పదేళ్లలో రాష్ట్రానికి భారాస, భాజపా చేసింది శూన్యం

గత పదేళ్లలో రాష్ట్రంలోని భారాస, కేంద్రంలోని భాజపా ప్రభుత్వాలు తెలంగాణకు చేసింది శూన్యమని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు.

Updated : 19 Apr 2024 06:16 IST

తెలంగాణకు రావాల్సిన పలు ప్రాజెక్టులను కేంద్రం అడ్డుకుంది
భాజపాను పారదోలేందుకు భారాస మినహా అన్ని పార్టీలు ఏకం కావాలి
కోదాడ ప్రచార సభలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

కోదాడ, న్యూస్‌టుడే: గత పదేళ్లలో రాష్ట్రంలోని భారాస, కేంద్రంలోని భాజపా ప్రభుత్వాలు తెలంగాణకు చేసింది శూన్యమని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. గురువారం సూర్యాపేట జిల్లా కోదాడలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరచిన ఏ ఒక్క పని కూడా పూర్తి కాలేదన్నారు. 50 లక్షల ఉద్యోగాలు అందించే ఐటీఐఆర్‌ను తెలంగాణకు కాంగ్రెస్‌ మంజూరు చేస్తే.. భాజపా రద్దు చేసిందని ఆరోపించారు. కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, రామగుండంలో 4 వేల మెగావాట్ల విద్యుత్‌ను అందించే ప్రాజెక్టు.. ఇలా తెలంగాణకు రావాల్సిన పలు ప్రాజెక్టులను అడ్డుకుని, అన్యాయం చేసిందన్నారు. దేశంలోని రైతుల ఆదాయం 2022 నాటికి రెట్టింపు చేస్తామని మోదీ ఇచ్చిన హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. ధాన్యానికి కనీస మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చి విస్మరించిన భాజపాను ఇంటికి పంపాల్సిన సమయం వచ్చిందని ఉత్తమ్‌ చెప్పారు. ఏడాదికి యువతకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న భాజపా మోసం చేసిందన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే 30 లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాహుల్‌ గాంధీ స్వయంగా ప్రకటించారని ఆయన గుర్తుచేశారు. మతతత్వ భాజపాను పారదోలాలంటే దేశంలో భారాస మినహా అన్ని పార్టీలు, సంఘాలు ఏకం కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రజాస్వామ్యంలోని అన్ని వ్యవస్థలు ప్రమాదంలో పడిపోయే పరిస్థితి వచ్చిందన్నారు.

దేశంలో మానవ హక్కులకు విఘాతం కలుగుతోందన్నారు. భాజపాకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ముఖ్యమంత్రులను కూడా జైల్లో పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తాను అడగ్గానే సీపీఐ, సీపీఎం నాయకులు మద్దతు తెలిపారంటూ.. వారికి ధన్యవాదాలు తెలిపారు. జానారెడ్డి తన జీవితాన్నంతా ప్రజా సేవకే అంకితమిచ్చారన్నారు. తన తర్వాత నల్గొండ తరఫున లోక్‌సభలో గళం వినిపించడానికి రఘువీర్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో దేశంలోనే ఎక్కువ మెజార్టీ సాధించిన నియోజకవర్గంగా నల్గొండ రికార్డు సృష్టిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు మాట్లాడుతూ నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని 7 నియోజకవర్గాల్లో కోదాడ నుంచి ఎక్కువ మెజార్టీ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, నల్గొండ ఎంపీ అభ్యర్థి రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మావతిరెడ్డి, జైవీర్‌రెడ్డి, నల్గొండ, సూర్యాపేట డీసీసీ అధ్యక్షులు శంకర్‌నాయక్‌, వెంకన్న యాదవ్‌, పీసీసీ సభ్యుడు లక్ష్మీనారాయణరెడ్డి, ఎంపీపీలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సీపీఐ, సీపీఎం నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని