది. ఇక్కడ అభ్యర్థి ఎంపిక, సిర్పూర్‌, ముథోల్‌ మాజీ ఎమ్మెల్యేల చేరికతోపాటు పలువురు స్థానిక నాయకుల రాకతో గట్టి పోటీ ఇచ్చే పరిస్థితికి వచ్చిందన్నది కాంగ్రెస్‌ నాయకుల వాదన. ఇటీవల ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ హైదరాబాద్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కూడా చేరికల అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఎవరు రావడానికి ఆసక్తి చూపినా ఆహ్వానించాలని సూచించినట్లు తెలిసింది. వారు భాజపాలోకి వెళ్తే ఆ పార్టీ బలపడే అవకాశం ఉందని, దానికి ఎటువంటి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వొద్దని ముఖ్య నాయకులందరికీ స్పష్టం చేసినట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్‌ రాలేదనో, ఇతరత్రా కారణాలతోనో పార్టీని వదిలి వెళ్లినవారందర్నీ కూడా తిరిగి ఆహ్వానించాల్సిందిగా సూచించినట్లు సమాచారం. అయితే ఫిరాయింపుల ప్రభావం ఏ మేరకు ఉందన్నది ఎన్నికల్లో తేలనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని