పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైకాపా అభ్యర్థి బుట్టా రేణుక ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమేనని సీఎం జగన్‌ ఇటీవల సిద్ధం సభలో చేసిన వ్యాఖ్యలు.. ఆమె అఫిడవిట్‌లో పేర్కొన్న వివరాలతో మరోసారి చర్చనీయాంశమయ్యాయి.

Published : 19 Apr 2024 06:22 IST

ఈనాడు, కర్నూలు: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైకాపా అభ్యర్థి బుట్టా రేణుక ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమేనని సీఎం జగన్‌ ఇటీవల సిద్ధం సభలో చేసిన వ్యాఖ్యలు.. ఆమె అఫిడవిట్‌లో పేర్కొన్న వివరాలతో మరోసారి చర్చనీయాంశమయ్యాయి. అఫిడవిట్‌ ప్రకారం.. రేణుక, ఆమె భర్త శివనీలకంఠ పేరిట ఉన్న ఆస్తుల విలువ రూ.161.21 కోట్లు. చరాస్తులు రూ.142.46 కోట్లు, స్థిరాస్తులు రూ.18.75 కోట్లు. అప్పులు రూ.7.82 కోట్లు. 2014లో వీరి ఆస్తులు రూ.242.60 కోట్లు.

  • ఆమె ఆటోమొబైల్స్‌, హోటళ్లు, విద్యాసంస్థలు నిర్వహిస్తున్నారు. హోండా, టాటా మోటార్స్‌ వాహనాల డీలర్‌షిప్‌ కలిగి ఉన్నారు. బుట్టా కన్వెన్షన్‌ హాలు నడుపుతున్నారు.
  • హైదరాబాద్‌ మాదాపూర్‌, ఇజ్జత్‌నగర్‌లలో ప్లాట్లు, భవనాలున్నాయి. 2,375 గ్రాముల బంగారం, వజ్రాల హారాలు, విలువైన రాళ్లతో కూడిన ఆభరణాలున్నాయి. వీటి విలువ రూ.2.54 కోట్లు. రేణుక భర్త పేరిట 435 గ్రాముల బంగారు నగలున్నాయి.
  • బుట్టా దంపతులకు తేజస్వి జ్యువెలర్స్‌లో రూ.11.10 కోట్లు, తేజస్వి మోటార్స్‌లో రూ.24 కోట్లు, బుట్టా హాస్పిటాలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో రూ.17.46 కోట్లు, బుట్టా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో రూ.59.68 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి.
  • ఐటీ నిబంధనలు ఉల్లంఘించినందుకు రేణుకపై హైదరాబాద్‌లోని ఆర్థిక నేరాల న్యాయస్థానంలో మూడు కేసులు నడుస్తున్నాయి. కర్నూలులో ఒక కేసు ఉంది.

శిల్పా కుటుంబసభ్యుల ఆస్తులు రూ. 131.71 కోట్లు

శ్రీశైలం వైకాపా అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి ఆస్తుల విలువ పదేళ్లలో భారీగా పెరిగింది. అఫిడవిట్‌ ప్రకారం.. 2014లో చక్రపాణిరెడ్డి, ఆయన భార్య, కుమారుడు.. ముగ్గురి ఆస్తి రూ.49.89 కోట్లు కాగా, అది 2019లో రూ.37.27 కోట్లు మాత్రమే. 2024కు వచ్చేసరికి 131.71 కోట్లుగా, అప్పులు 28.24 కోట్లుగా పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని