‘ఢీ’కొడుతున్న ‘ఇండియా’!

రాజస్థాన్‌లోని 12 స్థానాలకు తొలి విడతలో భాగంగా శుక్రవారం పోలింగ్‌ జరగనుంది. 2,53,15,541 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

Updated : 19 Apr 2024 06:28 IST

రాజస్థాన్‌లోని 12 స్థానాలకు నేడే పోలింగ్‌
6 సీట్లలో పోటాపోటీ
(జైపుర్‌ నుంచి ప్రకాశ్‌ భండారీ)

రాజస్థాన్‌లోని 12 స్థానాలకు తొలి విడతలో భాగంగా శుక్రవారం పోలింగ్‌ జరగనుంది. 2,53,15,541 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 1,32,89,538 మంది పురుషులుకాగా 1,20,25,699 మంది మహిళలు. 304 మంది ట్రాన్స్‌జెండర్లు. 114 మంది   అభ్యర్థులు బరిలో ఉన్నారు. అందులో 12 మంది మహిళలు. తొలి విడత పోలింగ్‌ జరిగే నియోజకవర్గాల్లో జైపుర్‌, శ్రీగంగానగర్‌ (ఎస్సీ), బీకానేర్‌ (ఎస్సీ), చురు, ఝుంఝునూ, సీకర్‌, జైపుర్‌ రూరల్‌, అలవర్‌, నాగౌర్‌, భరత్‌పుర్‌ (ఎస్సీ), దౌసా (ఎస్టీ), కరౌలీ-ధోల్‌పుర్‌ (ఎస్సీ) ఉన్నాయి. వీటిలో 6 నియోజకవర్గాల్లో భాజపాకు ఇండియా కూటమి గట్టి పోటీ ఇస్తోంది. కమలదళానికి ముచ్చెమటలు పట్టిస్తోంది.


ఎక్కడ?.. ఎలా?..

హిందుత్వ, రామ మందిరం వంటి అంశాలతో క్లీన్‌స్వీప్‌ చేస్తామని ఇప్పటిదాకా చెబుతూ వచ్చిన భాజపా ఇప్పుడు అకస్మాత్తుగా ఆత్మ రక్షణలో పడింది. క్లీన్‌స్వీప్‌, హ్యాట్రిక్‌ నినాదాలను చాలా మంది ఓటర్లు ఇష్టపడటం లేదు. వారంతా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని ఇండియా కూటమివైపు మొగ్గు చూపుతున్నారు. చురు, దౌసా, నాగౌర్‌, సీకర్‌, ఝుంఝునూ, శ్రీగంగానగర్‌, జైపుర్‌ రూరల్‌లో భాజపా పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. కాంగ్రెస్‌ ఇక్కడ గట్టి పోటీ ఇస్తోంది.


  • చురు: భాజపా నుంచి వచ్చిన సిటింగ్‌ ఎంపీ రాహుల్‌ కాస్వాను ఇక్కడ కాంగ్రెస్‌ బరిలోకి దింపింది. భాజపా తరఫున పారా ఒలింపిక్‌ పతక విజేత దేవేంద్ర ఝఝరియా పోటీ చేస్తున్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని భాజపా నేతలు అంగీకరించడం లేదు. పైగా ఓడిస్తామని హెచ్చరిస్తున్నారు. జాట్‌ల మద్దతు కాస్వాకే ఉంది. ఝఝరియా కూడా జాట్‌ వర్గానికి చెందినవారే.
  • ఝుంఝునూ: ఈ నియోజకవర్గంలో బిర్లాలు, పిరమల్‌లు, రుంగ్తాలు, మోరార్కాలు, మహేశ్వరీలు, వ్యాపారవర్గానికి చెందినవారు అధికంగా ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి శీశ్‌రాం ఓలా తనయుడు బ్రజేంద్ర ఓలా పోటీ చేస్తున్నారు. ఆయనకు మాజీ సైనికుల్లో ఎక్కువ మంది మద్దతుగా నిలుస్తున్నారు. పోస్టల్‌ ఓట్లను ఉపయోగించుకునే సైనికుల్లోనూ ఆయనకు మద్దతు లభిస్తోంది. బ్రజేంద్ర సిటింగ్‌ ఎమ్మెల్యే. బలమైన నేత. 2019లో ఇక్కడి నుంచి భాజపా తరఫున నరేంద్ర కుమార్‌ గెలిచారు. ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడంతో ఈసారి ఆ పార్టీ శుభ్‌కరణ్‌ చౌధరికి టికెట్‌ ఇచ్చింది.
  • సీకర్‌: ఇక్కడ ఇండియా కూటమి తరఫున సీపీఎం అభ్యర్థిగా 3 సార్లు ఎమ్మెల్యే అయిన అమ్రా రామ్‌ పోటీ చేస్తున్నారు. భాజపా తరఫున సుమేధానంద్‌ సరస్వతి బరిలో ఉన్నారు. గత రెండు ఎన్నికల్లో సుమేధానంద్‌ గెలిచారు. అయితే ఈ సారి ఆయనకు జాట్‌లు మద్దతు ఇవ్వడం లేదు. ఆయన హరియాణాకు చెందినవారు. స్థానికంగా ఉండే జాట్‌ నేతలు టికెట్‌ ఆశించినా భాజపా ఇవ్వలేదు. దీంతో వారు వ్యతిరేకంగా పని చేస్తున్నారు. ఆమ్రా రామ్‌ కార్మిక నేతగా ఉన్నారు. ఆయనకు క్లీన్‌ ఇమేజ్‌ ఉంది.
  • శ్రీగంగానగర్‌: ఇక్కడ మహిళా అభ్యర్థి అయిన ప్రియాంకా బలియాన్‌ను భాజపా నిలిపింది. 3 సార్లు ఎంపీగా గెలిచిన నిహాల్‌ చంద్‌కు టికెట్‌ ఇవ్వలేదు. దీంతో భాజపాలో అంతర్గత పోరు సాగుతోంది. కాంగ్రెస్‌ నుంచి కుల్దీప్‌ ఇందోరా పోటీ చేస్తున్నారు. ఆయన అనుభవమున్న నేత. బలమైన వ్యూహకర్త కూడా. దీంతో కాంగ్రెస్‌ గట్టి పోటీ ఇస్తోంది.
  • దౌసా: ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి మురారీలాల్‌ మీనా తరఫున మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ ప్రచారం చేస్తున్నారు. ఇది భాజపా అభ్యర్థి కన్హయాలాల్‌ మీనాకు ఇబ్బందికరంగా మారింది. కన్హయాలాల్‌కు అసెంబ్లీ టికెట్‌ నిరాకరించిన భాజపా లోక్‌సభ టికెట్‌ ఇచ్చింది. ఆయన మీనా వర్గానికి చెందిన మంత్రి కిరోడీ మీనాపై ఆధారపడుతున్నారు. అయితే ఆ వర్గంలో ఒకప్పుడు గట్టి నేతగా ఉన్న కిరోడీ ప్రభ క్రమంగా తగ్గుతోంది. దీంతోపాటు సచిన్‌ పైలట్‌ ప్రచారం కాంగ్రెస్‌కు కలిసివస్తోంది. గుజ్జర్లు, ఎస్సీలు, ఇతర వర్గాల వారి మద్దతు కాంగ్రెస్‌కు లభిస్తోంది.
  • జైపుర్‌ రూరల్‌: ఇక్కడ కాంగ్రెస్‌ నుంచి యువ నేత అనిల్‌ చోప్రా, భాజపా నుంచి మాజీ డిప్యూటీ స్పీకర్‌ రావు రాజేంద్ర సింగ్‌ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో భారీగా జాట్‌ ఓటర్లున్నారు. వారంతా దాదాపుగా అనిల్‌కే మద్దతు ఇస్తున్నారు. ఈసారి రాజ్‌పూత్‌లు కూడా భాజపాపై అసంతృప్తితో ఉన్నారు. టికెట్ల కేటాయింపులో తమకు అన్యాయం చేసిందని ఆగ్రహంగా ఉన్నారు. క్షత్రియ వర్గంపై కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా చేసిన వ్యాఖ్యలూ వారికి ఆగ్రహం తెప్పించాయి. దీంతో ఉత్తర్‌ ప్రదేశ్‌, రాజస్థాన్‌లలోని రాజ్‌పూత్‌లు కాంగ్రెస్‌కు మద్దతుగా నిలుస్తున్నారు.
  • జైపుర్‌: ఈ నియోజకవర్గంలో రాజ్‌పూత్‌లు బహిరంగంగా కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రతాప్‌ సింగ్‌ ఖచారియావాస్‌కు మద్దతు తెలిపారు. భాజపా తరఫున ఇక్కడ మంజు శర్మ పోటీ చేస్తున్నారు.
  • భరత్‌పుర్‌: ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ శర్మ సొంత జిల్లాలోని భరత్‌పుర్‌లో సిటింగ్‌ ఎంపీని భాజపా మార్చింది. ఈసారి రాంస్వరూప్‌ కోలిని నిలిపింది. ఆయనకు క్రిమినల్‌ రికార్డు ఉంది. ఇక్కడ యూత్‌ ఐకాన్‌గా పేరొందిన సంజనా జాటవ్‌ను కాంగ్రెస్‌ బరిలోకి దించింది.
  • కరౌలీ-ధోల్‌పుర్‌: ఇక్కడ బలమైన సీనియర్‌ నేత భజన్‌లాల్‌ జాటవ్‌ను కాంగ్రెస్‌ బరిలోకి దించింది. మాజీ మంత్రి అయిన ఆయన ఈ ప్రాంతంలో పట్టున్న నేత. భాజపా ఇందు దేవి జాటవ్‌ను నిలిపింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో కాంగ్రెస్‌ మెరుగైన ఫలితాలను సాధించింది. ఇక్కడ మోదీ వేవ్‌ లేదని, తామే గెలుస్తామని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజఖేరా రోహిత్‌ తెలిపారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని