బ్యాలెట్‌తో ఎన్నికలంటే భాజపాకు భయమెందుకు?

ప్రపంచవ్యాప్తంగా బ్యాలెట్‌ పేపర్‌ ద్వారానే ఎన్నికలు జరుగుతున్నాయని, మనదేశంలో బ్యాలెట్‌ ఎన్నికలంటే భాజపాకు, ప్రధాని మోదీకి భయమెందుకని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

Updated : 18 Apr 2024 06:21 IST

ఈవీఎంలపై జనాలకు విశ్వాసం లేదు
దక్షిణ భారతంపై మోదీకి చిన్నచూపు
రాహుల్‌ గాంధీ ప్రధాని కాబోతున్నారు
వయనాడ్‌ ప్రచార సభలో సీఎం రేవంత్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా బ్యాలెట్‌ పేపర్‌ ద్వారానే ఎన్నికలు జరుగుతున్నాయని, మనదేశంలో బ్యాలెట్‌ ఎన్నికలంటే భాజపాకు, ప్రధాని మోదీకి భయమెందుకని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కేరళ రాష్ట్రంలోని వయనాడ్‌ లోక్‌సభ నియోజకవర్గంలో బుధవారం ఆయన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. బహిరంగ సభలో ప్రసంగించారు. మీడియాతో కూడా మాట్లాడారు. ‘‘ఈవీఎంలపై జనాలకు నమ్మకం లేదు. కేవలం భాజపాకే నమ్మకం ఉంది. ‘మోదీ ఉన్నారు.. ఈవీఎంలు ఉన్నాయి. కాంగ్రెస్‌ అధికారంలోకి రాదు’ అని పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో భాజపా నేతలు అన్నారు. జనం కోరుకున్నట్లు బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహిస్తే అసలు గెలుపు ఎవరిదనేది తేలుతుంది. రాహుల్‌ గాంధీ  ప్రధాని కాబోతున్నారు. రాబోయే 20 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉంటారు. రాహుల్‌ ఇక్కడి నుంచి ఎన్నికైతే కేరళ, వయనాడ్‌ అభివృద్ధికి వరదలా నిధులు వస్తాయి.

భాజపాకు మద్దతిస్తున్న కేరళ సీఎం పినరయి విజయన్‌

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ మోదీకి సహకరిస్తూ భాజపాకు మద్దతిస్తున్నారు. ప్రజలు పిచ్చోళ్లు కాదు. తెలివైన వారు. సరైన నిర్ణయం తీసుకుని ఓటు వేస్తారు. దేశ ప్రజలు నరేంద్ర మోదీని రెండుసార్లు ప్రధానిని చేస్తే దక్షిణ భారతదేశానికి ఆయన ఏం చేశారు? దక్షిణ భారతం దేశంలో భాగం కాదా? గత పదేళ్లుగా మోదీ మాకు (దక్షిణ భారతానికి) నిధులు, బుల్లెట్‌ రైలు, సబర్మతీ రివర్‌ఫ్రంట్‌ వంటి ప్రాజెక్టులు ఎందుకు ఇవ్వడం లేదు? ఈరోజు ఓట్ల కోసం ఆయనకు ఈ ప్రాంతం గుర్తుకొచ్చింది. రాష్ట్రపతి, హోంమంత్రి, రక్షణ మంత్రి వంటి కీలక పదవుల్ని ఈ ప్రాంత వాసులకు ఆయన ఎందుకు ఇవ్వలేదు? ఈ ప్రాంతాన్ని భాజపా వేరుగా చూస్తోంది. మమ్మల్ని ప్రధాని సరైన రీతిలో గౌరవించనప్పుడు మా ఓట్లను ఎందుకు అడుగుతున్నారు? అవినీతి గురించి మోదీ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. హిమంత బిశ్వశర్మ, అజిత్‌పవార్‌ వంటి నేతలను పక్కన పెట్టుకుని అవినీతి గురించి మోదీ మాట్లాడటం సరికాదు. మద్యం కుంభకోణంలో రూ.వందకోట్ల అవినీతి జరిగిందని కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారు. అదే మద్యం వ్యాపారులు రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్లు ఎన్నికల బాండ్ల పేరుతో ఇచ్చారు. అది లీగల్‌ అవినీతా’’ అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.


  • కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకూ, మణిపుర్‌ నుంచి ముంబయి వరకూ రాహుల్‌ గాంధీ పాదయాత్ర  చేసి ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నారు. భాజపాతో పోరాడుతున్న ఆయన కాకుండా ఇంకెవరు ప్రధాని అవుతారు? వయనాడ్‌ ప్రజలు ఒక ఎంపీని ఎన్నుకోవడానికి ఓటు వేయడం లేదు. ఈ దేశానికి కాబోయే ప్రధానిని ఎన్నుకోవడానికి వేస్తున్నారు.
  • తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్‌ను ఓడిస్తామంటే ఎవరూ నమ్మలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాను సింగిల్‌ డిజిట్‌ సీట్లకే పరిమితం చేస్తామంటే విశ్వసించలేదు. కానీ మేము చేసి చూపించాం. అలాగే ఇప్పటి ఎన్నికల్లో కూడా తెలంగాణలో కాంగ్రెస్‌కు 14 లోక్‌సభ సీట్లు వస్తాయి.

సీఎం రేవంత్‌రెడ్డి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని