వ్యూహకర్తలదే పెత్తనం!.. ప్రచారంలో పార్టీలను శాసించేది వారే

భారత రాజకీయాల్లో వ్యూహకర్తల పెత్తనం పెరిగిపోయింది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించే రోజులు పోయాయి. ప్రచారం మొత్తాన్ని వ్యూహకర్తలే శాసించే రోజులు వచ్చాయి.

Updated : 18 Apr 2024 11:18 IST

అన్ని పార్టీలదీ అదే దారి

భారత రాజకీయాల్లో వ్యూహకర్తల పెత్తనం పెరిగిపోయింది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించే రోజులు పోయాయి. ప్రచారం మొత్తాన్ని వ్యూహకర్తలే శాసించే రోజులు వచ్చాయి. ఎక్సెల్‌ షీట్లు, పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్స్‌, లక్షిత సమాచార షేరింగ్‌, సర్వే నివేదికలు, టెక్నాలజీ, అపరిమిత డేటానే ఇప్పుడు ఎన్నికల్లో ముఖ్యాంశాలయ్యాయి. రెండు దశాబ్దాల కిందటి సంప్రదాయ ప్రచారానికి ఇప్పుడు స్థానం లేదు. అంతా వ్యూహాల మయమే. వ్యూహకర్తల పెత్తనమే. గతంలో తెరవెనుక ఉండి సలహాలను ఇచ్చే వ్యూహకర్తలు ఇప్పుడు తెరమీదకు వచ్చి అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకూ అన్నింటినీ శాసిస్తున్నారు.

ఈసారి మరింతగా..

ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో వ్యూహకర్తల పాత్ర గతంలో ఎన్నడూ లేనంతగా విస్తృతమైంది. ఎన్నికలు భావోద్వేగాలపై ఆధారపడి జరుగుతుంటాయని, ఎన్నికల్లో పోరాడటం అనేది ఒక కళ అని, అది సైన్సు కాదనేది సాధారణంగా ఉన్న ఒక అభిప్రాయం. కానీ వ్యూహకర్తల మాట వేరేలా ఉంది. రాజకీయ సలహాదారుల్లో పోస్టర్‌ బోయ్‌ సంస్కృతి వచ్చింది. 2014 ఎన్నికల్లో ప్రశాంత్‌ కిశోర్‌ రూపంలో ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో భాజపా తరఫున వ్యూహాలను ప్రశాంత్‌ కిశోర్‌ రచించారు. ఆ పార్టీ 282 సీట్లను గెలుచుకుంది.

2014లో వ్యూహమిదీ..

సిటిజెన్స్‌ ఫర్‌ ఎకౌంటబుల్‌ గవర్నెన్స్‌ను (సీఏజీ) 2013లో ప్రశాంత్‌ కిశోర్‌ ప్రారంభించారు. రెండేళ్ల తర్వాత అది ఇండియన్‌ పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీగా (ఐ-ప్యాక్‌) రూపాంతరం చెందింది. అప్పటి నుంచి పలు ఎన్నికల్లో పార్టీల తరఫున వ్యూహాలను రచించడం ప్రారంభించింది. ఇందులో భాగంగా 2014 ఎన్నికల్లో ప్రశాంత్‌ కిశోర్‌ బృందం అమలు చేసిన ప్రత్యేక ప్రచారం భాజపాకు బాగా కలిసి వచ్చింది. బ్రాండ్‌ మోదీ, చాయ్‌పే చర్చ, ఐక్యతా ఉద్యమం వంటివి భాజపాను గెలిపించాయి. మోదీని వికాస పురుషుడిగా అభివర్ణిస్తూ ఏర్పాటు చేసిన 3డీ హోలోగ్రామ్‌ ర్యాలీలూ విజయవంతమయ్యాయి.

ముఖ్యమైన ప్రచారకర్తలు

 • దేశంలో పలు పార్టీలతో పని చేసి చాలాసార్లు విజయవంతంగా అధికారం సాధించేలా వ్యూహాలను రచించిన ప్రశాంత్‌ కిశోర్‌ వ్యూహకర్తల్లో ముఖ్యమైన వ్యక్తి. ఆ తర్వాత ఆయన వ్యూహకర్తగా పనిచేయడం మానేసి నేరుగా రాజకీయాల్లోకి వచ్చారు. బిహార్‌లో పాదయాత్ర చేశారు. గతంలో రాజకీయ పార్టీలకు, నేతలకు సలహాలు ఇచ్చేవాడినని, ఇప్పుడు ప్రజలకు నేరుగా అసలైన సమస్యల గురించి వివరిస్తున్నానని ఆయన తెలిపారు. బిహార్‌లో పాదయాత్ర చేసిన ఆయన.. తానేమీ విప్లవాత్మక మార్పుల దిశగా చేయలేదని, క్షేత్ర స్థాయిలో పరిస్థితులపైనే పని చేశానని చెప్పారు.
 • పలు రాష్ట్రాల్లో భాజపా తరఫున పని చేసిన మరో వ్యూహకర్త సునీల్‌ కనుగోలు ఇప్పుడు కాంగ్రెస్‌ తరఫున పని చేస్తున్నారు. ఆయన విజయాల ఖాతాల్లో కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, భారత్‌ జోడో యాత్ర ఉన్నాయి.
 • ఐఐఎం బెంగళూరులో చదివిన పార్థ ప్రతిమ్‌ దాస్‌ 2013లో కర్ణాటకలోని జెవర్గిలో పోటీ చేసిన అజయ్‌ సింగ్‌కు వ్యూహకర్తగా తొలిసారిగా పని చేశారు. 2013 నవంబరులో ఆయన ఆరిందమ్‌ మన్నాతో కలిసి చాణక్య సంస్థను స్థాపించారు. జెవర్గిలో సిటింగ్‌ భాజపా ఎమ్మెల్యేను అజయ్‌ సింగ్‌ 36,700 ఓట్ల తేడాతో ఓడించారు. 2018లో మళ్లీ అజయ్‌ సింగ్‌ తరఫున పని చేసి గెలిపించారు. ‘2009లో సోషల్‌ మీడియా ప్రభావం పెద్దగా లేదు. ఓటింగ్‌ విధానం కూడా కుటుంబ అవసరాలు, ట్రెండ్‌ను బట్టి ఉండేది. ఎల్‌కే ఆడ్వాణీ, ములాయంసింగ్‌ యాదవ్‌ లాంటి వారు దేశమంతా తిరిగేవారు. అయితే కొత్త తరం నేతలు క్షేత్ర స్థాయిలో తిరగడం కంటే వ్యూహాలకే అధిక ప్రాధాన్యమిస్తున్నారు. వారు సాంకేతికతను ఎక్కువగా వాడుకుంటున్నారు. వర్గాలవారీగా ఓట్ల లెక్కలకు ప్రాధాన్యం పెరిగింది. గతంలో సర్వేలకు పెద్దగా ప్రాధాన్యం ఉండేది కాదు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది’ అని పార్థ ప్రతిమ్‌ దాస్‌ స్పష్టం చేశారు.
 • 2016లో వార్‌ రూం స్ట్రాటజీస్‌ అనే సంస్థను తుషార్‌ పాంచాల్‌ ప్రారంభించారు. రాజకీయ వ్యూహకర్తల విధానం కొత్తదేమీ కాదని, దశాబ్దాల కిందటే ఉందని, అయితే అది రహస్యంగా సాగేదని పాంచాల్‌ పేర్కొన్నారు. ప్రశాంత్‌ కిశోర్‌ వచ్చాకే అది బహిరంగమైందని అభిప్రాయపడ్డారు.
 • రాజకీయ వ్యూహ సంస్థలనేవి కొత్త విధానానికి శ్రీకారం చుట్టాయని యాక్సిస్‌ మై ఇండియా ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రదీప్‌ గుప్తా తెలిపారు. గతంలో గెలుపోటములనేవి నాయకులపై ఆధారపడి ఉండేవి. ఇప్పుడవి వ్యూహకర్తల వ్యవహారంగా మారిపోయాయి.

ప్రచార కండూతి

పాంచాల్‌ అభిప్రాయపడినట్లు ప్రశాంత్‌ కిశోర్‌ రాకతో రాజకీయ వ్యూహకర్తలకు ప్రచార కండూతి ఎక్కువైంది. గతంలో వ్యూహకర్త పదవికి అంత ప్రాధాన్యం ఉండేది కాదు. ప్రచారమూ లభించేది కాదు. ఒక యాడ్‌ ఏజెన్సీలాగా పని చేసేవారు. ప్రస్తుతం ఆ పనిలో తేడా లేకున్నా వ్యూహకర్తలు ప్రచారం అధికంగా చేసుకుంటున్నారు. తద్వారా మరిన్ని పార్టీల నుంచి కాంట్రాక్టులు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రాంతాన్ని బట్టి, నేతలను బట్టి వ్యూహకర్తల ఫీజులు మారుతుంటాయి. సాధారణంగా నేతలకు వ్యక్తిగతంగా ఇటువంటి సంస్థలు పని చేయవు. పార్టీలకే పని చేస్తాయి. రాజకీయ వ్యూహాలకు నెలలకొద్దీ సమయం పడుతుంది. ప్రతి వ్యూహకర్తకూ అభ్యర్థుల వారీగా విభిన్న వ్యూహం ఉంటుంది. ఒక పార్టీకి, నేతకు పని చేయాలంటే దాదాపుగా 5 నుంచి 6 నెలల సమయం పడుతుంది.

 • పోల్‌ బూత్‌ స్థాయి నుంచీ డేటాను వ్యూహకర్తలు సేకరిస్తారు.
 • ఆయా నియోజకవర్గాల్లో ఓట్ల సరళి ఎలా మారిందో చరిత్ర అంతా తీసుకుంటారు.
 • క్షేత్ర స్థాయిలో సర్వేలు నిర్వహిస్తారు.
 • ఓటర్ల అవసరాలను గుర్తిస్తారు.
 • ఆ తర్వాత ప్రచార వ్యూహాన్ని నిర్ణయిస్తారు.
 • అభ్యర్థులకు సలహాలిస్తారు. క్షేత్ర స్థాయి ప్రచార తీరును నిర్ణయిస్తారు.

 గతంలో నేతలే వ్యూహకర్తలు

తొలి సార్వత్రిక ఎన్నికల్లో నాయకులంతా స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నవారే ఉండేవారు. వారికి ప్రజల నాడి తెలుసు కాబట్టి వారే వ్యూహాలను రచించుకునేవారు. ఇది దాదాపు 15ఏళ్లపాటు సాగింది. ఆ తర్వాత రాజకీయ వారసుల శకం ప్రారంభమైంది. ఆ తర్వాత ఇప్పుడు రాజకీయ వ్యూహకర్తల శకం మొదలైందని చెప్పవచ్చు.


సామాజిక మాధ్యమ వేదికగా పోరు

రాజకీయ వ్యూహ సంస్థల పాత్ర పెరిగింది. సామాజిక మాధ్యమాల మద్దతు లేకుండా పార్టీలు, నాయకులు ఎన్నికల్లో నెగ్గుకురాలేమనే నిర్ణయానికి వచ్చారు. వారికి వాట్సప్‌ కంటెంట్‌ కావాలి. వ్యక్తిగత కంటెంట్‌ కావాలి. సామాజిక మాధ్యమ పోస్టులు కావాలి. వీటన్నింటినీ వారు సొంతంగా చేసుకోలేరు. పార్టీలన్నింటికీ సలహాదారులు కావాలి. ఈసారి దాదాపు 60 పార్టీలు వ్యూహకర్తలను నియమించుకున్నాయి.

 ఈనాడు ప్రత్యేక విభాగం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని