నాపై కొన్ని మీడియా సంస్థల నిందలు

కేంద్ర ప్రభుత్వం, భాజపాల విధానాలు, సిద్ధాంతాలపై విమర్శలు చేస్తున్నందుకు తనను కొన్ని మీడియా సంస్థలు నిందిస్తున్నాయని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శించారు.

Updated : 19 Apr 2024 06:33 IST

నేను భాజపాను విమర్శిస్తుంటే అవి నా ప్రతిష్ఠను దిగజారుస్తున్నాయి
కేరళ ఎన్నికల ర్యాలీలో రాహుల్‌

కన్నూర్‌, దిల్లీ: కేంద్ర ప్రభుత్వం, భాజపాల విధానాలు, సిద్ధాంతాలపై విమర్శలు చేస్తున్నందుకు తనను కొన్ని మీడియా సంస్థలు నిందిస్తున్నాయని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. జాతీయస్థాయిలో తనను అప్రతిష్ఠ పాలు చేస్తున్నాయని ఆరోపించారు. కేరళలోని కన్నూర్‌లో గురువారం జరిగిన భారీ ర్యాలీని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ భాజపాపై విరుచుకుపడ్డారు. దేశంలో సామరస్యాన్ని కాషాయ దళం దెబ్బతీస్తోందని, లక్షల మంది ప్రజలకు అన్యాయం చేస్తోందని పేర్కొన్నారు. ‘‘భాజపా, ఆరెస్సెస్‌లకు వ్యతిరేకంగా నేను రోజూ పోరాడుతున్నాను. వారేం చేసినా నేను భయపడను. వారితో నాకు సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నాయి. ప్రతిరోజు నేను ఉదయం లేవగానే ఈ రోజు వారిని ఎలా ఎదుర్కోవాలా? అని ఆలోచిస్తాను. ఇందుకు మూల్యం చెల్లించాల్సి వస్తోంది. వారిని సమర్థించే మీడియా ఛానల్స్‌ 24 గంటలూ నన్ను తిట్టిపోస్తున్నాయి. నా ప్రతిష్ఠను దేశవ్యాప్తంగా దిగజారుస్తున్నాయి. జాతుల మధ్య హింసతో అతలాకుతలమైన మణిపుర్‌లో పర్యటించేందుకు ప్రధాని మోదీకి తీరికలేదు. భాజపా ఎక్కడ కాలు పెడుతుందో అక్కడల్లా ప్రజలను విభజిస్తుంది. ఒకరినొకరు తన్నుకునేలా చేస్తుంది. కాంగ్రెస్‌ నేతృత్వంలో త్వరలో వచ్చే ప్రభుత్వం పేదలకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. మీడియా అంతా మోదీని గొప్ప మేధావి అని చాటుతోంది. అయితే ఆయన దేశానికి భారీగా నష్టం చేస్తున్నారు’’ అని రాహుల్‌ పేర్కొన్నారు. భాజపాపై తాను పోరాడుతుంటే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తనను లక్ష్యంగా చేసుకోవడమేంటో అర్థం కావడంలేదన్నారు. తనను ఈడీ 55 గంటలు ప్రశ్నించిందని, లోక్‌సభ సభ్యత్వాన్ని, అధికారిక గృహాన్ని లాక్కున్నారని, దేశంలో ఇద్దరు ముఖ్యమంత్రులు జైలు పాలయ్యారని ఇటువంటి పరిస్థితులేవీ విజయన్‌కు ఎదురుకాలేదని రాహుల్‌ వ్యాఖ్యానించారు. ఇందులో ఏదో మతలబు ఉందని, కేరళ ప్రజలు దీనిపై ఆలోచించాలని సూచించారు.

ఇవి సాధారణ ఎన్నికలు కావు..

ప్రస్తుతం జరుగుతున్నవి సాధారణ ఎన్నికలు కావని, ప్రతి ఒక్కరు రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు కృషి చేయాలని కాంగ్రెస్‌ కార్యకర్తలకు రాహుల్‌ ఉద్బోధించారు. భారత్‌ భావనను భాజపా నాశనం చేస్తోందనే విషయాన్ని ప్రజలకు వివరించాలని వారికి సూచించారు. పార్టీకి శ్రేణులు వెన్నెముకలాంటివని, ఈ ఎన్నికలు రాజ్యాంగం, ప్రజాస్వామ్యాలను రక్షించేవని, సింహాల్లాంటి కార్యకర్తలందరికీ పెద్ద బాధ్యత ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని