సాక్షిలో పనిచేసిన వారు, జగన్‌ బంధుమిత్రులే సలహాదారులు

సాక్షి మీడియాలో పనిచేసిన వారు, సీఎం జగన్‌ బంధుమిత్రులు, తెదేపా ప్రభుత్వంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా పనిచేసిన ఐఏఎస్‌ అధికారుల్నే వైకాపా ప్రభుత్వం సలహాదారులుగా నియమించుకుందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్‌ ఆరోపించారు.

Published : 18 Apr 2024 05:26 IST

వైకాపా ప్రభుత్వాన్ని నడిపింది వీరే
సకల శాఖా మంత్రిలా సజ్జల రామకృష్ణారెడ్డి
ఇండోసోల్‌, అరబిందోకు లక్షల ఎకరాల దోపిడీలో శామ్యూల్‌
తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్‌ ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: సాక్షి మీడియాలో పనిచేసిన వారు, సీఎం జగన్‌ బంధుమిత్రులు, తెదేపా ప్రభుత్వంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా పనిచేసిన ఐఏఎస్‌ అధికారుల్నే వైకాపా ప్రభుత్వం సలహాదారులుగా నియమించుకుందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్‌ ఆరోపించారు. సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్లయితే ప్రభుత్వమంటే తామే అయినట్టు.. సర్వాంతర్యాముల్లా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సలహాదారుల్లో జగన్‌ సామాజికవర్గానికి చెందిన వారే ఎక్కువమందని.. మంత్రుల్ని డమ్మీల్ని చేసి అయిదేళ్లుగా జగన్‌ ప్రభుత్వాన్ని అనధికారికంగా వారే నడిపారని దుయ్యబట్టారు. రూ.లక్షల్లో ప్రభుత్వ సొమ్మును జీతాలుగా పొందుతున్న వీరు ఫక్తు వైకాపా వాళ్లని మండిపడ్డారు. అసలు మంత్రిమండలి ఏర్పాటు కాకముందే ఈ ప్రభుత్వం ఆరుగురు సలహాదారుల్ని నియమించిందని గుర్తుచేశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘60 మంది సలహాదారులు చేసినవన్నీ అనధికారిక పనులే. రూ.లక్షల్లో జీతాలు తీసుకునే వీరికి నిబంధనలు తెలియవు. జగన్‌ సీఎం అయిన అయిదో రోజే మాజీ ఐఏఎస్‌ అధికారి అజేయ కల్లంను ముఖ్యమంత్రి సలహాదారుగా నియమించారు. వైకాపా ప్రభుత్వ దురాగతాల్లో ఆయన భాగస్వామి. మాజీమంత్రి వివేకా హత్య గురించి చెబితే ఆయన పేరు గుర్తొస్తుంది’ అని విజయ్‌కుమార్‌ తెలిపారు.

వైకాపా, ఐప్యాక్‌ అనుసంధానకర్తగా కసిరెడ్డి

‘గతంలో తెదేపా ప్రభుత్వం సౌర విద్యుత్తు కంపెనీలతో చేసుకొన్న ఒప్పందాల్ని మాజీ ఐఏఎస్‌ అధికారి శామ్యూల్‌.. విమర్శించేవారు. అలాంటి వ్యక్తి ఈ ప్రభుత్వంలో సలహాదారుగా ఇండోసోల్‌, అరబిందో లాంటి కంపెనీలకు గతంలో కంటే ఎక్కువ రాయితీలు ఇప్పించారు. భారీ ఎత్తున భూముల్ని వారికి ధారాదత్తం చేసే ప్రక్రియలో కీలకపాత్రధారి జీవీడీ కృష్ణమోహన్‌, దేవులపల్లి అమర్‌లు సాక్షిలో పనిచేసిన వారే. తెదేపా ప్రభుత్వం మీద డేటా చోరీ ఆరోపణలు చేసిన తుమ్మల లోకేశ్వర్‌రెడ్డి టెక్నికల్‌ ప్రాజెక్టుల సలహాదారు. జగన్‌ తండ్రి, మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డికి అత్యంత ప్రీతిపాత్రుడైన ఆడిటర్‌ సోమయాజులు కుమారుడే ఆర్థిక సలహాదారు కృష్ణ’ అని విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ బ్యాంకుల నుంచి అప్పులు ఇప్పించడంలో స్టేట్‌ బ్యాంకులో పనిచేసి రిటైర్‌ అయిన రజనీష్‌ కుమార్‌ కీలకంగా వ్యవహరించారని తెలిపారు. వైకాపా ఐప్యాక్‌ మధ్య అనుసంధానకర్తగానే ఐటీ సలహాదారు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి వ్యవహరించారని మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని