భారాస, కాంగ్రెస్‌ రెండూ అవినీతి పార్టీలే

‘తెలంగాణ దక్షిణ భారతదేశానికి గేట్‌వే లాంటిది. ఎంతోమంది ఉద్యమకారుల బలిదానంతో రాష్ట్రం ఏర్పడింది. భారాస.. ప్రజల సొమ్మును లూటీ చేసింది.

Updated : 20 Apr 2024 06:34 IST

దేశ నిర్మాణమే భాజపా లక్ష్యం
కిషన్‌రెడ్డి, వినోద్‌రావుల నామినేషన్‌ సభల్లో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌

ఈనాడు డిజిటల్‌ - హైదరాబాద్‌, ఈటీవీ - ఖమ్మం: ‘తెలంగాణ దక్షిణ భారతదేశానికి గేట్‌వే లాంటిది. ఎంతోమంది ఉద్యమకారుల బలిదానంతో రాష్ట్రం ఏర్పడింది. భారాస.. ప్రజల సొమ్మును లూటీ చేసింది. కాంగ్రెస్‌ కూడా అవినీతి పార్టీనే. అధికారం కోసం భాజపా రాజకీయాలు చేయదు. దేశ నిర్మాణానికి కృషి చేస్తుంది. ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్రంలో అవినీతి రహిత పాలన సాగుతోంది’. అని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పేర్కొన్నారు. శుక్రవారం భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఖమ్మం అభ్యర్థి తాండ్ర వినోద్‌రావుల నామినేషన్ల దాఖలు కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా తొలుత సికింద్రాబాద్‌లోని మెహబూబ్‌ కళాశాలలో నిర్వహించిన విజయ సంకల్ప సభలో రాజ్‌నాథ్‌సింగ్‌ మాట్లాడారు. అనంతరం ఖమ్మంలో అభ్యర్థికి మద్దతుగా నిర్వహించిన ర్యాలీ, రోడ్‌ షోలోనూ ప్రసంగించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోని ప్రధాన మంత్రులు పేదరికాన్ని పెంచి పోషించారని విమర్శించారు. భాజపా అధికారంలోకి వచ్చిన తరువాత 15 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చామన్నారు. కిషన్‌రెడ్డి మంచి విలువలు కలిగిన వ్యక్తి అని, ప్రతి విషయంపైనా సాధికారికంగా మాట్లాడతారని ప్రశంసించారు. ఆయనతోపాటు అన్ని నియోజకవర్గాల్లో భాజపా అభ్యర్థులందరినీ గెలిపించాలని ఓటర్లను కోరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాజపా కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు.

భాజపాకు కాంగ్రెస్సే ప్రత్యర్థి: కిషన్‌రెడ్డి

ఎమ్మెల్యేగా, కేంద్రమంత్రిగా తెలంగాణ ప్రజలు తల దించుకునేలా తానెప్పుడూ ప్రవర్తించలేదని, దౌర్జన్యాలకు పాల్పడలేదని, అక్రమ కేసులు పెట్టలేదని జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. తొమ్మిదిన్నరేళ్లుగా నరేంద్రమోదీ నేతృత్వంలో రాష్ట్రాభివృద్ధికి రూ.10 లక్షల కోట్లు ఖర్చు పెట్టామన్నారు. మళ్లీ ఎంపీగా గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి మరింత కృషి చేస్తానన్నారు. భారాసకు డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని.. ఆ పార్టీ ఒక్క సీటు గెలిచినా, ఓడినా రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీనే భాజపాకు ప్రత్యర్థి అని పేర్కొన్నారు. హామీలు అమలు చేయని కాంగ్రెస్‌కు ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. సికింద్రాబాద్‌ పార్లమెంటరీ నియోజకవర్గం భాజపాకు కంచుకోట అన్నారు. భారాస అడుగుజాడల్లో నడుస్తున్న కాంగ్రెస్‌ పార్టీ అవినీతి, కుటుంబ రాజకీయాలకు మారుపేరుగా నిలిచిందని విమర్శించారు. కిషన్‌రెడ్డి కేంద్రమంత్రిగా చేసిన అభివృద్ధి పనులు ప్రజలందరికీ తెలుసని మల్కాజిగిరి అభ్యర్థి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. సికింద్రాబాద్‌ సభలో ఎమ్మెల్యేలు మహేశ్వర్‌రెడ్డి, రాకేశ్‌రెడ్డి, భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, ఖైరతాబాద్‌ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మాజీ మంత్రులు మర్రి శశిధర్‌రెడ్డి, కృష్ణాయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. ఖమ్మంలో జరిగిన ర్యాలీలో భాజపా నాయకులు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ప్రేమేందర్‌రెడ్డి, కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు  తదితరులు పాల్గొన్నారు.

రాజ్‌నాథ్‌ హెలికాప్టర్‌ తనిఖీ

ప్రచారం నిమిత్తం రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రత్యేక హెలికాప్టర్‌లో ఖమ్మం వచ్చారు. సర్దార్‌ పటేల్‌ మైదానంలో హెలికాప్టర్‌ను ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందం తనిఖీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని