ఉత్తర్‌ప్రదేశ్‌ బరిలో తెలంగాణ మహిళ.. ఆమె ఆస్తులు ఎంతంటే?

ఉత్తర్‌ప్రదేశ్‌లోని జౌన్‌పుర్‌ లోక్‌సభ స్థానం నుంచి తెలంగాణ మహిళ శ్రీకళారెడ్డి పోటీచేస్తున్నారు.

Updated : 18 Apr 2024 10:00 IST

ఈనాడు, దిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని జౌన్‌పుర్‌ లోక్‌సభ స్థానం నుంచి తెలంగాణ మహిళ శ్రీకళారెడ్డి పోటీచేస్తున్నారు. ఆమె స్థానిక మాజీ ఎంపీ ధనుంజయ్‌సింగ్‌ మూడో భార్య. స్థానికంగా, రాజకీయంగా మంచిపట్టున్న ధనుంజయ్‌సింగ్‌కు కిడ్నాప్‌, అక్రమవసూళ్ల కేసులో శిక్షపడడంతో ఎన్నికల్లో పోటీచేసే అవకాశాన్ని కోల్పోయారు. దీంతో తాజా ఎన్నికల్లో ఆయన సతీమణి శ్రీకళారెడ్డికి బీఎస్పీ అధినేత్రి మాయావతి టికెట్‌ ఇచ్చారు. ఫలితంగా జౌన్‌పుర్‌లో భాజపా, సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీల త్రిముఖ పోటీ నెలకొంది. భాజపా తరఫున కృపాశంకర్‌సింగ్‌, ఎస్పీ తరఫున బాబూసింగ్‌ కుశ్వాహా బరిలో ఉన్నారు.

కుటుంబ నేపథ్యం- విద్యార్హతలు

శ్రీకళారెడ్డి తండ్రి కె.జితేందర్‌రెడ్డి. నల్గొండ జిల్లా కోఆపరేటివ్‌ సొసైటీ అధ్యక్షుడిగా, హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర ఎమ్మెల్యేగా పనిచేశారు. తల్లి లలితారెడ్డి. గ్రామసర్పంచిగా సేవలందించారు. నిప్పో బ్యాటరీ గ్రూప్‌ కంపెనీ ఈ కుటుంబానికి చెందినదే. ఇది చెన్నై కేంద్రంగా పనిచేయడంతో శ్రీకళారెడ్డి బాల్యం అక్కడే గడిచింది. ఆమె ఇంటర్మీడియట్‌ చెన్నైలో చేయగా, బీకామ్‌ కోర్సు హైదరాబాద్‌లో పూర్తి చేశారు. గ్రాడ్యుయేషన్‌ పూర్తయ్యాక అమెరికాకు వెళ్లి ఆర్కిటెక్చర్‌ ఇంటీరియర్‌ డిజైనింగ్‌ కోర్సు చేశారు. అనంతరం ఇండియాకు తిరిగొచ్చి కుటుంబం నడిపే వ్యాపారాలను చూసుకున్నారు.

వివాహం-రాజకీయాలు

ధనుంజయ్‌సింగ్‌ మొదటి భార్య చనిపోవడం, రెండోభార్య విడాకులు తీసుకోవడంతో శ్రీకళారెడ్డిని 2017లో పారిస్‌లో వివాహమాడారు. తర్వాత చెన్నైలో ఘనంగా రిసెప్షన్‌ జరిగింది. ఐదేళ్ల క్రితం ఈమె జేపీ నడ్డా సమక్షంలో తెలంగాణలో భాజపాలో కూడా చేరారు. 2021లో ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన జిల్లా పంచాయతీ ఎన్నికల్లో గెలిచి జడ్పీ అధ్యక్షురాలిగానూ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు జౌన్‌పుర్‌ నియోజకవర్గం నుంచి బీఎస్పీ రెండుసార్లు గెలిచింది. 2009లో ధనుంజయ్‌సింగ్‌, 2019లో శ్యాంసింగ్‌యాదవ్‌ విజయం సాధించారు. ఇప్పుడు సిట్టింగ్‌ ఎంపీని పక్కనపెట్టిన బీఎస్పీ.. శ్రీకళారెడ్డికి అవకాశం ఇచ్చింది. 2019 ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ కూటమిగా పోటీచేయగా.. ఇప్పుడు బీఎస్పీ ఒంటరిగానే బరిలోకి దిగింది.

ఆస్తుల లెక్క ఇదీ!

శ్రీకళారెడ్డి పేరిట రూ.780 కోట్ల స్థిరాస్తులు, రూ.6.71 కోట్ల చరాస్తులు ఉన్నాయి. రూ.1.74 కోట్లు విలువైన ఆభరణాలున్నాయి. ధనుంజయ్‌ సింగ్‌ వద్ద రూ.3.56 కోట్ల చరాస్తులు, రూ.5.31 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని