ఎన్నెన్నో హామీలిచ్చి.. ఆనక అయిదేళ్లూ ముంచేసి!

అయిదేళ్లలో జగన్‌ జిల్లాకు వచ్చినప్పుడల్లా ఇచ్చిన హామీల మొత్తం విలువ రూ.474 కోట్లు.. ఏటా గోదావరి వరదలకు కోనసీమ లంకల్లోని పల్లెలన్నీ వణికిపోయినా, గ్రామాలను అనుసంధానించే కాజ్‌వేలు మునిగిపోయినా నిధులు విడుదల చేయలేదు.

Published : 18 Apr 2024 05:28 IST

సీఎం వాగ్దానాలను గుర్తుచేసుకుంటున్న గోదావరి ప్రజలు
నేడు బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో జగన్‌ బస్సుయాత్ర

ఈనాడు- కాకినాడ, రాజమహేంద్రవరం: అయిదేళ్లలో జగన్‌ జిల్లాకు వచ్చినప్పుడల్లా ఇచ్చిన హామీల మొత్తం విలువ రూ.474 కోట్లు.. ఏటా గోదావరి వరదలకు కోనసీమ లంకల్లోని పల్లెలన్నీ వణికిపోయినా, గ్రామాలను అనుసంధానించే కాజ్‌వేలు మునిగిపోయినా నిధులు విడుదల చేయలేదు. ప్రజల ఇక్కట్లు తీర్చలేదు. భూములు కోతకు గురికాకుండా రక్షణ గోడలు నిర్మించలేదు. కొబ్బరి రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేదు. పరిస్థితులకు తగ్గట్లు మాటలు చెప్పి.. ఇక్కడి ప్రజలను నిండా ముంచేశారు. ఎన్నికల నేపథ్యంలో బస్సుయాత్ర చేపడుతూ గురువారం జిల్లాకు రానున్న జగన్‌.. వీటిపై ఏం సమాధానం చెబుతారు?

మాటలే తప్ప చేతల్లేవ్‌..

2019 నవంబరు 21న జాతీయ మత్స్యకార దినోత్సవం సభకు జగన్‌ వచ్చిన సమయంలో ఐ.పోలవరం మండలం ఎదుర్లంకలో నదీ కోతకు గురవుతున్న లంక భూముల రక్షణకు శిలాఫలకం ఆవిష్కరించారు. రూ.79.76 కోట్లతో పిచ్చింగ్‌, రివిట్‌మెంట్‌ పనులు చేస్తామన్నారు. నాలుగేళ్లు గడిచినా పనులు మొదలుపెట్టలేదు. తీరా ఎన్నికలు సమీపించగానే రెండు నెలల క్రితం హడావుడిగా రాళ్లు తెచ్చి గట్టు మీద వేశారు. ఈ వ్యవధిలో పనులు చేపట్టకపోవడం వల్ల 200 ఎకరాల కొబ్బరితోటలు కనుమరుగయ్యాయని రైతులు వాపోతున్నారు.

వీటి మాటేమిటి?

  • అయినవిల్లి మండలం వెదురుబిడెంలో రూ.40 కోట్లతో ఎత్తయిన కాజ్‌వే నిర్మిస్తామంటూ 2021 ఆగస్టు 16న నాడు-నేడు రెండో దశ పనులు ప్రారంభించినప్పుడు జగన్‌ హామీ ఇచ్చారు. కానీ పనులు మాత్రం చేపట్టలేదు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసినప్పుడల్లా వెదురుబిడెం కాజ్‌వే మునుగుతుంది. దీంతో అయినవిల్లిలంక, వీరవల్లిపాలెం, అద్దంకివారిలంక గ్రామాల్లోని 15 వేల మందికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయి.
  • వృద్ధ గౌతమి నదిపై రూ.44.50 కోట్లతో గుత్తెనదీవి-భైరవలంక వంతెన నిర్మించలేదు. ఫలితంగా గోగుల్లంక, భైరవలంక గ్రామస్థులు నిత్యం పంటుపై రాకపోకలు సాగిస్తున్నారు. ఆయా గ్రామాల నుంచి రోజూ 60 మంది విద్యార్థులు పంటు మీదుగా జి.వేమవరంలోని పాఠశాలకు వెళ్తున్నారు. వరదల సమయంలో పంటు నిలిపివేయడంతో ఆ దీవుల్లోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
  • జి.మూలపొలం వంతెన నిర్మాణం పూర్తికాక పోలవరం, కాట్రేనికోన మండలాల పరిధిలోని 8 గ్రామాలకు చెందిన 30 వేల మంది ఇబ్బంది పడుతున్నారు. కాకినాడ, ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు 20 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తోంది.
  • ఐ.పోలవరం మండలంలో రూ.49 కోట్లతో ఏటిగట్టు ఆధునికీకరణ పనులకు అంచనాలు రూపొందించి ప్రతిపాదనలు పక్కన పెట్టేశారు.
  • గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని పొట్టిలంక, ఠాణేలంక, కూనలంక, గురజాపులంక, వివేకానందవారధి, కొండుకుదురు గ్రామాల పరిధిలో కోత నివారణకు 3.5 కి.మీల మేర రక్షణ గోడ నిర్మాణానికి రూ.150 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పినా.. ఇప్పటికీ పనులు మొదలుకాలేదు.
  • విపత్తుల సమయంలో పునరావాస కేంద్రాల కోసం లంక గ్రామాల్లో సామాజిక భవనాలు నిర్మించాలని 2022 జులై 26న అధికారులతో నిర్వహించిన సమీక్షలో జగన్‌ ఇచ్చిన ఆదేశాలు.. కార్యరూపం దాల్చలేదు.

కొబ్బరి రైతులను పట్టించుకోలేదు

కోనసీమ అంటేనే కొబ్బరి తోటలకు ప్రసిద్ధి. కొబ్బరి ఉత్పాదకతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. గోదావరి జిల్లాల్లో 1.26 లక్షల ఎకరాల్లో జరిగే కొబ్బరి సాగుపై 3 లక్షల మంది రైతులు ఆధారపడ్డారు. గిట్టుబాటు ధర లేక వారి పరిస్థితి దయనీయంగా మారింది. క్వింటాలు కొబ్బరి గిట్టుబాటు ధర రూ.15 వేలు కాగా రూ.12 వేలు కూడా రావడం లేదు. పైగా 5% జీఎస్టీ చెల్లించాల్సి వస్తోంది. ఇక్కడ పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడంతో ఉపాధి కోసం పలువురు తమిళనాడు, కేరళ వెళ్తున్నారంటూ ప్రతిపక్ష నేతగా ఆవేదన వ్యక్తం చేసిన జగన్‌.. సీఎం అయ్యాక వారి జీవితాల్లో వెలుగులు నింపేలా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని