సంక్షిప్త వార్తలు (9)

అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ భృతి రూ.4వేలు చెల్లిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ నిరుద్యోగులను మోసం చేసిందంటూ మాజీ మంత్రి కేటీఆర్‌ శుక్రవారం ‘ఎక్స్‌’ వేదికగా చేసిన విమర్శలను ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ ఖండించారు.

Updated : 20 Apr 2024 06:54 IST

అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగులు గుర్తురాలేదా?
 కేటీఆర్‌కు ఎమ్మెల్సీ బల్మూరి ప్రశ్న

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ భృతి రూ.4వేలు చెల్లిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ నిరుద్యోగులను మోసం చేసిందంటూ మాజీ మంత్రి కేటీఆర్‌ శుక్రవారం ‘ఎక్స్‌’ వేదికగా చేసిన విమర్శలను ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ ఖండించారు. పదేళ్లు అధికారంలో ఉండి నిరుద్యోగులకు భారాస ఏం చేసింది? వారు అప్పుడు గుర్తురాలేదా? అని ‘ఎక్స్‌’ వేదికగా కేటీఆర్‌ను ప్రశ్నించారు.


భారీ మెజారిటీతో గెలవబోతున్నా: గడ్కరీ

నాగ్‌పుర్‌: మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలవబోతున్నట్లు భాజపా అభ్యర్థి, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ శుక్రవారం ధీమా వ్యక్తం చేశారు.  


గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలనే ఏకైక డిమాండ్‌తో యుగతులసి పార్టీ జాతీయ అధ్యక్షుడు కొలిశెట్టి శివకుమార్‌ లోక్‌సభ ఎన్నికల బరిలో దిగుతున్నారు. శుక్రవారం ఆయన సికింద్రాబాద్‌ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయనకు చంద్రస్వామి, అరుణ్‌స్వామి, నాగరాజు, న్యాయవాది వినోద్‌  తదితరులు మద్దతు తెలిపారు. 

న్యూస్‌టుడే, సికింద్రాబాద్‌


ఓట్లకోసం వచ్చే నాయకులతో జాగ్రత్తగా ఉండాలి
లిబరేషన్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: మూడు ఎమ్మెల్యే, రెండు ఎంపీ స్థానాలతో కలిపి మొత్తం అయిదుగురు అభ్యర్థులను లిబరేషన్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు విజయకుమార్‌ ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం అయిదో జాబితాను విడుదల చేశారు. ‘ఓట్ల పేరుతో గ్రామాల్లోకి వచ్చే నాయకులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. భావితరాల భవిష్యత్తు కోసం బావి గుర్తుకు ఓటెయ్యాలి. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రజల మధ్య ఉండి, ప్రజలకు సేవ చేసే వ్యక్తికి ఓటెయ్యాలి’ అని ఆయన పేర్కొన్నారు.


కాంగ్రెస్‌ వార్‌రూం శిక్షకుల నియామకం

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గాలకు వార్‌ రూం శిక్షకులను నియమించింది. డా.అనిల్‌ కేఆర్‌ పులిని మహబూబాబాద్‌కు, డా.రియాజ్‌ను వరంగల్‌, నిజామాబాద్‌; ప్రతాప్‌రెడ్డిని ఖమ్మం, పెద్దపల్లి, నల్గొండ; గౌరీ సతీష్‌ను మెదక్‌, జహీరాబాద్‌, సికింద్రాబాద్‌ నియోజకవర్గాలకు శిక్షకులుగా బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు వార్‌ రూం ఛైర్మన్‌ పవన్‌ మల్లాది శుక్రవారం ప్రకటించారు. వీరంతా వారికి కేటాయించిన నియోజకవర్గాల పరిధిలోని బూత్‌స్థాయి ఏజెంట్ల(బీఎల్‌ఏ)కు పోలింగ్‌కు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు చేస్తారని తెలిపారు.


రాజ్యాంగాన్ని మార్చడానికే 400 సీట్ల లక్ష్యం

రాజ్యాంగాన్ని మార్చడానికే ఈసారి ఎన్నికల్లో 400 పైగా సీట్లను సాధించాలనే లక్ష్యాన్ని భాజపా నిర్దేశించుకుంది. మహాత్మాగాంధీ ఆశయాలు, ఆయన పాటించిన విలువలపై ప్రధానికి నిజంగా గౌరవం ఉందా? రైతుల ఆత్మహత్యల్ని ఎందుకు మోదీ ఆపలేకపోతున్నారు? అటవీహక్కుల చట్టాన్ని ఎందుకు అమలు చేయడం లేదు? గాంధీ, గాడ్సేలలో మోదీ ఎవరి పక్షాన ఉంటారు? మౌనం వీడి ఆయన స్పష్టత ఇవ్వాలి.

‘ఎక్స్‌’లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌


రాహుల్‌, ప్రియాంక రాజకీయ పర్యాటకులు

రాహుల్‌, ప్రియాంక గాంధీ రాజకీయ పర్యాటకుల్లాంటివారు. ఎన్నికలప్పుడు వస్తారు, తర్వాత మాయమవుతారు. అలాంటివారి మాటల్ని ఓటర్లు సీరియస్‌గా ఎందుకు తీసుకుంటారు? వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి హానికరం. కాంగ్రెస్‌, వామపక్షాలు సైద్ధాంతికంగా దివాలాతీశాయి. భాజపాను వ్యతిరేకించడానికి దిల్లీలో అవి కలిసి పోరాడి, వయనాడ్‌ సహా మిగిలినచోట్ల ప్రత్యర్థులుగా ఉండటమేమిటి? వాటి ద్వంద్వ ప్రమాణాలు, వంచన తీరు స్పష్టంగా బయటపడుతున్నాయి.

వయనాడ్‌లో పీటీఐతో భాజపా జాతీయాధ్యక్షుడు జె.పి.నడ్డా


ఇది మరో స్వాతంత్య్ర పోరాటం

ఇప్పుడు జరుగుతున్న సార్వత్రిక సమరం మరో స్వాతంత్య్ర పోరాటానికంటే తక్కువేమీ కాదు. భాజపా ప్రభుత్వం మరోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ మనుగడకు ముప్పు. ఒత్తిళ్లకు తలొగ్గి ‘భాజపా కమిషన్‌’గా ఎన్నికల సంఘం మారిపోరాదు. కేంద్రంలో ప్రతిపక్షాల కూటమి (ఇండియా) ఏర్పాటులో నేనే కీలకపాత్ర పోషించాను. బెంగాల్‌లో సీపీఎం, కాంగ్రెస్‌లు భాజపా కోసం పనిచేస్తున్నాయి. మా పార్టీ ఒంటరిగానే బరిలో ఉంటుంది.

 ముర్శీదాబాద్‌ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పశ్చిమబెంగాల్‌ సీఎం మమత


ఓటేయకపోయినా సరే.. మీ కుమారుడిని ఆశీర్వదించండి

భాజపా టికెట్‌పై పథనంథిట్ట నుంచి పోటీ చేస్తున్న కుమారుడు అనిల్‌ ఆంటోనీకి మీరు ఓటేయకపోయినా ఫర్వాలేదు. కనీసం ఆయన్ని ఆశీర్వదించండి. అనిల్‌ ఓడిపోవాలంటూ కొద్దిరోజుల క్రితం మీరు అనడం ఆశ్చర్యం కలిగించింది. మీ ఇబ్బందిని అర్థం చేసుకోగలను.. కాంగ్రెస్‌ ఒత్తిడితో మీరు అలా మాట్లాడి ఉండొచ్చు.  

 కొట్టాయం సభలో ఏకే ఆంటోనీని ఉద్దేశించి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని