అబ్బో.. కేసుల్లోనూ ఘనులే

చిత్తూరు వైకాపా అసెంబ్లీ అభ్యర్థి విజయానందరెడ్డిపై ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి 12 కేసులున్నాయి.

Updated : 19 Apr 2024 08:14 IST

చిత్తూరు వైకాపా అభ్యర్థి విజయానందరెడ్డిపై 12 ఎర్రచందనం అక్రమ రవాణా కేసులు

ఈనాడు, చిత్తూరు: చిత్తూరు వైకాపా అసెంబ్లీ అభ్యర్థి విజయానందరెడ్డిపై ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి 12 కేసులున్నాయి. అఫిడవిట్‌లో పేర్కొన్న ప్రకారం కల్తీ మద్యం సరఫరాపై మరో కేసు ఉంది. 2019లో పీడీ చట్టం కింద రాజమహేంద్రవరం జైలుకెళ్లారు. చిత్తూరు, బంగారుపాళ్యం, కేవీ పల్లె, గుడిపాల, ఎస్‌ఆర్‌ పురం, పీలేరు, గంగాధర నెల్లూరు, పెనుమూరు స్టేషన్‌లలో అతనిపై అటవీ సంపదను దొంగిలించడం, అక్రమంగా రవాణా చేయడం, వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించడం వంటి కేసులున్నాయి. బంగారుపాళ్యం ఠాణాలో హత్యాయత్నం సెక్షన్‌ కింద కేసు ఉంది. విజయానందరెడ్డి భార్య పేరిట రూ.37.04 కోట్ల చరాస్థులు, రూ.18.89 కోట్ల స్థిరాస్తులున్నాయి. అప్పులు రూ.19.84 కోట్లున్నాయి.


కేతిరెడ్డి పెద్దారెడ్డిపై 5 క్రిమినల్‌ కేసులు

ఈనాడు డిజిటల్‌, అనంతపురం: తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై 5 క్రిమినల్‌ కేసులున్నాయి. 2020లో తెదేపా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంట్లోకి మారణాయుధాలతో చొరబడిన ఘటనపై పలు సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఒక ఎస్సీ, ఎస్టీ కేసు ఉంది. కేతిరెడ్డి పేరిట రూ.76 లక్షల చరాస్తులు, రూ.35 లక్షల స్థిరాస్తులు, రూ.2.46 కోట్ల అప్పు; భార్య పేరిట రూ.1.49 కోట్ల చరాస్తులు,  రూ.13 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి.


పాల్‌ పేరిట ఉన్నది రూ. 1.86 లక్షలే

విశాఖపట్నం, న్యూస్‌టుడే: విశాఖ లోక్‌సభ స్థానానికి ప్రజాశాంతి పార్టీ తరఫున నామినేషన్‌ వేసిన ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు, మహబూబ్‌నగర్‌, ఎల్‌.కోట, రాజన్న సిరిసిల్ల, నల్గొండ ప్రాంతాల్లో ఆరు కేసులున్నాయి. పాల్‌ పేరిట మొత్తంగా రూ.1.86 లక్షల సొమ్ము ఉంది. వాహనాలు, స్థిరాస్తులు, రుణాలు లేవు. డిగ్రీ రెండో ఏడాదిలోనే చదువు ఆపేశారు.


కేతిరెడ్డిపై కేసుల్లేవట!

ఈనాడు, డిజిటల్‌, అనంతపురం: ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి 2019 ఎన్నికల అఫిడవిట్‌లో 7 క్రిమినల్‌ కేసులున్నట్లు చూపించగా, తాజాగా ఎలాంటి క్రిమినల్‌ కేసులూ లేవని తెలిపారు. 2018లో బత్తలపల్లి ఠాణాలో ఆయనపై హత్యాయత్నంతోపాటు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. 147, 148, 324, 151, 355, 509 తదితర సెక్షన్ల కింద కేసులు పెట్టారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక ఆ కేసులన్నీ కొట్టివేసినట్లు అఫిడవిట్‌ను బట్టి స్పష్టమవుతోంది.


కనిగిరి వైకాపా అభ్యర్థిపై 420 కేసు

కనిగిరి, దర్శి, న్యూస్‌టుడే: ప్రకాశం జిల్లా కనిగిరి వైకాపా అభ్యర్థి దద్డాల నారాయణపై 420, 506 సెక్షన్లతో సహా పలు కేసులు నమోదయ్యాయి. తన పేరిట రూ.70.33 లక్షలు, భార్య మంజుభార్గవి పేరుతో రూ.62.03 లక్షల ఆస్తులున్నట్లు చూపారు.


కావలి వైకాపా అభ్యర్థి.. కల్తీ మద్యం సరఫరాదారు

ఈనాడు, నెల్లూరు: నెల్లూరు జిల్లా కావలి అసెంబ్లీ వైకాపా అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి కల్తీ మద్యం కేసుల్లో నిందితుడని ఆయన సమర్పించిన అఫిడవిట్‌ చెబుతోంది. ఆయనపై మొత్తం ఏడు కేసులుండగా, ఆరు కల్తీ మద్యానికి సంబంధించినవే. 2014 ఎన్నికల వేళ ఆయన ఓటర్లకు కల్తీ మద్యం సరఫరా చేసినట్లు కేసులు నమోదయ్యాయి. రామిరెడ్డి దంపతులకు రూ.236.98 కోట్ల స్థిర, చరాస్తులుండగా, రూ.50.95 కోట్ల అప్పులున్నాయి. అతని పేరిట రూ.2.63 కోట్ల విలువైన 8 కార్లు, అతని భార్య పేరిట రూ.1.33 కోట్ల విలువైన మూడు కార్లు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని