వాలంటీర్లపై ఆగని వైకాపా ఒత్తిళ్లు

వాలంటీర్లందరూ రాజీనామా చేసి ఆ పత్రాలను పంచాయతీ కార్యదర్శికి అందించాలి. అధికారంలోకి రాగానే వారందరినీ మళ్లీ విధుల్లోకి తీసుకుంటాం.

Published : 18 Apr 2024 05:23 IST

అయినా రాజీనామాకు ససేమిరా
కొన్నిచోట్ల బెదిరింపులు.. మరికొన్ని చోట్ల వేడుకోళ్లు
నెల రోజుల్లో వైదొలిగిన వారు 40 వేల మందే

వాలంటీర్లందరూ రాజీనామా చేసి ఆ పత్రాలను పంచాయతీ కార్యదర్శికి అందించాలి. అధికారంలోకి రాగానే వారందరినీ మళ్లీ విధుల్లోకి తీసుకుంటాం. ముఖ్యమంత్రికి మద్దతుగా మీ పరిధిలో సేవాతత్పరతతో కార్యక్రమాలు చేయాలి. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం నేను చూసుకుంటా. నేరుగా ఇన్‌వాల్వ్‌ అయి నాకు సహకరించాలి. దయచేసి రాజీనామా చేయండి.

చోడవరం వైకాపా ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ వేడుకోలు

ఈనాడు, అమరావతి: ఎన్నికల వేడి రాజుకుంటున్న కొద్దీ వాలంటీర్లందరూ రాజీనామా చేయాలంటూ వైకాపా నేతల ఒత్తిళ్లు అధికమవుతున్నాయి. కొందరు బెదిరింపులకు దిగుతుండగా, మరికొందరు దయచేసి అంటూ బతిమాలుతున్నారు. రాజీనామా చేసి, వైకాపా తరఫున ప్రచారంలో పాల్గొంటే రూ.10 వేలు ఇస్తామంటూ నజరానాలు ప్రకటిస్తున్నారు. అయినా చాలావరకు వాలంటీర్లు ససేమిరా అంటున్నారు. ‘మళ్లీ వైకాపానే అధికారంలోకి వస్తుందన్న గ్యారెంటీ ఏంటి? వచ్చినా, మమ్మల్నే కొనసాగిస్తుందా?’ అని ప్రశ్నిస్తున్నారు. నెల రోజులుగా వైకాపా నేతలు అన్నిరకాల అస్త్రాలు ప్రయోగించినా ఇప్పటివరకు అధికారికంగా రాజీనామా చేసింది 40 వేల మందే. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో 2.66 లక్షల మంది వాలంటీర్లున్నారు.

ఇష్టం లేకున్నా తప్పుకొన్నవారే ఎక్కువ

వాలంటీర్లతో రాజీనామా చేయించే బాధ్యతను వైకాపా నాయకులు గ్రామాల్లోని ఆ పార్టీ స్థానిక నేతలకు అప్పగించారు. కొన్నిచోట్ల ఫీల్డ్‌ ఆపరేటింగ్‌ ఏజెన్సీకి చెందిన ఎమ్మెల్వో (మండల్‌ లెవల్‌ ఆఫీసర్‌)లు తీసుకున్నారు. పదేపదే ఫోన్లు చేస్తూ వారికి ఇష్టం లేకున్నా రాజీనామా చేయాల్సిన పరిస్థితులు సృష్టిస్తున్నారు. తెల్ల కాగితంపై సంతకం పెడితే చాలు, ఏం రాయాలో తాము చూసుకుంటామంటూ ఒకే కాగితంపై స్థానిక వాలంటీర్లందరి సంతకాలు తీసుకొని వారంతా రాజీనామా చేశారంటూ అధికారులకు ఇస్తున్నారు. దీన్ని వారు అంగీకరించడం లేదు. ప్రతి వాలంటీర్‌ నిర్దేశిత కారణాన్ని చూపి రాజీనామా లేఖను వ్యక్తిగతంగా అందించాల్సిందేనని తేల్చిచెబుతున్నారు. రాజీనామా చేసిన ప్రతి 100 మందిలో ఐదుగురు కూడా ఇష్టపూర్వకంగా చేయలేదని నెల్లూరు జిల్లాకు చెందిన ఓ అధికారి తెలిపారు. వైయస్‌ఆర్‌ జిల్లా ముద్దనూరులోనూ వైకాపా నేతలు బలవంతంగా రాజీనామా చేయించారు. రాష్ట్రమంతా ఇదే పరిస్థితి. వాలంటీర్‌ పోస్టు నియామకానికి గరిష్ఠ వయోపరిమితి 35 ఏళ్లు. ఆ వయసుకు చేరువైన వారు తప్పుకొనేందుకు ముందుకు రావడం లేదు. వారిని మభ్యపెట్టేందుకు వైకాపా మరో ఎత్తుగడ వేసింది. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో రాజీనామా చేసిన 35 ఏళ్లకు పైబడిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకుంటామని సమాచారమిస్తోంది.

అంతర్గత చర్చల్లో ఆవేదన

తమను నియమించింది ప్రభుత్వమైతే, ఏ కారణమూ లేకుండా వైకాపా నేతలు రాజీనామాలకు ఒత్తిడి చేయడమేంటని వాలంటీర్లు అంతర్గత చర్చల్లో వాపోతున్నారు. ‘పారితోషికం పెంచాలని నిరసన తెలిపినా సీఎం జగన్‌ పట్టించుకోలేదు. తెదేపా అధికారంలోకి వస్తే రూ.10 వేలు ఇస్తామంటోంది. అదీ దక్కకుండా చేస్తున్నారు. ఇప్పటిదాకా మేం ఎన్నికల్లో ఏ పార్టీకీ అనుకూలంగా తిరగలేదు. వాలంటీర్‌ పోస్టు ఇచ్చినందున వైకాపాకు అనుకూల ప్రచారం చేయాలని చెప్పడమేంట’ని పలువురు మండిపడుతున్నారు. ‘మాతో వైకాపా నేతలు బలవంతంగా రాజీనామా చేయించారు. దాన్ని వెనక్కి తీసుకునే అవకాశముందా?’ అని ఓ వాలంటీర్‌ వారికి సంబంధించిన గ్రూపులో మెసేజ్‌ పెట్టారు. రాజీనామా చేస్తే రూ.10 వేలు ఇస్తామన్న వారు కూడా ముందుకు రావడం లేదని మరొకరు స్పందించారు. ‘వేతనాలిచ్చేది ప్రభుత్వం. రాజకీయ పార్టీ కాదు. ప్రభుత్వం ఉత్తర్వులిచ్చే దాకా ఎవరూ తొందర పడొద్ద’ని మరో వాలంటీర్‌ మెసేజ్‌ పెట్టారు.

వైకాపా తరఫున ప్రచారం

కొందరు వాలంటీర్లు మాత్రం వైకాపా నేతలు చెప్పినట్టే ఆడుతున్నారు. సెల్‌ఫోన్లు ప్రభుత్వానికి ఇచ్చేసినప్పటికీ, వేరే నంబర్‌తో తమ పరిధిలోని 50 కుటుంబాలతో ప్రత్యేక వాట్సప్‌ గ్రూపుల్లో కొనసాగుతున్నారు. విధుల్లోంచి వైదొలిగాక ప్రజలు, లబ్ధిదారులతో నేరుగా సంబంధం పెట్టుకోకూడదు. కానీ ఎమ్మెల్వోల దిశానిర్దేశంలో వివిధ గ్రూపుల్లో చేరి, వైకాపా అనుకూల ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల్లో వైకాపాకే మెజార్టీ స్థానాలు వస్తాయంటూ తప్పుడు సర్వేలను గ్రూపుల్లో పోస్టు చేస్తూ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు. రాజీనామా చేసిన వారి కార్యకలాపాలపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని