జగన్‌పై దాడి కేసులో.. బొండా ఉమాను ఇరికించేందుకు వైకాపా కుట్ర

సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావును ఇరికించేందుకు వైకాపా కుట్రలు చేస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.

Updated : 18 Apr 2024 05:56 IST

తెదేపా అధినేత చంద్రబాబు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావును ఇరికించేందుకు వైకాపా కుట్రలు చేస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఆయన్ను ప్రచారం చేయనివ్వకుండా అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. తెదేపా నేతల ప్రోద్బలంతోనే సీఎంపై దాడి జరిగిందని నమ్మించడం కోసం పోలీసుశాఖతో ప్రభుత్వం తప్పుడు పనులు చేయిస్తోందని బుధవారం ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ ప్రలోభాలు, ఒత్తిళ్లకు తలొగ్గి బొండా ఉమాపై తప్పుడు కేసులు పెడితే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ‘‘సీఎంపై రాయి దాడి విషయంలో తప్పుడు ప్రచారాలు, సానుభూతి నాటకాలతో అధికార పార్టీ అభాసుపాలైంది. నాలుగు రోజులు గడుస్తున్నా దాడిపై ఉన్నతాధికారులు స్పష్టమైన ప్రకటన చేయలేకపోయారు. దాడికి బాధ్యులని వడ్డెర కాలనీకి చెందిన కొందరు యువకులు, మైనర్లను పోలీసులు తీసుకెళ్లారు. దీనిపై వారి కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. వాస్తవాలు ఏంటో చెప్పకుండా కుట్రలు చేసేందుకు ఈ ప్రభుత్వం నీచపు ప్రయత్నాలు చేస్తోంది’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

తెదేపా ముఖ్యనేతలు, అభ్యర్థులే లక్ష్యం..

ఈ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థులు, పార్టీ ముఖ్యనేతల్ని ఎలాగైనా కేసుల్లో ఇరికించాలనే పన్నాగంతో వైకాపా ప్రభుత్వం పావులుకదుపుతోందని చంద్రబాబు దుయ్యబట్టారు. ‘‘నిందితులకు తెదేపా నేతలతో సంబంధాలున్నట్లు చిత్రీకరించేలా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అధికార దుర్వినియోగంపై ఎన్నికల సంఘం దృష్టిపెట్టాలి. సీఎంకు భద్రత కల్పించడంలో విఫలమైన అధికారుల్ని విచారణ బాధ్యతల నుంచి తప్పించాలి’’ అని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.


చంద్రబాబుపై 24.. లోకేశ్‌పై 23 కేసులు
అత్యధికం వైకాపా ప్రభుత్వం బనాయించినవే

ఈనాడు, అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబుపై 24 కేసులు, పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌పై 23 కేసులు ఉన్నాయి. వీటిలో అత్యధికం వైకాపా హయాంలో నమోదు చేసినవే. చంద్రబాబుపై   ఉన్న మొత్తం కేసుల్లో తొమ్మిది సీఐడీ పెట్టినవే. రాజధానిలో ఎసైన్డ్‌ భూములు, ఫైబర్‌ నెట్‌, స్కిల్‌ డెవలప్‌మెంట్‌, రాజధాని ఇన్నర్‌ రింగ్‌రోడ్డు, మద్యం, ఇసుక వంటి అంశాల్లో ఆయనపై సీఐడీ గత అయిదేళ్లలో ఈ కేసులు బనాయించింది. మిగతా కేసులు వివిధ జిల్లాల్లో నమోదయ్యాయి. లోకేశ్‌పై నమోదైన 23 కేసుల్లో రెండు సీఐడీ పెట్టినవి. ఆయనపై యువగళం పాదయాత్రలో ఎక్కువ కేసులు పెట్టారు. చంద్రబాబు, లోకేశ్‌పై నమోదైన కేసులు వివిధ దశల్లో ఉన్నాయి. నామినేషన్‌ పత్రాల్లో అభ్యర్థులపై ఉన్న కేసుల వివరాలను పొందుపరచాల్సి ఉన్నందున తెదేపా న్యాయ విభాగం చంద్రబాబు, లోకేశ్‌లతో పాటు, పార్టీ అభ్యర్థులపై ఉన్న కేసుల సమాచారాన్ని సేకరించింది. గత అయిదేళ్లలో తెదేపా నాయకులపై విపరీతంగా అక్రమ కేసులు పెట్టారు. తెదేపా నాయకులపై ఎక్కడెక్కడ కేసులున్నాయో తెలుసుకునేందుకు చాలా ప్రయత్నం చేయాల్సి వచ్చింది. డీజీపీ కార్యాలయంతో పాటు, అన్ని జిల్లాల ఎస్పీలకు లేఖలు రాసి, సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసి వివరాలు తీసుకున్నారు. పార్టీ న్యాయ విభాగం వాటన్నిటినీ క్రోడీకరించి... ఏ నాయకుడిపై ఎన్ని కేసులున్నాయన్న జాబితాలు సిద్ధం చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని