తొలిదశకు ముగిసిన ప్రచారం

సార్వత్రిక సమరం అసలుసిసలు ఘట్టంలోకి ప్రవేశించింది. ఏడు విడతలకు విస్తరించిన ఎన్నికల్లో తొలిదశ కింద 21 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు శుక్రవారం పోలింగ్‌ జరగనుంది.

Updated : 18 Apr 2024 06:04 IST

రేపు 102 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్‌
అరుణాచల్‌ అసెంబ్లీకి కూడా

దిల్లీ: సార్వత్రిక సమరం అసలుసిసలు ఘట్టంలోకి ప్రవేశించింది. ఏడు విడతలకు విస్తరించిన ఎన్నికల్లో తొలిదశ కింద 21 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు శుక్రవారం పోలింగ్‌ జరగనుంది. నిబంధనల ప్రకారం బుధవారం సాయంత్రంతో ఈ నియోజకవర్గాల్లో ప్రచారానికి తెరపడింది. తమిళనాడులోని మొత్తం 39 నియోజకవర్గాలకూ ఈ దశలోనే ఎన్నికలు జరగనున్నాయి. రాజస్థాన్‌లో 12, ఉత్తర్‌ప్రదేశ్‌ 8, మధ్యప్రదేశ్‌ 6; మహారాష్ట్ర, అస్సాం, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో అయిదు చొప్పున; బిహార్‌లో నాలుగు, పశ్చిమ బెంగాల్‌లో మూడు; అరుణాచల్‌ప్రదేశ్‌, మణిపుర్‌, మేఘాలయల్లో రెండు చొప్పున; ఛత్తీస్‌గఢ్‌, మిజోరం, నాగాలాండ్‌, సిక్కిం, త్రిపుర, అండమాన్‌ నికోబార్‌, జమ్మూకశ్మీర్‌, లక్షద్వీప్‌, పుదుచ్చేరిలలో ఒక్కొక్కటి చొప్పున లోక్‌సభ స్థానాలకు ఈ విడతలో పోలింగ్‌ జరగనుంది. చివరిరోజున- కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంకా గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌యాదవ్‌లు యూపీలో ప్రచారం నిర్వహించారు. ప్రధాని మోదీ అస్సాంతో పాటు త్రిపురలో బహిరంగ సభల్లో పాల్గొన్నారు.

బరిలో 8 మంది కేంద్ర మంత్రులు

ఈ విడతలో 8 మంది కేంద్రమంత్రులు, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, ఓ మాజీ గవర్నర్‌ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

  • కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ (భాజపా) మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌ నుంచి హ్యాట్రిక్‌ విజయంపై కన్నేశారు. 2014లో 2.84 లక్షలు, 2019లో 2.16 లక్షల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందిన ఆయన.. ఈ దఫా ఏకంగా 5 లక్షల మెజార్టీతో ఘన విజయం సాధిస్తానని ధీమాగా చెబుతున్నారు.
  •  కేంద్ర భూవిజ్ఞాన శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు (భాజపా) అరుణాచల్‌ పశ్చిమ స్థానం బరిలో ఉన్నారు. 2004 నుంచి ఇక్కడ ఆయన మూడుసార్లు గెలుపొందారు. ప్రస్తుతం ఆయన ప్రధాన ప్రత్యర్థి అరుణాచల్‌ ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నబమ్‌ తుకి (కాంగ్రెస్‌).
  • ః కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్‌, జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్‌ (భాజపా) అస్సాంలోని దిబ్రూగఢ్‌ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న మరో కేంద్రమంత్రి రామేశ్వర్‌ తేలీని కాదని సోనోవాల్‌కు కమలదళం టికెట్‌ ఇచ్చింది.
  • కేంద్రమంత్రి సంజీవ్‌ బలియాన్‌ (భాజపా) ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ నుంచి బరిలో నిలిచారు. హరీంద్ర మాలిక్‌ (ఎస్పీ), దారాసింగ్‌ ప్రజాపతి (బీఎస్పీ)ల నుంచి ఆయన గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు.
  •  రాజస్థాన్‌లోని బీకానేర్‌లో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌, అళ్వర్‌లో మరో కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌ భాజపా అభ్యర్థులుగా బరిలో ఉన్నారు.
  •  కేంద్ర సహాయమంత్రి జితేంద్రసింగ్‌ (భాజపా) జమ్మూకశ్మీర్‌లోని ఉధమ్‌పుర్‌లో హ్యాట్రిక్‌ విజయం కోసం ప్రయత్నిస్తుండగా.. మరో సహాయమంత్రి ఎల్‌.మురుగన్‌ (భాజపా) తమిళనాడులోని నీలగిరిలో డీఎంకే సిట్టింగ్‌ ఎంపీ ఎ.రాజాను ఢీకొంటున్నారు.
  •  తెలంగాణ గవర్నర్‌, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పదవులకు ఇటీవల రాజీనామా చేసిన తమిళిసై సౌందరరాజన్‌ (భాజపా) తమిళనాడులోని చెన్నై దక్షిణ స్థానంలో పోటీ చేస్తున్నారు.
  • ః త్రిపుర పశ్చిమ నియోజకవర్గంలో మాజీ సీఎం బిప్లబ్‌కుమార్‌ దేవ్‌ (భాజపా) బరిలో ఉన్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని