ఇది వారణాసి, వయనాడ్‌ మధ్య పోరాటం

తెలంగాణ నుంచి పోటీ చేయాలని రాహుల్‌గాంధీని తాము కోరినా వయనాడ్‌ వైపే మొగ్గు చూపారని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. కేరళ రాష్ట్రం వయనాడ్‌లో కాంగ్రెస్‌ పార్టీ గురువారం నిర్వహించిన రైతుల సమావేశంలో ఆయన ప్రసంగించారు.

Updated : 19 Apr 2024 06:18 IST

వయనాడ్‌ ప్రజలు ఓటు వేసేది కాబోయే ప్రధానికి
అవినీతిలో మునిగిపోయిన కేరళ సీఎం, ఆయన కుటుంబ సభ్యులు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ నుంచి పోటీ చేయాలని రాహుల్‌గాంధీని తాము కోరినా వయనాడ్‌ వైపే మొగ్గు చూపారని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. కేరళ రాష్ట్రం వయనాడ్‌లో కాంగ్రెస్‌ పార్టీ గురువారం నిర్వహించిన రైతుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ‘‘మోదీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పోరాటం చేస్తోంది. వారణాసి(ప్రధాని మోదీ పోటీ చేస్తున్న నియోజకవర్గం), వయనాడ్‌ మధ్య ఇప్పుడు పోరాటం జరుగుతోంది. వయనాడ్‌ ప్రజలు ఓటు వేయబోయేది ఎంపీ అభ్యర్థికి మాత్రమే కాదు కాబోయే ప్రధానికని గుర్తుంచుకోవాలి.

నాడు మణిపుర్‌ వెళ్లని మోదీ, అమిత్‌షా

మణిపుర్‌లో వందలాది మంది భాజపా గూండాల చేతిలో చనిపోయినా మోదీ, అమిత్‌షా అక్కడ పర్యటించలేదు. కానీ రాహుల్‌ గాంధీ వెళ్లి బాధితులను కలిశారు. రాసిపెట్టుకోండి, జూన్‌ 9న రాహుల్‌ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయడం ఖాయం. దేశంలో రెండు కుటుంబాల మధ్య పోరాటం జరుగుతోంది. మోదీ కుటుంబంలో ఈడీ, ఈవీఎంలు, సీబీఐ, ఆదాయపు పన్నుశాఖలు, అదానీ, అంబానీ ఉన్నారు. ఇండియా కూటమి కుటుంబంలో సోనియా, రాహుల్‌, ప్రియాంకా, వయనాడ్‌ కుటుంబ సభ్యులున్నారు. వయనాడ్‌ ప్రజలు రాహుల్‌ వైపు ఉన్నారు. నేను ప్రత్యేకంగా ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. ఆయనపై ఇక్కడి ప్రజలకు ఉన్న అభిమానాన్ని చూద్దామనే తెలంగాణ నుంచి వచ్చా.

కేంద్రంతో ఎలాంటి పోరాటం చేయని విజయన్‌  

కేరళ ప్రజలది కష్టపడే మనస్తత్వం. తెలివైన వారు. వారి శ్రమ వల్ల దుబాయ్‌లాంటి దేశాలు అభివృద్ధి చెందాయి. కానీ కేరళ అభివృద్ధి చెందలేదు. ఇక్కడి సీఎం విజయన్‌, ఆయన కుటుంబసభ్యులు అవినీతిలో మునిగిపోయారు. బంగారం స్మగ్లింగ్‌లో విజయన్‌ కుటుంబసభ్యుల పాత్ర ఉండటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. విజయన్‌పై ఈడీ, ఆదాయపన్ను కేసులున్నా ప్రధాని మోదీ చర్యలు తీసుకోవడం లేదు. ఆయనతో విజయన్‌ రహస్య ఒప్పందం చేసుకున్నారు. తెలంగాణ, కర్ణాటక, ఝార్ఖండ్‌, దిల్లీలాంటి రాష్ట్రాలు కేంద్రంతో నిధుల కోసం పోరాడుతున్నాయి. విజయన్‌ మాత్రం కేంద్రంతో ఎలాంటి పోరాటం చేయడం లేదు. పైకి సీపీఎం ముఖ్యమంత్రిగా, కమ్యూనిస్టు నాయకుడిగా కనిపిస్తున్న ఆయన కమ్యూనిస్టు కాదు... కమ్యూనలిస్టు. మతతత్వ భాజపాతో కలిసి పని చేస్తున్నారు. వయనాడ్‌లో భాజపా అభ్యర్థి సురేంద్రన్‌కి ఆయన మద్దతు ఇస్తున్నారు. సొంత పార్టీని, కేరళ ప్రజలను మోసం చేస్తున్నారు. ఈడీ, ఆదాయపన్ను కేసులున్నన్ని రోజులు సీపీఎం కోసం ఆయన పనిచేయరు’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. సమావేశం అనంతరం కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో కలిసి రేవంత్‌ ర్యాలీలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని