నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!

రాజకీయ నాయకులే కాదు.. అఖిల భారత సర్వీసుల్లో ఉన్నత స్థాయిలో పనిచేసిన పలువురు అధికారులూ ప్రజాసేవ కోసం ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల కదన రంగంలోకి దిగారు.

Updated : 19 Apr 2024 08:20 IST

లోక్‌సభ ఎన్నికల బరిలో 17 మంది మాజీ ఉన్నతాధికారులు

ఈనాడు, దిల్లీ: రాజకీయ నాయకులే కాదు.. అఖిల భారత సర్వీసుల్లో ఉన్నత స్థాయిలో పనిచేసిన పలువురు అధికారులూ ప్రజాసేవ కోసం ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల కదన రంగంలోకి దిగారు. ఇప్పటికే చట్టసభలకు ఎన్నికై కేంద్రమంత్రులుగా పనిచేస్తున్నవారితోపాటు పదవీకాలం పూర్తిచేసుకున్నవారు, రాజకీయాల్లో అడుగు పెట్టాలన్న ఆసక్తితో ముందుగానే స్వచ్ఛంద పదవీ విరమణ చేసినవారూ ఈ జాబితాలో ఉన్నారు. భాజపా, కాంగ్రెస్‌, తెలుగుదేశం సహా పలు ఇతర పార్టీల నుంచి వారు ప్రస్తుతం ఎన్నికల బరిలో నిలిచారు. వారి వివరాలివీ..


ఆర్‌కే సింగ్‌: ఈయన బిహార్‌ కేడర్‌కు చెందిన 1975 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. 2011-2013 మధ్య కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా పనిచేశారు. ఈయన హయాంలోనే ఆంధ్రప్రదేశ్‌ విభజన బిల్లు రూపకల్పన జరిగింది. బిహార్‌లో రథయాత్ర చేస్తుండగా భాజపా అగ్రనేత ఎల్‌కే ఆడ్వాణీని సమస్తీపుర్‌ అదనపు మేజిస్ట్రేట్‌ హోదాలో.. అప్పటి సీఎం లాలూప్రసాద్‌ ప్రత్యేక ఆదేశాలతో అరెస్టు చేయించారు. 2013లో భాజపాలో చేరిన ఈయన.. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో బిహార్‌లోని ఆరా నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ప్రస్తుతం కేంద్ర విద్యుత్తుశాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.


అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌: రాజస్థాన్‌ ప్రభుత్వ సర్వీసుల నుంచి ఐఏఎస్‌ స్థాయికి ఎదిగారు. రాజకీయాల్లో చేరి.. 2009 నుంచి బీకానేర్‌ లోక్‌సభ స్థానంలో వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర న్యాయ శాఖ మంత్రిగా ఉన్నారు.


అపరాజితా సారంగి: ఒడిశా కేడర్‌కు చెందిన 1994 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు స్వచ్ఛంద పదవీ విరమణ చేసి.. భువనేశ్వర్‌ నుంచి భాజపా అభ్యర్థిగా రంగంలోకి దిగారు. తొలి ప్రయత్నంలోనే గెలిచి, ఆ లోక్‌సభ స్థానంలో కమలదళానికి ప్రథమ విజయాన్ని అందించిన ఘనత సొంతం చేసుకున్నారు. ఇప్పుడూ అదే నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు.


బ్రిజేంద్ర సింగ్‌: ఈయన కేంద్ర మాజీ మంత్రి బీరేంద్ర సింగ్‌ కుమారుడు. సివిల్స్‌లో అఖిలభారత స్థాయిలో 9వ ర్యాంకు సాధించి, 1998వ బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారిగా ఎంపికయ్యారు. రెండు దశాబ్దాలకుపైగా సర్వీస్‌ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో హరియాణాలోని హిస్సార్‌ నుంచి భాజపా తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఇప్పుడు అదే స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.

సత్యపాల్‌ సింగ్‌: ఈయన ఐపీఎస్‌ అధికారి. గతంలో ముంబయి పోలీసు కమిషనర్‌గా పనిచేశారు. ఆ హోదాలో ఉండగానే ఉద్యోగానికి రాజీనామా చేసి భాజపాలో చేరారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో యూపీలోని భాగ్‌పత్‌ నుంచి గెలిచారు. ప్రస్తుతం అక్కడే హ్యాట్రిక్‌ విజయంపై గురిపెట్టారు. ఈయన 2017-19 మధ్య కేంద్ర జలవనరుల శాఖ సహాయమంత్రిగా పనిచేశారు.

విష్ణుదయాళ్‌రాం: ఝార్ఖండ్‌ డీజీపీగా పనిచేసిన ఈయన.. పదవీ విరమణ తర్వాత పాలామూ లోక్‌సభ స్థానం నుంచి 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలుపొందారు. ఇప్పుడూ అక్కడినుంచే బరిలో దిగారు.

జి.కుమార్‌నాయక్‌: 1990 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. కర్ణాటకలోని రాయచూర్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తెలుగువారి ప్రాబల్యం అధికంగా ఉన్న ఈ జిల్లాలో బలమైన అభ్యర్థి కోసం అన్వేషించి.. హస్తం పార్టీ ఈయనకు టికెట్‌ ఇచ్చింది. అక్కడ జిల్లా కలెక్టర్‌గా నాయక్‌ ఇంతకుముందు పనిచేశారు.

పరంపాల్‌కౌర్‌ సిద్ధూ: 2011 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారిణి. పంజాబ్‌ స్టేట్‌ ఇండస్ట్రియల్‌ కార్పొరేషన్‌ ఎండీగా పనిచేస్తూ ఇటీవలే ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఈ నెల 12న భాజపాలో చేరారు. బఠిండా స్థానంలో తమ పార్టీ అభ్యర్థిగా ఈమెను భాజపా మంగళవారమే ప్రకటించింది.


కొప్పుల రాజు: 1988 నుంచి 1992 వరకు నెల్లూరు కలెక్టర్‌గా పనిచేసిన ఈ ఐఏఎస్‌ అధికారి.. కేంద్ర ప్రభుత్వంలో సెక్రటరీ స్థాయి హోదాలో పనిచేస్తూ 2013లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం నెల్లూరు లోక్‌సభ స్థానం నుంచి తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీకి అత్యంత సన్నిహితుడిగా ఈయనకు పేరుంది.


టి.కృష్ణప్రసాద్‌: 1986 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. ఇదివరకు గుంటూరు ఎస్పీగా, విజయవాడ పోలీసు కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. డీజీపీ హోదాలో స్టేట్‌ రోడ్‌ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్‌గానూ పనిచేశారు. ప్రస్తుతం బాపట్ల లోక్‌సభ స్థానం నుంచి తెదేపా అభ్యర్థిగా తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.


వి.వరప్రసాద్‌: 1983 బ్యాచ్‌ తమిళనాడు కేడర్‌ ఐఏఎస్‌ అధికారి. 2014లో తిరుపతి నియోజకవర్గం నుంచి వైకాపా తరఫున ఎంపీగా గెలిచారు. 2019 ఎన్నికల్లో గూడూరు నియోజకవర్గంలో అదే పార్టీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈసారి ఆ పార్టీ టికెట్‌ నిరాకరించడంతో భాజపాలో చేరారు. ప్రస్తుతం ఎన్డీయే కూటమి తరఫున తిరుపతి లోక్‌సభ స్థానంలో పోటీ చేస్తున్నారు.


తరణ్‌జీత్‌సింగ్‌ సంధూ: 1988వ బ్యాచ్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారి. అమెరికాలో భారత రాయబారిగా పనిచేసిన అనుభవం ఉంది. పంజాబ్‌లోని అమృత్‌సర్‌ నియోజకవర్గం నుంచి తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.


అన్నామలై: 2011 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. 2019లో ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి రాజకీయాల్లోకి వచ్చారు. ప్రస్తుతం తమిళనాడు భాజపా అధ్యక్షుడిగా కొనసాగుతూనే.. కోయంబత్తూరు నుంచి లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తున్నారు.


శశికాంత్‌ సెంథిల్‌: 2009 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. 2019లో మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక ఉద్యోగానికి రాజీనామా చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన తమిళనాడులోని తిరువళ్లూర్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు.

ప్రసూన్‌ బెనర్జీ: 2006 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. ఇటీవలే స్వచ్ఛంద పదవీ విరమణ పొంది.. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా లోక్‌సభ స్థానంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ తరఫున పోటీ చేస్తున్నారు. ఈయనకు సినిమాల్లో నటించిన అనుభవం ఉంది. కొన్ని నాటకాలకు దర్శకత్వం కూడా వహించారు.

దేబాశీష్‌ధర్‌: 2010 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. ఈ నెలలోనే ఉద్యోగానికి రాజీనామా చేసి.. పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్‌ నుంచి భాజపా అభ్యర్థిగా బరిలో దిగారు.

అరూప్‌ పట్నాయక్‌: 1979 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. 2011-12 మధ్య ముంబయి పోలీసు కమిషనర్‌గా పనిచేశారు. 2015లో ఉద్యోగానికి రాజీనామా చేసి బీజేడీలో చేరారు. 2019లో భువనేశ్వర్‌ లోక్‌సభ స్థానంలో ఓడిపోయారు. ప్రస్తుతం పూరీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని