రేవంత్‌రెడ్డికి ఓట్లడిగే హక్కు లేదు: లక్ష్మణ్‌

అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని రాజ్యసభ సభ్యుడు, భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.లక్ష్మణ్‌ విమర్శించారు.

Updated : 19 Apr 2024 06:20 IST

న్యూస్‌టుడే, మహబూబ్‌నగర్‌ గ్రామీణం- ఈనాడు, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని రాజ్యసభ సభ్యుడు, భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.లక్ష్మణ్‌ విమర్శించారు. గురువారం భాజపా మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ నామినేషన్‌ కార్యక్రమానికి హాజరైన లక్ష్మణ్‌.. స్థానిక క్లాక్‌టవర్‌ కూడలిలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. రేవంత్‌రెడ్డి డబ్బులు వెదజల్లి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలనుకుంటే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. డీకే అరుణ ఎంపీగా గెలిస్తే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలతో పాటు పెండింగ్‌ సాగునీటి ప్రాజెక్టుల పనుల పూర్తికి కృషి చేస్తారని తెలిపారు. డీకే అరుణ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌, భారాస నేతల మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని, లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీలకు ఓటేస్తే ప్రయోజనం ఉండదని తెలిపారు. ప్రజలు ఆలోచించి దేశ భవిష్యత్తు, సంక్షేమం కోసం భాజపాకు ఓటేయాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఏవీఎన్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్‌రెడ్డి, వివిధ జిల్లాల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారం: ప్రధానిగా నరేంద్రమోదీ మళ్లీ గెలిస్తే ఎన్నికలు జరగవని, ఇవే చివరి ఎన్నికలంటూ కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారం చేస్తోందని భాజపా నేత లక్ష్మణ్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపణల్లో ఏ మాత్రం పస లేదన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం లక్ష్మణ్‌ సమక్షంలో మాజీ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌ భాజపాలో చేరారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో భాజపా నామినేషన్ల ర్యాలీలు.. జూన్‌ 4న ఫలితాలు వచ్చాక జరిగే విజయోత్సవాల్లా ఉన్నాయని తెలిపారు. భువనగిరి ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు అధికారం దక్కడంతో తెలంగాణ ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు ఉందని విమర్శించారు. గురుకులాల్లో ఫుడ్‌ పాయిజన్‌తో బాలుడు చనిపోవడం కాంగ్రెస్‌ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, ఇతర నేతలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని