వెలంపల్లి శ్రీనివాస్‌, కేశినేని నానీలే సూత్రధారులు: పట్టాభిరామ్‌

సీఎం జగన్‌పై జరిగిన రాయి దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే, విజయవాడ సెంట్రల్‌ తెదేపా అభ్యర్థి బొండా ఉమాను ఇరికించాలని కుట్రలు చేస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ధ్వజమెత్తారు.

Updated : 18 Apr 2024 08:57 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: సీఎం జగన్‌పై జరిగిన రాయి దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే, విజయవాడ సెంట్రల్‌ తెదేపా అభ్యర్థి బొండా ఉమాను ఇరికించాలని కుట్రలు చేస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ధ్వజమెత్తారు. ఇందుకోసం డీజీపీ రాజేంద్రనాథరెడ్డి, నిఘావిభాగాధిపతి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, విజయవాడ సీపీ కాంతిరాణా ప్రణాళికలు రచించారని మండిపడ్డారు. మంగళగిరిలోని తెదేపా  కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు. తెదేపాలో చేరిన దుర్గారావును అదుపులోకి తీసుకొని పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తున్నట్టు తెలిసిందని ఆయన వివరించారు. ఈ ఎన్నికల్లో ఘోర ఓటమి తప్పదని గ్రహించి.. సానుభూతి పొందేందుకు జగన్‌ ఆడించిన గులకరాయి నాటకంలో మాజీమంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌, ఎంపీ కేశినేని నానీలే సూత్రధారులని దుయ్యబట్టారు. ‘‘గతంలో   చంద్రబాబు పర్యటనల్లో రాళ్లదాడులు జరిగాయి. ఎన్నడూ బాధ్యులపై 307 సెక్షన్‌ నమోదు చేయలేదు. నేడు బలహీనవర్గాల బిడ్డల్ని, బొండా ఉమాను ఇరికించేందుకు హత్యాయత్నం కింద కేసులు నమోదు చేశారు’’ అని దుయ్యబట్టారు.

కాల్‌ రికార్డులు బహిర్గతం చేయాలి: డూండీ రాకేశ్‌

మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌, ఎంపీ కేశినేని నానీల కాల్‌ రికార్డులు బహిర్గతం చేస్తే జగన్‌పై దాడి కుట్రంతా బయటకొస్తుందని తెదేపా వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండీ రాకేశ్‌ అన్నారు. మంగళగిరిలోని తెదేపా  కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు.

వడ్డెర యువకులను ఇరికించే కుట్ర: కేశినేని శివనాథ్‌

జగన్‌పై గులకరాయి నాటకంలో బీసీ సామాజికవర్గానికి చెందిన వడ్డెర యువకులను బలిపశువులను చేయాలని వైకాపా నాయకులు కుట్ర పన్నుతున్నారని విజయవాడ లోక్‌సభ స్థానం తెదేపా అభ్యర్థి కేశినేని శివనాథ్‌ (చిన్ని) ఆరోపించారు. విజయవాడలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. తెదేపా నాయకులనూ ఈ ఘటనలో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని