గ్యారంటీగా వచ్చేది మేమే

ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో గ్యారంటీగా అధికారంలోకి వచ్చేది తామేనని ప్రధాని మోదీ మరోసారి ధీమా వ్యక్తంచేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం అస్సాంలోని నలబాడీలో, త్రిపుర రాజధాని అగర్తలలో బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు.

Updated : 18 Apr 2024 06:08 IST

అస్సాం, త్రిపుర సభల్లో మోదీ

నలబాడీ (అస్సాం), అగర్తల: ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో గ్యారంటీగా అధికారంలోకి వచ్చేది తామేనని ప్రధాని మోదీ మరోసారి ధీమా వ్యక్తంచేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం అస్సాంలోని నలబాడీలో, త్రిపుర రాజధాని అగర్తలలో బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. ‘‘మొదటిసారి 2014 ఎన్నికల్లో ప్రజల వద్దకు ఆశతో వెళ్లాం. రెండోసారి 2019లో నమ్మకంతో, ఇప్పుడు మూడోసారి 2024లో గ్యారంటీతో వెళ్తున్నాం. దేశవ్యాప్తంగా మోదీ గ్యారంటీలు వినిపిస్తున్నాయి. ఆ హామీలన్నీ నెరవేర్చే పూచీ నాది అని కూడా నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఈశాన్య భారతమే దీనికి ఉదాహరణ. ఈ ప్రాంతానికి కాంగ్రెస్‌ ఏమైనా ఇచ్చిందంటే అవి సమస్యలు మాత్రమే. భాజపా  ఈ ప్రాంతాన్ని అవకాశాలకు వనరుగా మార్చింది. కాంగ్రెస్‌ ఇక్కడ తిరుగుబాటుకు ఆజ్యం పోసింది. నేను ఈశాన్య ప్రజల్ని హత్తుకుని ఇక్కడ శాంతిని నెలకొల్పాను. 60 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో జరగనిదానిని పదేళ్లలోనే నేను చేసి చూపించాను’’ అని వివరించారు. భాజపా ఎన్నికల ప్రణాళికలోని హామీలను మోదీ మరోసారి గుర్తుచేస్తూ- ఆయుష్మాన్‌ భారత్‌ కింద 70 ఏళ్ల పైబడినవారికి రూ.5 లక్షల వరకు వైద్యఖర్చుల భారం ఆయా కుటుంబాలపై పడకుండా చూస్తామన్నారు. ‘మీ కొడుకుగా ఆ వ్యయం విషయాన్ని నేను చూసుకుంటా’ అని చెప్పారు.  

వారిది లూట్‌ఈస్ట్‌.. మాది యాక్ట్‌ఈస్ట్‌

తూర్పున ఉన్న ప్రాంతాలను దోచుకునేందుకు ‘లూట్‌ఈస్ట్‌’ను కాంగ్రెస్‌ ఒక విధానంగా పాటిస్తే భాజాపా మాత్రం ఆ ప్రాంతానికి మేలు చేసేలా ‘యాక్ట్‌ఈస్ట్‌’ను అమలు చేసిందని మోదీ చెప్పారు. తూర్పు, ఈశాన్య ప్రాంతాలను మరింతగా అభివృద్ధి చేయనున్నామని తెలిపారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉండిఉంటే మొబైల్‌ ఫోన్ల బిల్లులు నెలకు రూ.4,000-5,000కి చేరేవన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని