సార్వత్రిక సవాల్‌..

సార్వత్రిక ఎన్నికల సమరానికి రాష్ట్రం సిద్ధమైంది. శాసనసభ ఎన్నికల అనంతరం మరో ప్రతిష్ఠాత్మక పోరుకు తెరలేస్తోంది.

Published : 18 Apr 2024 06:23 IST

నేడే నోటిఫికేషన్‌.. నామినేషన్ల స్వీకారం
ప్రధాన పార్టీలకు, నేతలకు ప్రతిష్ఠాత్మకం
అస్త్రశస్త్రాలతో సిద్ధమైన కాంగ్రెస్‌, భారాస, భాజపా
ఇప్పటికే ప్రచారానికి నాంది
అందరి దృష్టీ రెండంకెల స్థానాలపైనే
ఈనాడు - హైదరాబాద్‌

సార్వత్రిక ఎన్నికల సమరానికి రాష్ట్రం సిద్ధమైంది. శాసనసభ ఎన్నికల అనంతరం మరో ప్రతిష్ఠాత్మక పోరుకు తెరలేస్తోంది. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్‌ వెలువడడంతోపాటు నామినేషన్ల పర్వం కూడా ప్రారంభం కానుంది. మెజారిటీ స్థానాల్లో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, భారాస, భాజపా ఈ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించాయి. శాసనసభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలతో రాష్ట్రంలో అధికారం సాధించిన కాంగ్రెస్‌ పార్టీ.. అయిదు నెలల్లోనే ఎదుర్కోబోయే లోక్‌సభ పోరు ప్రతిష్ఠాత్మకం కావడంతో హోరాహోరీకి సిద్ధమైంది. మొన్నటి ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన భారాస తన సత్తాను నిరూపించుకోవాలన్న పట్టుదలతో ఉంది. శాసనసభ ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని పెంచుకున్న భాజపా.. లోక్‌సభ పోరులో గతంలో కంటే ఎక్కువ స్థానాలు సాధించాలన్న లక్ష్యంతో బరిలో దిగుతోంది. భారాస, భాజపాలు అన్ని స్థానాలకూ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించగా.. కాంగ్రెస్‌ 14 సీట్లకు పేర్లు ఖరారు చేసింది. కరీంనగర్‌, ఖమ్మం, హైదరాబాద్‌లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. పలువురు అభ్యర్థులు తొలిరోజైన గురువారం నుంచే నామినేషన్లు దాఖలు చేయడానికి సన్నద్ధమవుతున్నారు. నెల రోజుల కిందటే ఎన్నికల షెడ్యూలు వెలువడడంతో ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ, భారాస అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో బహిరంగసభలతో ప్రచారాన్ని ఇప్పటికే ప్రారంభించారు. సీపీఎం భువనగిరి నుంచి పోటీ చేస్తుండగా.. సీపీఐ పోటీ చేయబోయే స్థానంపై కసరత్తు చేస్తోంది. ఎంఐఎం సిటింగ్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ మరోసారి హైదరాబాద్‌ బరిలో నిలిచారు. కాంగ్రెస్‌ తరఫున ముగ్గురు మహిళలు, భాజపా నుంచి ఇద్దరు, భారాస తరఫున ఒకరు పోటీ చేస్తున్నారు.

బరిలో సిటింగ్‌ ఎంపీలు 9 మంది..

రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో ఈసారి సిటింగ్‌ ఎంపీల్లో తొమ్మిది మంది మాత్రమే పోటీ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌, భాజపాలు చేరికలపై దృష్టి సారించి క్షేత్రస్థాయిలో బలం పెంచుకునేందుకు ప్రయత్నించే క్రమంలో భారాసకు చెందిన తొమ్మిది మంది సిటింగ్‌ ఎంపీల్లో అయిదుగురు పార్టీ మారిపోయారు. వీరిలో ముగ్గురు కాంగ్రెస్‌లో, ఇద్దరు భాజపాలో చేరారు. భారాస సిటింగ్‌ ఎంపీల్లో ఒకరు కాంగ్రెస్‌ తరఫున, మరొకరు భాజపా అభ్యర్థిగా బరిలో దిగారు. గత ఎన్నికల్లో చేవెళ్ల నుంచి భారాస తరఫున నెగ్గిన ఎంపీ జి.రంజిత్‌రెడ్డి ఈసారి అదే స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. జహీరాబాద్‌ భారాస సిటింగ్‌ ఎంపీ బి.బి.పాటిల్‌ ఈసారి అక్కడి నుంచే భాజపా అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. భారాసకు చెందిన మరో ఇద్దరు సిటింగ్‌ ఎంపీలు.. వెంకటేశ్‌ నేత, పసునూరి దయాకర్‌ కాంగ్రెస్‌లో చేరినా ఈసారి పోటీలో లేరు. నాగర్‌కర్నూల్‌ భారాస ఎంపీ రాములు భాజపాలో చేరి.. తన కుమారుడు భరత్‌ప్రసాద్‌ను కమలం తరఫున బరిలో నిలిపారు. గత లోక్‌సభ ఎన్నికల్లో నెగ్గిన ముగ్గురు కాంగ్రెస్‌ ఎంపీలు ఈసారి పోటీలో లేరు. వారిలో రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగా.. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాష్ట్ర మంత్రులుగా ఉన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో భారాస తరఫున మెదక్‌ స్థానంలో విజయం సాధించిన కొత్త ప్రభాకర్‌రెడ్డి.. ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఆయన కూడా లోక్‌సభకు పోటీ చేయడంలేదు. ఆదిలాబాద్‌ భాజపా సిటింగ్‌ ఎంపీ సోయం బాపురావుకు ఈసారి టికెట్‌ దక్కలేదు. మాజీ మంత్రి, భారాస నుంచి ఖైరతాబాద్‌ ఎమ్మెల్యేగా నెగ్గిన దానం నాగేందర్‌.. కాంగ్రెస్‌లో చేరి.. సికింద్రాబాద్‌ నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. తొలుత వరంగల్‌ భారాస అభ్యర్థిగా ఎంపికైన కడియం కావ్య.. నాటకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ మారి, ప్రస్తుతం కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. భారాస మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి నల్గొండ భాజపా అభ్యర్థిగా బరిలో ఉన్నారు.

పట్టు నిలుపుకొనే యత్నంలో భారాస

శాసనసభ ఎన్నికల్లో వెనకబడిన భారాస.. సిటింగ్‌ లోక్‌సభ స్థానాలతోపాటు మిగిలిన సీట్లపైనా ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించింది. అధినేత కేసీఆర్‌ బహిరంగసభలతో శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు ఇతర ముఖ్యనేతలు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలతో పాటు, కేంద్రంలోని భాజపా విభజన హామీలు అమలు చేయలేదనే అంశాలను భారాస ప్రచారాస్త్రాలుగా సంధిస్తోంది. భారాసకు చెందిన తొమ్మిదిమంది సిటింగ్‌ ఎంపీల్లో ఇప్పుడు ముగ్గురు మాత్రమే పోటీలో ఉన్నారు. ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, మహబూబ్‌నగర్‌ నుంచి మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మహబూబాబాద్‌ నుంచి ఎం.కవిత మాత్రమే బరిలో నిలిచారు. కొందరు పార్టీని వీడి వెళ్లడం, మారిన సమీకరణాల రీత్యా మిగిలిన 14 స్థానాల్లో ఇతర అభ్యర్థులను భారాస బరిలో దించింది. బీఎస్పీ నుంచి భారాసలో చేరిన ఐపీఎస్‌ మాజీ అధికారి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ నాగర్‌కర్నూల్‌ నుంచి పోటీ చేస్తున్నారు. కేసీఆర్‌ గురువారం తమ పార్టీ అభ్యర్థులు 17 మందికి బీఫాంలను అందజేయనున్నారు.

బలం పెంచుకోవడమే లక్ష్యంగా భాజపా

గత లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో నెగ్గిన భాజపా ఈసారి రెండంకెల సీట్లపై దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో కంటే ఓట్ల శాతం పెరగడంతో లోక్‌సభ పోరులోనూ సత్తా చాటాలని ముందుకు సాగుతోంది. చేరికలకు ప్రాధాన్యం ఇచ్చిన భాజపా ముందుగానే అభ్యర్థులను ప్రకటించింది. కేంద్రంలో పదేళ్ల భాజపా పాలనలో విజయాలు, మరోమారు ప్రధానిగా మోదీ ఉండాల్సిన అవసరం, కాంగ్రెస్‌ ఇచ్చిన గ్యారంటీ హామీల అమలులో లోపాలు, పదేళ్ల భారాస పాలన వైఫల్యాలను ప్రచారాస్త్రాలుగా భాజపా ప్రయోగిస్తోంది. అగ్రనేతలు నరేంద్రమోదీ, అమిత్‌షాలతో పాటు కేంద్రమంత్రులు, ఇతర ముఖ్యనేతల ప్రచారానికి కార్యాచరణ సిద్ధమవుతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మరోమారు సికింద్రాబాద్‌ నుంచి పోటీ చేస్తుండగా.. జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ కరీంనగర్‌, జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ మహబూబ్‌నగర్‌, మరో ముఖ్యనేత ఈటల రాజేందర్‌ మల్కాజిగిరి, డి.అర్వింద్‌ నిజామాబాద్‌ స్థానాల నుంచి బరిలో దిగారు. నామినేషన్ల కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేలా భాజపా ఏర్పాట్లు చేసుకుంటోంది. గురువారం గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌.. మెదక్‌ అభ్యర్థి రఘునందన్‌రావు నామినేషన్‌లో, కేంద్రమంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురి.. ఈటల రాజేందర్‌ నామినేషన్‌లో పాల్గొననున్నారు. 19న రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌.. కిషన్‌రెడ్డి నామినేషన్‌లో పాల్గొంటుండగా ఇతర అభ్యర్థుల నామినేషన్‌ కార్యక్రమాలకు కేంద్రమంత్రులు, ఇతర రాష్ట్రాల సీఎంలు హాజరు కానున్నారు.

కాంగ్రెస్‌కు కీలకం

శాసనసభ ఎన్నికల్లో 64 స్థానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు లోక్‌సభ ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారాయి. మూడు లోక్‌సభ సిటింగ్‌ స్థానాలు ఉన్న కాంగ్రెస్‌ పార్టీ శాసనసభ ఎన్నికల విజయోత్సాహంతో రెండంకెల ఎంపీ సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం, అగ్రనేతలు ప్రత్యేక దృష్టి సారించారు. తొలి ప్రచారసభను హైదరాబాద్‌ సమీపంలోని తుక్కుగూడలో నిర్వహించగా.. అగ్రనేత రాహుల్‌గాంధీ హాజరయ్యారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. బలాబలాలను సర్వేలతో మదింపు చేసుకుని ఏ అవకాశాన్నీ వదులుకోకూడదనే ప్రణాళికను కాంగ్రెస్‌ అమలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీలతో పాటు.. పార్టీ జాతీయస్థాయి మ్యానిఫెస్టో అంశాలనూ ప్రజల్లోకి తీసుకెళ్తోంది. నామినేషన్ల సందర్భంగా ర్యాలీలు నిర్వహించేందుకు కాంగ్రెస్‌ అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. ర్యాలీలు, నామినేషన్ల కార్యక్రమాల్లో కొన్నిచోట్ల ముఖ్యమంత్రి, మరికొన్నిచోట్ల మంత్రులు, ఇతర ముఖ్యనేతలు పాల్గొంటారు. రాహుల్‌, ప్రియాంకలు పలు ప్రచారసభలకు హాజరుకానున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని