దుష్ట పాలనను అంతం చేద్దాం

శ్రీరామనవమి పర్వదినాన జనసేన అభ్యర్థులకు బీఫాంలను అందించడం ఆనందంగా ఉందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ తెలిపారు.

Published : 18 Apr 2024 05:28 IST

కలిసికట్టుగా రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలి
అభ్యర్థులకు బీఫాంలను అందజేస్తూ పిలుపునిచ్చిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: శ్రీరామనవమి పర్వదినాన జనసేన అభ్యర్థులకు బీఫాంలను అందించడం ఆనందంగా ఉందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ తెలిపారు. పాలకొండ అభ్యర్థి సమయానికి రాలేకపోవడంతో మిగతా 20 మంది ఎమ్మెల్యే, ఇద్దరు ఎంపీ అభ్యర్థులకు బీఫాంలు అందించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మొదట పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌కు బీఫాం ఇచ్చారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ.. ‘ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి. ఓటు చీలకుండా అవినీతి, దుష్ట పాలనను అంతం చేసి, రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలన్న దృఢ సంకల్పంతో ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేశాం’ అని అన్నారు. ‘సుదీర్ఘ సాగర తీరంతో సకల సంపదలకు నెలవైన రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. అయిదేళ్ల పాలనలో రాష్ట్రం అధోగతి పాలైంది. మనందరం కలిసికట్టుగా నడుం బిగించి రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలి. ప్రజలకు జవాబుదారీగా ఉంటూ.. యువతకు విద్య, ఉద్యోగ అవకాశాలతో పాటు మహిళలకు సముచిత స్థానం కల్పించాలి. వలసలు, పస్తులు లేని వికసిత ఆంధ్రప్రదేశ్‌ను ఆవిష్కరించాలి. కూటమి గెలుపే లక్ష్యంగా కృషిచేయాలి’ అని అభ్యర్థులతో ప్రతిజ్ఞ చేయించారు. నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ.. పూర్తిస్థాయిలో కష్టపడి వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్‌ కోసం కృషిచేయాలని పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని