పశ్చిమ పవర్‌ ఎవరిది?

సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత కీలక రాష్ట్రం ఉత్తర్‌ ప్రదేశ్‌. ఇక్కడ ఆధిక్యం సాధించే పార్టీయే దాదాపుగా కేంద్రంలో అధికారంలోకి వస్తుంది.

Updated : 19 Apr 2024 06:30 IST

యూపీలోని ముస్లిం, దళిత ప్రాబల్య ప్రాంతాల్లో తొలి విడతలో పోలింగ్‌
గత ఎన్నికల్లో ప్రతిపక్షాలదే పైచేయి
ఈసారీ ఇండియా కూటమి ఆశాభావం
భాజపాపై రాజ్‌పూత్‌ల ఆగ్రహం

సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత కీలక రాష్ట్రం ఉత్తర్‌ ప్రదేశ్‌. ఇక్కడ ఆధిక్యం సాధించే పార్టీయే దాదాపుగా కేంద్రంలో అధికారంలోకి వస్తుంది. ఈ రాష్ట్రంలో మొత్తం ఏడు విడతల్లో పోలింగ్‌ జరగనుంది. శుక్రవారం తొలి విడతలో భాగంగా ముస్లింల ప్రాబల్యమున్న పశ్చిమ ఉత్తర్‌ ప్రదేశ్‌లోని 8 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరగనుంది. ఇక్కడ భాజపా హిందుత్వపై ఆధారపడుతుండగా.. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో ఇండియా కూటమి బరిలోకి దిగింది. 2019 ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమిదే పైచేయి అయినా అప్పట్లో కలిసి పోటీ చేసిన సమాజ్‌వాదీ, బీఎస్పీ విడిగా పోటీ చేస్తున్నాయి. ఈసారి కాంగ్రెస్‌తో సమాజ్‌వాదీ పార్టీ జట్టు కట్టింది.

  • కీలకమైన పశ్చిమ ఉత్తర్‌ ప్రదేశ్‌లో తీవ్రంగా ప్రభావం చూపే అంశాలుగానీ, గంపగుత్తగా ఓటింగ్‌ సరళిగానీ కనిపించవు.
  • పార్టీలకు అతీతంగా హిందూ ఓట్ల కోసం అభ్యర్థులు ప్రయత్నిస్తుంటారు.
  • ఈ ప్రాంతంలో 40శాతం నుంచి 50శాతం మధ్య ముస్లింల ఓట్లుంటాయి. అందువల్లే గత ఎన్నికల్లో భాజపా ఇక్కడ కేవలం 3 సీట్లకే పరిమితమైంది. 2014 ఎన్నికల్లో మాత్రం భాజపా ఇక్కడ ఏడు సీట్లను గెలుచుకుని సంచలనం సృష్టించింది.
  • సహారన్‌పుర్‌లో గత 25ఏళ్లలో భాజపా ఒక్కసారే గెలిచింది.

పోటాపోటీ

  • సహారన్‌పుర్‌లో భాజపా తరఫున రాఘవ్‌ లఖన్‌వాల్‌ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి ఇమ్రాన్‌ మసూద్‌ తలపడుతున్నారు. ఇక్కడ 58శాతం హిందువులున్నారు. 42 శాతం ముస్లిం జనాభా ఉంది.
  • మొరాదాబాద్‌లో 48శాతం ముస్లింలున్నారు. ఇక్కడ తొలిసారిగా హిందూ అభ్యర్థిని సమాజ్‌వాదీ రంగంలోకి దింపింది. రుచి వీరా ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు.
  • దళిత ఓటర్లు అధికంగా ఉన్న నగీనాలో చతుర్ముఖ పోరు సాగుతోంది. ఇక్కడ సమాజ్‌వాదీ, బీఎస్పీ, భాజపా, ఆజాద్‌ సమాజ్‌ పార్టీ పోటీ చేస్తున్నాయి. 1989లో బీఎస్సీ అధినాయకురాలు మాయావతి ఇక్కడి నుంచి గెలిచారు. ఆజాద్‌ పార్టీ నుంచి సురేంద్రపాల్‌, భాజపా నుంచి ఓం కుమార్‌, సమాజ్‌వాదీ నుంచి మనోజ్‌ కుమార్‌ బరిలో ఉన్నారు.
  • ముజఫర్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంజీవ్‌ బల్యాన్‌ మూడోసారి పోటీ చేస్తున్నారు. ఆయనపై రాజ్‌పూత్‌లు ఆగ్రహంగా ఉన్నారు.
  • పీలీభీత్‌లో ఈసారి వరుణ్‌ గాంధీకి భాజపా టికెట్‌ ఇవ్వలేదు. ఆయన స్థానంలో జితిన్‌ ప్రసాదను నిలిపింది. ఈ నియోజకవర్గంలో ప్రచారం చేసిన ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ రామ మందిర అంశాన్ని ప్రస్తావించారు. గతంలో మత ఘర్షణలు, శాంతి భద్రతల సమస్యలు ఉండేవని, ఇప్పుడు అవి లేవని వారు సభల్లో చెప్పారు.
  • సహారన్‌పుర్‌, కైరానాల్లో ఘర్షణల గురించి భాజపా నేతలు అధికంగా ప్రచారం చేశారు. తామొచ్చాక అవి లేవని స్పష్టం చేశారు.
  • ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ తరఫున అగ్రనేతలెవరూ ప్రచారం చేయలేదు. బుధవారం రోజునే సహారన్‌పుర్‌లో ప్రియాంకా గాంధీ రోడ్డు షో నిర్వహించారు.
  • సమాజ్‌వాదీ అభ్యర్థుల తరఫున  ప్రచారం చేసిన అఖిలేశ్‌ యాదవ్‌.. ఈ ఎన్నికలు భారత రిపబ్లిక్‌ విలువల పరిరక్షణ కోసం జరుగుతున్నాయని చెప్పారు. భాజపా ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతుందని ఆరోపించారు.

ప్రతిపక్షాలకు ఆశ

పశ్చిమ ఉత్తర్‌ ప్రదేశ్‌లో తొలి విడత పోలింగ్‌ జరగనున్న నియోజకవర్గాలపై ప్రతిపక్షాలకు ఆశ ఉంది. విపక్ష నేతలను దర్యాప్తు సంస్థలతో భాజపా వేధిస్తోందన్న అంశాలను అవి ప్రచారం చేస్తున్నాయి.

  • ఈ ప్రాంతంలో స్థానిక ప్రజలు ధరల పెరుగుదలపై ఆందోళనగా ఉన్నారు. 2017కు ముందు ఏమీ లేని భాజపా నేతలు ఇప్పుడు భూములు కొన్నారని, పెద్ద కార్లలో తిరుగుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. భాజపా మద్దతుదారుల్లోనే ఆ పార్టీ పట్ల అసంతృప్తి ఉంది. అవినీతి నేతలను పదేళ్లుగా అరెస్టు చేయకుండా ఎన్నికలకు ముందు చేయడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు.
  • పశ్చిమ ఉత్తర్‌ ప్రదేశ్‌లో ప్రాబల్యమున్న రాష్ట్రీయ లోక్‌దళ్‌ (ఆర్‌ఎల్డీ) ఈసారి భాజపాతో పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీకి కలిసివచ్చే అంశం.
  • ప్రజలు చాలా సమస్యల గురించి మాట్లాడతారుగానీ ఎన్నికలకు వచ్చే సరికి కులాల వారీగా, మతాల వారీగా విడిపోతారని కొందరు స్థానికులు తెలిపారు. కొంత మంది ముస్లింలు పథకాలు ఆపేస్తారనే భయంతో భాజపాకు ఓటేస్తున్నారని వారు వెల్లడించారు.

రాజ్‌పూత్‌లు దూరం

సంప్రదాయంగా భాజపాకు మద్దతుగా నిలుస్తున్న రాజ్‌పూత్‌లు ఈసారి ఆ పార్టీ పట్ల ఆగ్రహంగా ఉన్నారు. వారికి టికెట్ల కేటాయింపులో అన్యాయం జరిగింది. గతంలో ఎన్నడూ లేనంత తక్కువ టికెట్లు దక్కాయి. దీంతో రాజ్‌పూత్‌ నేత సంగీత్‌ సోం భాజపా నేతలను విమర్శిస్తున్నారు. ఈ ప్రాంతంలో టికెట్‌ ఇవ్వడానికి సంజీవ్‌ బల్యాన్‌ ఎవరని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఎదుట పంచాయితీ జరిగినా ఫలితం కనిపించలేదు. ముస్లింలు, దళితుల తర్వాత పశ్చిమ యూపీలో రాజ్‌పూత్‌ల జనాభాయే అధికం. వారు 10శాతం దాకా ఉంటారు. 17 నియోజకవర్గాల్లో వారి ప్రాబల్యం ఉంటుంది. గాజియాబాద్‌లో రాజ్‌పూత్‌ వర్గానికి చెందిన జనరల్‌ వీకే సింగ్‌కు టికెట్‌ ఇవ్వకపోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.

పశ్చిమ యూపీలో సాఠా - చౌరాసీ (144 రాజ్‌పూత్‌ గ్రామాలు) గ్రామాల నుంచి వేల మంది సైన్యం, పారామిలిటరీ బలగాల్లో పని చేస్తున్నారు. ఈ గ్రామాలవారు భాజపా పట్ల అసంతృప్తిగా ఉన్నారు.


నేడు పోలింగ్‌ జరిగే నియోజకవర్గాలు

సహారన్‌పుర్‌, కైరానా, ముజఫర్‌నగర్‌, బిజ్నోర్‌, నగీనా (ఎస్సీ), మొరాదాబాద్‌, రాంపుర్‌, పీలీభీత్‌.


2019 ఫలితాలు

భాజపా గెలిచినవి: ముజఫర్‌నగర్‌, కైరానా, పీలీభీత్‌.
సమాజ్‌వాదీ గెలిచినవి: మొరాదాబాద్‌, రాంపుర్‌.
బీఎస్పీ గెలిచినవి: సహారన్‌పుర్‌, బిజ్నోర్‌, నగీనా.
(ఈ ఎన్నికల్లో సమాజ్‌వాదీ, బీఎస్పీ కలిసి పోటీ చేశాయి.)


ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని