నామినేషన్ల కోలాహలం షురూ

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల కోలాహలం ప్రారంభమైంది. రాజకీయ సందడి ఊపందుకుంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు ఎన్నికల అధికారులు గురువారం ఉదయం నోటిఫికేషన్లు జారీ చేశారు.

Updated : 19 Apr 2024 06:14 IST

తొలి రోజు దాఖలు చేసిన 42 మంది
భాజపా నుంచి ఈటల, డీకే అరుణ, రఘునందన్‌రావు, భరత్‌ప్రసాద్‌
కాంగ్రెస్‌ నుంచి మల్లు రవి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల కోలాహలం ప్రారంభమైంది. రాజకీయ సందడి ఊపందుకుంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు ఎన్నికల అధికారులు గురువారం ఉదయం నోటిఫికేషన్లు జారీ చేశారు. దాంతో ఎన్నికల పర్వంలో కీలకమైన నామినేషన్ల ఘట్టానికి తెర లేచింది. రాజకీయపక్షంగా తమ బలాన్ని చాటుకోడానికి నామినేషన్ల సందర్భంగా అభ్యర్థులు భారీ ర్యాలీలకు ఏర్పాట్లు చేసుకున్నారు. తొలి రోజు ప్రధాన రాజకీయ పార్టీల పరంగా చూస్తే భాజపా నుంచే ఎక్కువ నామినేషన్లు దాఖలయ్యాయి. అభ్యర్థులు ర్యాలీలు కూడా నిర్వహించారు. నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లు రవి నామినేషన్‌ వేశారు. ఈ నెల 23న నాయకులు, కార్యకర్తలతో తరలి వెళ్లి మరో సెట్‌ సమర్పించనున్నారు. భారాస నుంచి ఎవరూ దాఖలు చేయలేదు. తొలిరోజు 42 మంది అభ్యర్థులు 48 సెట్లు దాఖలు చేశారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ నియోజకవర్గాలకు; ఉప ఎన్నిక జరిగే సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ స్థానానికి ఒక్కటీ దాఖలు కాలేదు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన ఐదు నెలల్లోనే రాజకీయ హడావుడి మళ్లీ మొదలైంది. భాజపా అభ్యర్థుల నామినేషన్‌ కార్యక్రమాల్లో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌సావంత్‌, కేంద్ర మంత్రులు హర్‌దీప్‌సింగ్‌ పురీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

భాజపా నుంచి...

గురువారం భాజపా సందడి అధికంగా కనిపించింది. మల్కాజిగిరి స్థానానికి ఈటల రాజేందర్‌, ఆయన సతీమణి ఈటల జమున నామినేషన్లు దాఖలు చేశారు. కేంద్ర మంత్రులు జి.కిషన్‌రెడ్డి, హర్‌దీప్‌సింగ్‌ పురీ హాజరయ్యారు. నామినేషన్‌ కార్యక్రమాన్ని నాయకులు అట్టహాసంగా నిర్వహించారు. భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ భారీ ర్యాలీతో మహబూబ్‌నగర్‌ నియోజకవర్గానికి నామినేషన్‌ దాఖలు చేశారు. డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మెదక్‌లో మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు నామినేషన్‌ వేశారు. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని పత్రాలను ఎన్నికల అధికారికి అందజేశారు. అనంతరం మెదక్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రమోద్‌ సావంత్‌, కిషన్‌రెడ్డి హాజరయ్యారు. నాగర్‌కర్నూల్‌లో భాజపా అభ్యర్థిగా భరత్‌ప్రసాద్‌ నామినేషన్‌ వేసే కార్యక్రమానికి ఆ పార్టీ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి హాజరయ్యారు. నల్గొండ భాజపా అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి పక్షాన మాదగోని శ్రీనివాస్‌గౌడ్‌ పత్రాలను అధికారులకు అందజేశారు. నాగర్‌కర్నూల్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా మల్లు రవి నామినేషన్‌ వేశారు. ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కె.రాజేశ్‌రెడ్డి పాల్గొన్నారు. జహీరాబాద్‌ స్థానానికి సురేష్‌ షెట్కార్‌ పక్షాన ఆయన బంధువు సాగర్‌ షెట్కార్‌ వేశారు. మెదక్‌ స్థానానికి నీలం మధు తరఫున మెదక్‌ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు పత్రాలను ఎన్నికల అధికారికి సమర్పించారు.

అత్యధికంగా మల్కాజిగిరిలో...

తొలిరోజున మల్కాజిగిరికి అత్యధికంగా ఎనిమిది మంది నామినేషన్లు వేశారు. పెద్దపల్లి, మెదక్‌, నల్గొండలలో నలుగురు చొప్పున; చేవెళ్ల, భువనగిరి, వరంగల్‌లలో ముగ్గురు చొప్పున, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌లలో ఇద్దరు చొప్పున; జహీరాబాద్‌, మహబూబాబాద్‌, ఖమ్మంలలో ఒక్కో అభ్యర్థి చొప్పున వేశారు. నామినేషన్లు వేసిన వారిలో అత్యధికులు స్వతంత్రులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని