జగనాసురుడి ఓటమి ఖాయం

‘రాముడిని తలచుకుంటే.. మంచి పాలన గుర్తొస్తుంది. మనకూ మంచి పాలకులు కావాలి, సుపరిపాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. రావణాసురుడిని చంపిన రాముడే ఆదర్శంగా.. ఈ రాష్ట్రంలోని ప్రజలంతా కలిసి తమ ఓట్లతో జగనాసురుడిని ఓడించేందుకు సిద్ధమయ్యారు.

Published : 18 Apr 2024 05:29 IST

రాష్ట్రంలో రామరాజ్యం తీసుకొచ్చే బాధ్యత నాది
కూటమే గెలుస్తోందని 11 సర్వేలు తేల్చి చెప్పాయి
25 లోక్‌సభ.. 165 అసెంబ్లీ స్థానాల్లో గెలుస్తున్నాం
పెడన, మచిలీపట్నం ప్రజాగళం సభల్లో చంద్రబాబు
జగన్‌పై దాడి చేయడమే మాకు పనా.. ఇంకేం పనుల్లేవా?
పాతికేళ్ల భవిష్యత్తు కోసమే ఈ ఎన్నికలు: పవన్‌ కల్యాణ్‌

ఈనాడు, అమరావతి: ‘రాముడిని తలచుకుంటే.. మంచి పాలన గుర్తొస్తుంది. మనకూ మంచి పాలకులు కావాలి, సుపరిపాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. రావణాసురుడిని చంపిన రాముడే ఆదర్శంగా.. ఈ రాష్ట్రంలోని ప్రజలంతా కలిసి తమ ఓట్లతో జగనాసురుడిని ఓడించేందుకు సిద్ధమయ్యారు. అందరూ ఆశీర్వదిస్తే.. రాష్ట్రంలో రామరాజ్యాన్ని స్థాపించే బాధ్యత నాది’ అని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌తో కలిసి బుధవారం ప్రజాగళం సభల్లో పాల్గొని మాట్లాడారు. జగన్‌ పాలనలో ఈ రాష్ట్రంలోని ఏ వర్గమూ ఆనందంగా లేదన్నారు. ‘అందరినీ నట్టేట ముంచిన వ్యక్తి.. ఈ జగన్‌. ఒక్కరోజే 11 సర్వేలు విడుదలవ్వగా.. అన్నింటిలోనూ.. 17 నుంచి 23 ఎంపీ స్థానాల్లో కూటమే గెలుస్తోందని తేలిపోయింది. కేంద్రంలో 400 సీట్లతో ఎన్డీయే అధికారంలోకి వస్తుంది. ఏపీలో 25 లోక్‌సభ స్థానాలు, 165 అసెంబ్లీ సీట్లు గెలుస్తాం’ అని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలో అందరినీ భయపెట్టి, బానిసలుగా మార్చుకోవాలని జగన్‌ అనుకుంటున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘ఎన్నికలకు 25 రోజులే ఉంది. తెదేపా, జనసేన, భాజపా కార్యకర్తలు.. ఈ కొద్దిరోజులు కష్టపడి, ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు వేయించండి. కేంద్రం, రాష్ట్రంలో మనమే వస్తున్నాం. బాగా కష్టపడిన కార్యకర్తలకు.. గుర్తింపు ఇచ్చే బాధ్యత మేం తీసుకుంటాం. ప్రతి ఓటూ చాలా ముఖ్యమనే విషయం మరచిపోవద్దు’ అని చంద్రబాబు సూచించారు.

మరో కొత్త నాటకం

అయిదేళ్ల తర్వాత కొత్త బిచ్చగాడిలా జగన్‌ మళ్లీ గులకరాయితో నాటకాలు మొదలెట్టి.. ప్రజల వద్దకు వస్తున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ‘కోడికత్తి నాటకం అయిపోయింది, ఇప్పుడు కొత్తగా గులకరాయి డ్రామా మొదలెట్టారు. ఘటన జరిగిన అరగంటలోనే మామీద బురదజల్లే ప్రయత్నాలు ఆరంభించారు. ఆ దాడి జరిగిన వెంటనే మేం ఖండించాం. కానీ.. పవన్‌ మీద, నామీద దాడి జరిగితే ఆయనెప్పుడూ ఖండించకపోగా.. అపహాస్యం చేశారు’ అని చంద్రబాబు మండిపడ్డారు.

మా దగ్గర నీతి, నిజాయతీ తప్ప డబ్బుల్లేవు..

ఈ అయిదేళ్లలో మద్యం, ఇసుక, భూదందాలపై దోచిన డబ్బులు బయటకు తీసి.. మళ్లీ ప్రజల్ని కొనేందుకు జగన్‌ వస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ‘మా దగ్గర డబ్బులు లేవు. నీతి, నిజాయతీ మాత్రమే ఉన్నాయి. ప్రజల జీవితాల్లో మళ్లీ వెలుగులు నింపాలనే లక్ష్యం ఉంది. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, ప్రజాస్వామ్య పరిరక్షణ, తెలుగు ప్రజల వెలుగే ధ్యేయంగా సాగుతున్నాం. ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా.. అదరకుండా బెదరకుండా ఓ యోధుడిలా ఈ పొత్తు కోసం నిలబడిన వ్యక్తి పవన్‌కల్యాణ్‌’ అని చంద్రబాబు పేర్కొన్నారు.


జగన్‌పై దాడిచేస్తే.. అసలు బతకనిస్తారా?

పవన్‌ కల్యాణ్‌

‘జగన్‌కు గాయమైతే.. ఈ రాష్ట్రానికి గాయమా? రాష్ట్రంలో ఇంతమంది యువతకు ఉపాధి లేకపోతే అది గాయం కాదా?’ అని పవన్‌ ప్రశ్నించారు. పెడన, మచిలీపట్నంలో నిర్వహించిన ప్రజాగళం సభల్లో పవన్‌ మాట్లాడారు. ‘చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే అది గాయం కాదా? వైకాపా నేతలు 15ఏళ్ల అమర్నాథ్‌ను పెట్రోలు పోసి కాల్చేస్తే అది గాయం కాదా? ఇలాంటివన్నీ వదిలేసి జగన్‌దే గాయమా? ఏం జరిగిందో.. ఆ గోల, మాయ.. ఏంటో తెలియదు. ఆయనపై దాడిచేయడమే మా పనా? మాకింకేం పనులు లేవా? అందరిమీద దాడి చేసే మీ మీద దాడిచేసే ధైర్యం ఎవరికైనా ఉంటుందా? మీరు వాళ్లను బతకనిస్తారా?’ అని పవన్‌ ధ్వజమెత్తారు.

చెల్లి వ్యక్తిగత జీవితాన్నే రోడ్డుకీడ్చారు..

‘నా గురించి మరీ వ్యక్తిగతంగా దిగజారి మాట్లాడుతున్నారు. సొంత చెల్లి వ్యక్తిగత జీవితాన్ని రోడ్లపై పెట్టారు. జగన్‌ లాంటివాళ్లను ఈ ఎన్నికల్లోనే కాదు, పూర్తిగా రాజకీయాల నుంచి పక్కన పెట్టకపోతే.. దేశానికే చీడపురుగులుగా మారతారు’ అని పవన్‌ ఘాటుగా విమర్శించారు.

చంద్రబాబు మహా దార్శనికుడు

ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు అనుభవం చాలా అవసరమని పవన్‌ స్పష్టం చేశారు. ‘చంద్రబాబు మహా దార్శనికుడు.. మాదాపూర్‌కు వెళ్లినప్పుడు ఆయన విజన్‌ 2020 కనిపిస్తోంది. రాష్ట్రాన్ని ఈ అయిదేళ్లలో పూర్తిగా జగన్‌ భ్రష్టుపట్టించారు. జనాన్ని అడ్డగోలుగా దోచేశారు. ఎన్డీయే కన్వీనర్‌గా కేంద్రంలో కీలకంగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు. ఈరోజు ఆయన తగ్గి.. ఎమ్మెల్యేలను కుదించుకుని పొత్తు కోసం వచ్చారు. నేనూ బలం ఉన్నా.. పట్టున్న బందరు లాంటి స్థానాలనూ పొత్తు కోసం వదులుకున్నా. ఈ ఎన్నికలు, ఓట్లు అయిదేళ్ల కోసం కాదు.. వచ్చే పాతికేళ్ల భవిష్యత్తు కోసం’ అని పవన్‌ భావోద్వేగానికి గురయ్యారు.

మీకేనా.. ప్రజలకు మండదా?

‘జగన్‌పైకి రాయి విసిరినందుకు చాలా మండిందంట. మరి పోలవరం రాకుండా చేసినందుకు, రాజధాని లేకుండా చేసినందుకు ప్రజలకు మండదా? అంబేడ్కర్‌ విదేశీవిద్య లేకుండా చేసినందుకు మండదా? మాస్క్‌ అడిగినందుకు దళిత వైద్యుడు సుధాకర్‌ను పిచ్చోడిని చేసి చంపేశారు.. మండదా? దళిత డ్రైవర్‌ను చంపి డోర్‌ డెలివరీ చేస్తే ప్రజలకు మండదా? మీ నిరంకుశత్వ పాలన చూస్తే మండదా.. కడుపు మండదా?’ అంటూ పవన్‌ మండిపడ్డారు. కూటమి గెలుస్తోందని దాదాపు అన్ని సర్వేలూ తేల్చేశాయని పవన్‌ వెల్లడించారు. ‘వై నాట్‌ 175.. అని జగన్‌ అంటున్నారు. బందరు గడ్డపై నుంచి చెబుతున్నా.. మీకు 15 సీట్లే చాలా ఎక్కువ.. గుర్తుపెట్టుకోండి’ అని పవన్‌ హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు