తెదేపా కార్యాలయం వద్ద టాస్క్‌ఫోర్స్‌ కదలికలు

విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని తెదేపా విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ కార్యాలయం వద్ద శుక్రవారం రాత్రి టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల కదలికలు ఉద్రిక్తతకు దారి తీశాయి.

Published : 20 Apr 2024 04:38 IST

బొండా ఉమాను అరెస్టు చేస్తున్నారంటూ వదంతులు
భారీగా చేరుకున్న తెదేపా శ్రేణులు
వెనుదిరిగిన పోలీసులు

విజయవాడ, న్యూస్‌టుడే: విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని తెదేపా విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ కార్యాలయం వద్ద శుక్రవారం రాత్రి టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల కదలికలు ఉద్రిక్తతకు దారి తీశాయి. సీఎం జగన్‌పై గులకరాయితో దాడి కేసులో.. తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావును ఇరికించి, అరెస్టు చేసేందుకే పోలీసులు వచ్చారన్న ప్రచారం నగరం మొత్తం వ్యాపించింది. దీంతో సింగ్‌నగర్‌, పరిసర ప్రాంతాల నుంచి తెదేపా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కార్యాలయం వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. బొండా ఉమా శుక్రవారం రాత్రి 62వ డివిజన్‌లో తెదేపా కార్యకర్తల సమావేశానికి వెళ్లడానికి సిద్ధమవుతుండగా కార్యాలయ పరిసరాల్లో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తిరుగుతుండటంతో తెదేపా నాయకులకు అనుమానం కలిగింది. స్వయంగా టాస్క్‌ఫోర్స్‌ ఏడీసీపీ.. సమీపంలోనే వాహనంలో ఉండడంతో వారి అనుమానాలు మరింత బలపడ్డాయి. నేతలు ఈ విషయాన్ని బొండాకు చెప్పి, డివిజన్‌ సమావేశం వద్దని వారించారు. ఈలోగా దాదాపు 500 మంది కార్యకర్తలు కార్యాలయం వద్దకు వచ్చారు. సీఎంపై రాయి దాడి కేసులో రెండో నిందితుడు ఎవరో చెప్పకుండా పోలీసులు నాన్చుతుండగా.. ఈ కేసులో ఉమాను ఇరికిస్తారన్న ప్రచారం నేపథ్యంలో పార్టీ కార్యాలయం వద్ద పోలీసులు కనిపించడం గందరగోళానికి కారణమైంది. కార్యకర్తలు పోగవడంతో చివరికి పోలీసులు తిరుగుముఖం పట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని