తొలిదశ సమరం నేడే

లోక్‌సభ ఎన్నికల్లో తొలిదశ కింద 102 స్థానాల్లో శుక్రవారం పోలింగు నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఏడు దశల్లో ఇదే అతిపెద్దది.

Updated : 19 Apr 2024 06:34 IST

తమిళనాడులోని అన్ని స్థానాలకూ ఒకేసారి

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో తొలిదశ కింద 102 స్థానాల్లో శుక్రవారం పోలింగు నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఏడు దశల్లో ఇదే అతిపెద్దది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నా ఓటర్లు తగిన జాగ్రత్తలు పాటిస్తూ, ముందుకు వచ్చి ఓట్లు వేస్తారని ఎన్నికల సంఘం ఆశాభావం వ్యక్తంచేసింది. దీనికి తగ్గట్టు 21 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏర్పాట్లు పూర్తిచేసింది. నితిన్‌ గడ్కరీ, కిరణ్‌ రిజిజు, సర్వానంద సోనోవాల్‌, భూపేంద్రయాదవ్‌ సహా ఎనిమిది మంది కేంద్రమంత్రులు; కాంగ్రెస్‌ నేత గౌరవ్‌ గొగొయ్‌, డీఎంకే నాయకురాలు కనిమొళి తదితరుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ మొదలవుతుంది. తొలిదశలో మొదటిసారి ఓటుహక్కు వినియోగించుకుంటున్నవారు 35.67 లక్షల మంది, 20-29 ఏళ్ల మధ్య వయసువారు 3.51 కోట్లు ఉన్నారు. మూడోసారి అధికారంలోకి రావాలని ఎన్డీయే, ఆ కూటమిని ఎలాగైనా గద్దె దించాలని విపక్ష ఇండియా కూటమి గట్టి ప్రయత్నాలు చేయడంతో ఈ సమరం అన్నివర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. తమిళనాడులోని మొత్తం 39 లోక్‌సభ స్థానాలకు ఈ విడతలోనే పోలింగ్‌ పూర్తికానుంది. ఎన్నికల సిబ్బందిని పోలింగ్‌ కేంద్రాలకు తరలించడానికి 41 హెలికాప్టర్లు, 84 ప్రత్యేక రైళ్లు, దాదాపు లక్ష వాహనాలను వినియోగించారు.

రెండు రాష్ట్రాల్లో శాసనసభలకూ

అరుణాచల్‌ప్రదేశ్‌లో 50, సిక్కింలో 42 అసెంబ్లీ స్థానాల్లో కూడా శుక్రవారమే పోలింగ్‌ జరగనుంది. అరుణాచల్‌లో 60కి 10 అసెంబ్లీ స్థానాలను భాజపా ఏకగ్రీవంగా గెలుచుకోవడంతో మిగిలినవాటికి పోలింగ్‌ నిర్వహిస్తున్నారు.


ప్రతి ఓటూ ముఖ్యమే

ఒక్క ఓటు కూడా ఎంతో కీలకం. దాని విలువను తక్కువగా అంచనా వేయకండి. ఒకేఒక్క ఓటు అత్యంత కీలకంగా నిలిచిన సందర్భాలు అనేకం ఉన్నాయి. పెద్దఎత్తున ముందుకు వచ్చి ఓటుహక్కు వినియోగించుకోవాలి. భారత ప్రజాస్వామ్యంలో ఓటింగుకు మించింది మరొకటి లేదు. ఎన్నికలు మీవి. ఎంపిక అభీష్టం మీది. ప్రభుత్వాన్ని నిర్ణయించేది మీరు. మీతోపాటు మీ కుటుంబం, పిల్లలు, మీ గ్రామం/ పట్టణం, దేశం కోసం ముందుకు రండి. ఎన్నికల భాగస్వామ్య విప్లవాన్ని యువత ముందుండి నడిపించాలి.

వీడియో సందేశంలో ప్రజలనుద్దేశించి సీఈసీ రాజీవ్‌కుమార్‌


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని