నేటి నుంచి రేవంత్‌ ప్రచారభేరి

నామినేషన్ల పర్వం మొదలుకావడంతో పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం నుంచి జిల్లాల్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర ముఖ్య నేతలంతా ప్రచార సభల్లో పాల్గొనేలా పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది.

Updated : 19 Apr 2024 07:28 IST

ఉదయం మహబూబ్‌నగర్‌లో వంశీచంద్‌రెడ్డి నామినేషన్‌లో పాల్గొననున్న సీఎం
సాయంత్రం మహబూబాబాద్‌లో బహిరంగ సభ
వరుసగా నామినేషన్లు.. ప్రచార సభలకు హాజరుకానున్న పీసీసీ అధ్యక్షుడు

ఈనాడు, హైదరాబాద్‌: నామినేషన్ల పర్వం మొదలుకావడంతో పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం నుంచి జిల్లాల్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర ముఖ్య నేతలంతా ప్రచార సభల్లో పాల్గొనేలా పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. వీలునుబట్టి జాతీయస్థాయి నేతలు రాష్ట్రంలో ప్రచారానికి రానున్నారు. తొలుత శుక్రవారం ఉదయం మహబూబ్‌నగర్‌లో వంశీచంద్‌రెడ్డి నామినేషన్‌కు సీఎం హాజరుకానున్నారు. సాయంత్రం మహబూబాబాద్‌ బహిరంగ సభలో రేవంత్‌ పాల్గొంటారు. 20న మెదక్‌ అభ్యర్థి నీలం మధు నామినేషన్‌కు హాజరవుతారు. సాయంత్రం కర్ణాటకలో ఎన్నికల ప్రచారసభలో ప్రసంగిస్తారు. ఈ నెల 21న భువనగిరిలో చామల కిరణ్‌కుమార్‌రెడ్డి నామినేషన్‌ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. 22న ఆదిలాబాద్‌లో, 23న నాగర్‌కర్నూల్‌లో, 24న ఉదయం జహీరాబాద్‌, సాయంత్రం వరంగల్‌ సభల్లో సీఎం ప్రసంగిస్తారు. ఈ ప్రచార సభలను విజయవంతం చేయడానికి అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, నేతలు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని లోక్‌సభ నియోజకవర్గాల్లో రోడ్‌షోలు, ర్యాలీల్లో సీఎం పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. వచ్చే నెల 11న ఎన్నికల ప్రచార గడువు ముగిసేలోగా వీలైనన్ని ఎక్కువ ప్రచార సభలు నిర్వహించాలనేది లక్ష్యమని వెల్లడించాయి. వీలునిబట్టి ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో 2 నుంచి 3 సభల్లో సీఎం ప్రచార సభలను ఏర్పాటుచేయనున్నట్లు పేర్కొన్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న గ్యారంటీ హామీలతో పాటు, కాంగ్రెస్‌ జాతీయ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలపై విస్తృతంగా ప్రచారం చేయాలని అభ్యర్థులకు, నేతలకు పార్టీ అధిష్ఠానం సూచించింది. కేంద్రంలో భాజపా ప్రభుత్వం గత పదేళ్లుగా ప్రజలకు ఏమీ చేయలేదనే అంశాన్ని ఓటర్లకు చేరవేయాలని స్పష్టం చేసింది. అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలను నియమించిన పార్టీ.. ప్రచార కార్యక్రమాలను పర్యవేక్షించి, ఎక్కడైనా వెనుకబడితే వెంటనే సరిదిద్దాలని వారికి సూచించింది. ప్రతి నియోజకవర్గంలో ప్రచారంపై పార్టీ నివేదికలు తెప్పించుకుంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని