రాష్ట్ర ప్రభుత్వం సహకరించకున్నా అభివృద్ధి చేశా

ఓటు వేసి గెలిపించిన ఓటరు తలదించుకునేలా తాను ఏ రోజూ వ్యవహరించలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఐదేళ్లలో తాను చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఓటేయాలని కోరారు.

Updated : 19 Apr 2024 06:16 IST

అంకితభావంతో పనిచేశానని భావిస్తేనే నాకు ఓట్లు వేయండి
ఓటరు తలదించుకునే పని నేను ఎప్పుడూ చేయలేదు
తెలంగాణకు ఈ పదేళ్లలో రూ.10 లక్షల కోట్ల కేంద్ర నిధులు
‘ప్రజలకు నివేదిక’ విడుదల సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: ఓటు వేసి గెలిపించిన ఓటరు తలదించుకునేలా తాను ఏ రోజూ వ్యవహరించలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఐదేళ్లలో తాను చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఓటేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోయినా కేంద్ర మంత్రిగా అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఒడిసిపట్టి రాష్ట్రంలో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఎంపీగా, కేంద్ర మంత్రిగా రాష్ట్రానికి, జంటనగరాలకు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ‘ప్రజలకు నివేదిక’ పేరుతో పుస్తకాన్ని రూపొందించారు. అందులోని వివరాలతో గురువారం ఇక్కడ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ పాల్గొన్నారు. ‘‘నాకు ఎప్పుడూ కాంట్రాక్టర్లతో సంబంధాలు లేవు. నాపై అవినీతి, భూదందా సెటిల్‌మెంట్ల ఆరోపణలు, పోలీసు కేసులు లేవు. కేంద్ర మంత్రిగా దేశానికి సేవ చేస్తూనే సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేశా. ఈయనకు ఎందుకు ఓటు వేశామా అని ఓటర్లు అనుకునేలా నేను ఎప్పుడూ ప్రవర్తించలేదు. అంకితభావంతో పనిచేశానని, అభివృద్ధి చేశానని భావిస్తేనే ఓట్లు వేయండి.

కేంద్ర మంత్రిగా ఉన్నా ఎంతో హేళన చేశారు

రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై వందల లేఖలు రాసినా గత ముఖ్యమంత్రి స్పందించలేదు. నేను కేంద్ర మంత్రిగా ఉన్నా ఎంతో హేళన చేశారు. చులకనగా మాట్లాడారు. అయినా నేను పట్టించుకోలేదు. రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్లా. మొదటిసారి దేశానికి సేవచేసే అవకాశాన్ని సికింద్రాబాద్‌ ఓటర్లు కల్పించారు. భాజపా జాతీయ నాయకత్వం, ప్రధాని నరేంద్రమోదీ కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించా. ఆర్టికల్‌ 370 రద్దుకు సంబంధించి కీలక బాధ్యతలను నిర్వహించా. రైతు ఉద్యమ సమయంలో, కరోనా సమయంలో బాధ్యతాయుతమైన సేవలు అందించా. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌, జి-20 దేశాల సమావేశాల సందర్భంగా మా శాఖ ద్వారా ముఖ్య కార్యక్రమాలు నిర్వహించాం. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి రూ.లక్షల కోట్లు వ్యయం చేశాం.

కేంద్రం ద్వారా రాష్ట్రాభివృద్ధికి అహరహం కృషి

నాకు కేంద్ర మంత్రిగా లభించిన అవకాశం ద్వారా రాష్ట్రాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేశా. భాజపా ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి పదేళ్లలో రూ.10 లక్షల కోట్లను వ్యయం చేసింది. రోడ్లు, రైల్వేలు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి కేంద్రం ద్వారా రాష్ట్రంలో భారీ ఎత్తున నిధులను వ్యయం చేశాం. రాష్ట్రంలో జాతీయ రహదారులు 67 ఏళ్లలో 2,700 కిలోమీటర్లు ఉండగా కొత్తగా 2,500 కిలోమీటర్లు వచ్చాయి. తెలంగాణలోని 33 జిల్లాల్లో పెద్దపల్లి మినహా అన్ని జిల్లాలు జాతీయ రహదారులతో అనుసంధానం అయ్యాయి. కేంద్రమే రూ.26 వేల కోట్లను వ్యయం చేసి హైదరాబాద్‌ చుట్టుపక్కల రీజినల్‌ రింగ్‌ రోడ్డును నిర్మిస్తుంది. భూసేకరణ మొత్తంలో కూడా సగం వ్యయం కేంద్రమే భరించనుంది. తెలంగాణకు సంబంధించి ఏం చేయలేదనే వాళ్లకు అనేక సమాధానాలు ఉన్నాయి. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు తేవడంతో పాటు ఓరుగల్లులో చారిత్రక నిర్మాణాల పరిరక్షణ, పునరుద్ధరణ చర్యలు చేపట్టాం. కేవలం నా శాఖ ద్వారానే కాకుండా ఇంకా వివిధ శాఖల ద్వారా అవకాశం ఉన్నమేర రాష్ట్ర అభివృద్ధికి కృషి చేశా’’ అని కిషన్‌రెడ్డి వివరించారు.

ప్రజలు విచక్షణతో ఆలోచించాలి: జయప్రకాశ్‌ నారాయణ

‘మనకు సంక్షేమాన్ని, అభివృద్ధిని సమతూకం చేసి దీర్ఘకాలిక అభివృద్ధి కోసం పని చేసే ప్రభుత్వాలు కావాలా? తాత్కాలికమైన తాయిలాలతో ప్రజలను మభ్యపెడుతూ, వారి అసహాయతను అడ్డం పెట్టుకొని ఓట్లు పొందే రాజకీయం కావాలా? ప్రజలు విచక్షణతో ఆలోచించాలి’ అని జయప్రకాశ్‌ నారాయణ అన్నారు. దేశ ప్రజలు, ఓటర్లు తమ మంచి తాము తెలుసుకోవాలన్నారు. ‘మహాత్మాగాంధీ చెప్పినట్లు నువ్వు చేసే పనివల్ల ఒక వ్యక్తి తన కాళ్లపై తాను నిలబడతాడా? అతడికి జీవితంపై పట్టు వస్తుందా? ఆతనిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందా అని ఆలోచించాలి. అలా పెంచితే అది మంచి పని.. లేదంటే నిరర్థకం అని గుర్తించాలి. రాష్ట్రం నా జాగీరు, జిల్లా నా జాగీరు అనేది హేయమైన ఆలోచన’ అని అన్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని మనసారా అభినందిస్తూ..దేశంలో మంచి ప్రభుత్వాన్ని, మన పిల్లల భవిష్యత్తును కాపాడే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. కార్యక్రమంలో బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ నరసింహారెడ్డి, పద్మశ్రీ అవార్డు గ్రహీత హనుమంతరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌ పాశం యాదగిరి సహా పలువురు భాజపా ముఖ్యనేతలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని