ఈ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం

వచ్చే సంవత్సర కాలంలో ఏదైనా జరగొచ్చని, లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.

Updated : 19 Apr 2024 06:15 IST

104 మంది ఎమ్మెల్యేలుంటేనే.. మా ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా యత్నం
64 మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్‌ను బతకనిస్తుందా?
రాబోయే రోజుల్లో ఉద్యమకాలం నాటి కేసీఆర్‌ను చూస్తారు
కవిత అరెస్టు కక్ష సాధింపే
భారాస విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: వచ్చే సంవత్సర కాలంలో ఏదైనా జరగొచ్చని, లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ‘‘104 మంది ఎమ్మెల్యేలున్న భారాస ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా ప్రయత్నించింది. 64 మంది ఎమ్మెల్యేలే ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని బతకనిస్తుందా? ‘కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌’ ఎజెండాతో ముందుకు వెళ్తున్న భాజపా.. ఇతర పార్టీల ప్రభుత్వాలను ఎక్కడ వదిలిపెట్టింది? ఇక్కడి ప్రభుత్వాన్ని కూడా వదలదు. కాంగ్రెస్‌లో టీమ్‌ వర్క్‌ లేదు. స్థిరత్వం లేదు. కాంగ్రెస్‌ను చీల్చాలని భాజపా వాళ్లు ప్రయత్నం చేసినా.. కరడుకట్టిన నేతలు వెళ్లరు. అలా జరిగితే.. భారాసకు మద్దతిస్తామని కొందరు కాంగ్రెస్‌ నేతలు నాతో చెప్పారు. ఎంఐఎం కూడా వెళ్లదు. ఏ రాజకీయ గందరగోళం ఏర్పడినా భారాసకే మేలు జరుగుతుంది. భవిష్యత్‌ ఎన్నికల్లో భారాసదే విజయం. పార్టీ నాయకులు స్థిరచిత్తంతో ఉండండి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా భారాస బీ-ఫాం తీసుకున్నవారే అదృష్టవంతులు. కత్తుల్లాంటి అభ్యర్థులకు అవకాశాలిస్తా’’ అని కేసీఆర్‌ అన్నారు. ‘‘రాబోయే రోజుల్లో ఉద్యమ కాలం నాటి కేసీఆర్‌ను మళ్లీ చూస్తారు. కొందరు నేతలు పార్టీని వీడి వెళ్లినంత మాత్రాన నష్టమేమీ లేదు. భారాస నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన నేతలు బాధపడుతున్నారు. అధికారం ఉందని వెళ్తే.. అక్కడంతా భాజపా కథ నడుస్తోందని ఓ నాయకుడు వాపోయాడు. మళ్లీ భారాసలోకి వస్తానని సంప్రదించాడు. నేను ఒప్పుకోలేదు. పార్టీ వీడినవారిని మళ్లీ చేర్చుకునే ప్రసక్తే లేదు’’ అని ఆయన స్పష్టం చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ అధ్యక్షతన భారాస విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 17 మంది ఎంపీ అభ్యర్థులకు, కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానం అభ్యర్థి నివేదితకు ఆయన బీ-ఫాంలు అందజేశారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం ఎంపీ అభ్యర్థులకు రూ.95 లక్షల చొప్పున చెక్కులను, కంటోన్మెంట్‌ అసెంబ్లీ అభ్యర్థికి రూ.45 లక్షల చెక్కు అందించారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం, అనుసరించే వ్యూహంపై గులాబీ శ్రేణులకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. అంతకుముందు తెలంగాణ భవన్‌కు చేరుకున్న కేసీఆర్‌కు మాజీ మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. అక్కడే ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి కేసీఆర్‌ పూలమాల వేశారు.

ఉద్ధృతంగా పోస్టు కార్డు ఉద్యమం

సమావేశంలో కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దాన్ని అనుకూలంగా మలచుకోవాలి. గట్టిగా పోరాడితే లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పటివరకు 8 సీట్లలో గెలుస్తామని సర్వేలు చెబుతున్నాయి. మరో మూడు స్థానాల్లోనూ విజయావకాశాలున్నాయి. మరింత గట్టిగా పోరాడాలి. రైతు సమస్యలు ఎజెండాగా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలి. దీనిపై పోస్టుకార్డుల ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలి. ఒక్కో లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో లక్ష పోస్టు కార్డులు రాయాలి. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితిలో మిల్లర్లు లేరు. రైతుల కల్లాల వద్దకు వెళ్లి రూ.500 బోనస్‌పై ప్రభుత్వాన్ని నిలదీయాలి. కాంగ్రెస్‌ పార్టీకి హామీలను గుర్తుచేయాలి. ప్రభుత్వ వైఫల్యాలను సామాజిక మాధ్యమాల ద్వారా ఎండగట్టాలి.

భాజపాకు ఎందుకు ఓటేయాలి?

లోక్‌సభ ఎన్నికల్లో భాజపాకు ఎందుకు ఓటేయాలో ఎక్కడికక్కడ నిలదీయాలి. డాలర్‌ విలువను రూ.83కు పెంచినందుకా? కృష్ణా నదిపై ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించినందుకా? ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపినందుకా? రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని ఒత్తిడి తెచ్చినందుకా? ఒక్క వైద్య కళాశాల, నవోదయ పాఠశాల కూడా ఇవ్వనందుకా? ఆ పార్టీకి ఎందుకు ఓటేయాలి?

ఇసుక కుంగడం వల్లే మేడిగడ్డ సమస్య

మేడిగడ్డ ఆనకట్ట వద్ద ఇసుక కుంగడం వల్లే సమస్య ఏర్పడింది. ఇంజినీరింగ్‌ నిర్ణయాలు అన్నీ అయ్యాక.. చివరికి మంత్రివర్గం వద్దకు వస్తుంది. నిర్మాణ వ్యవహారాలన్నీ ఇంజినీర్లు చూసుకోవాలి. ప్రతిదీ పైస్థాయిలో జరగదు. చిన్న సంఘటనను అడ్డం పెట్టుకొని.. అక్కడేదో జరిగిపోయినట్లు గడబిడ చేస్తూ.. ఏదో చేస్తామంటే ఎలా? కాళేశ్వరం ప్రాజెక్టులో మూడు పియర్లు కుంగిపోతే.. మొత్తం ప్రాజెక్టే కూలిపోయిందని అబద్ధాలు, కట్టుకథలతో ప్రజలను ఇన్నాళ్లు మోసం చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. కాఫర్‌ డ్యామ్‌ కట్టాలని నిర్ణయించటం భారాస సాధించిన విజయమే.

బీఎల్‌ సంతోష్‌పై కేసు పెట్టడంతో మోదీ కక్ష

భారాస ఎమ్మెల్సీ కవిత అరెస్టు ముమ్మాటికీ అక్రమం. ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్టు చేశారు. గతంలో భారాస ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా జాతీయ నాయకుడు బీఎల్‌ సంతోష్‌ ప్రయత్నించారు. ఆయనపై కేసు నమోదు చేసి, నోటీసులు పంపించాం. భాజపా కేంద్ర కార్యాలయానికి నోటీసులు ఇవ్వడానికి రాష్ట్ర పోలీసులు వెళ్లారు. ఆ క్రమంలోనే భారాసపై మోదీ కక్ష కట్టారు. కవితను కుట్రపూరితంగా మనీలాండరింగ్‌ కేసులో ఇరికించారు. బీఎల్‌ సంతోష్‌పై మనం కేసు పెట్టకపోయి ఉంటే.. కవితపై అసలు కేసే ఉండేది కాదు.

నదీ జలాలపై భాజపా కుట్ర

గోదావరి నదిపై ఇచ్చంపల్లి వద్ద ప్రాజెక్టు కట్టి.. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు నీళ్లను తరలించేందుకు భాజపా కుట్ర చేస్తోంది. ఇది బచావత్‌ ట్రైబ్యునల్‌ తీర్పునకు వ్యతిరేకం. గత 50 ఏళ్ల నుంచి బచావత్‌ ట్రైబ్యునల్‌ తీర్పు ప్రకారమే నీటి పంపకాలు జరుగుతున్నప్పటికీ.. ఇప్పుడు కర్ణాటక, తమిళనాడుల్లో ఓట్లు దండుకోవటానికి నీళ్ల మళ్లింపు కుట్రకు భాజపా తెరలేపింది. ఇంత జరుగుతున్నా రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోంది? ఇది అసమర్థత కాదా? తెలంగాణ నదీ జలాల పరిరక్షణ భారాసతోనే సాధ్యం’’ అని కేసీఆర్‌ స్పష్టం చేశారు. భారాస నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని, దీన్ని ఎదుర్కొనేందుకు పార్టీ లీగల్‌ సెల్‌కు రూ.10 కోట్లు కేటాయిస్తున్నట్లు అధినేత తెలిపారు.


22 నుంచి  ఉదయం పొలంబాట.. సాయంత్రం రోడ్‌ షోలు

ఈ నెల 22 నుంచి రెండు, మూడు వారాల పాటు రోడ్‌ షోలు, బస్సు యాత్రలు నిర్వహించాలని భారాస అధిష్ఠానం నిర్ణయించింది. ఉదయం 11 గంటల వరకు పొలం బాట కార్యక్రమం ఉంటుంది. పంటలను పరిశీలించడం, రైతుల కష్టాలను తెలుసుకొని.. వారిని ఓదార్చడం వంటి కార్యక్రమాలుంటాయి. సాయంత్రం నుంచి ఒక్కో లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో 2-3 చోట్ల రోడ్‌ షోలు, కార్నర్‌ మీటింగ్‌లు నిర్వహిస్తారు. వరంగల్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లలో లక్ష మందితో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని