కేసీఆర్‌.. లెక్కపెట్టుకోండి

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల జోలికి వస్తే సహించేది లేదని.. భారాసలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో కేసీఆర్‌ ప్రతిరోజూ సాయంత్రం లెక్కపెట్టుకోవాలని పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

Updated : 20 Apr 2024 06:32 IST

మీ ఎమ్మెల్యేలు ఎందరున్నారో రోజూ సాయంత్రం సరిచూసుకోండి
కాంగ్రెస్‌ శాసనసభ్యుల చుట్టూ హైటెన్షన్‌ వైరు లాంటి నేనున్నా
మా వారిని టచ్‌ చేస్తే మసైపోతారు
కాంగ్రెస్‌ గెలవకుండా భాజపా, భారాస కుట్ర
 మహబూబ్‌నగర్‌, మహబూబాబాద్‌ సభల్లో సీఎం రేవంత్‌రెడ్డి

ఈనాడు-మహబూబ్‌నగర్‌, మహబూబాబాద్‌: కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల జోలికి వస్తే సహించేది లేదని.. భారాసలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో కేసీఆర్‌ ప్రతిరోజూ సాయంత్రం లెక్కపెట్టుకోవాలని పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో తమ పార్టీ అల్లాటప్పాగా అధికారంలోకి రాలేదని.. మరో పదేళ్లపాటు కాంగ్రెస్సే అధికారంలో ఉంటుందని గుర్తుపెట్టుకోవాలని కేసీఆర్‌ను ఉద్దేశించి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైనా మాజీ సీఎం తీరు మారలేదన్నారు. ‘కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలంటే.. గతంలో మాదిరి గొర్ల మందలోకి వచ్చి ఒక్కో గొర్రెను తీసుకెళ్లిపోయినట్లు అనుకుంటున్నారేమో! కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల చుట్టూ హైటెన్షన్‌ వైరు లాంటి రేవంత్‌రెడ్డి కాపలా ఉన్నాడు.. మా ఎమ్మెల్యేల్ని టచ్‌ చేస్తే మాడి మసైపోతారు’ అని ఆయన హెచ్చరించారు. శుక్రవారం ఉదయం మహబూబ్‌నగర్‌లో వంశీచంద్‌రెడ్డి నామినేషన్‌ వేసిన సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. పట్టణంలోని క్లాక్‌టవర్‌ వద్ద జరిగిన కార్నర్‌ మీటింగ్‌లో ఆయన ప్రసంగించారు. ఆ తర్వాత మహబూబాబాద్‌లో బలరాంనాయక్‌ నామినేషన్‌ అనంతరం సాయంత్రం నిర్వహించిన జనజాతర బహిరంగ సభలోనూ సీఎం మాట్లాడారు. మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, మహబూబాబాద్‌ సహా రాష్ట్రంలోని 14 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని కోరారు. దిల్లీలో మోదీ, ఇక్కడ కేసీఆర్‌ కలిసి తెలంగాణకు అన్యాయం చేశారని సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రత్యక్షంగా కొట్లాడితే సీట్లు రావని.. ఆ ఇద్దరూ చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ గెలవకుండా భాజపా, భారాస ఒక్కటై కుట్రలు చేస్తున్నాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ని ఓడించామని, ఇప్పుడు మోదీని ప్రజలు ఓడించాలని కోరారు.

వంద రోజులకే దిగిపొమ్మంటారా?

భారాస విస్తృతస్థాయి సమావేశంలో గురువారం కాంగ్రెస్‌ను ఉద్దేశించి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై రేవంత్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. ‘‘చిటికె వేస్తే 20 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు భారాసలోకి వస్తారా? ఇంకా ఎన్నిరోజులు ఇలా మాట్లాడతారు. మీరు చెప్పే కథలకు కాలం చెల్లింది. మీ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో ఇక ప్రతిరోజు సాయంత్రం లెక్కబెట్టుకోండి’’ అని సవాల్‌ విసిరారు. ఇప్పుడున్నది అప్పటి కాంగ్రెస్‌ కాదని, తమ ఎమ్మెల్యేల జోలికి వస్తే మాడిమసైపోతారంటూ హెచ్చరించారు. ‘‘ఆరు గ్యారంటీల్లోని హామీల్లో ఐదింటిని వంద రోజుల్లో అమలు చేశాం. వంద రోజుల్లో గ్యారంటీలు అమలు చేయడం లేదని, కుర్చీలోంచి దిగిపోవాలని కొందరు అంటున్నారు. కార్యకర్తలు కూర్చోబెడితే ఆ కుర్చీలో కూర్చున్నాం. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ పదేళ్లు అధికారంలో ఉంటుంది’ అని స్పష్టం చేశారు.

కారు వెళ్లేది తుక్కు దుకాణానికే..

‘‘మొన్నటి ఎన్నికల్లో కారు పార్టీని ఓడించినా ఆయన(కేసీఆర్‌)లో మార్పు రాలేదు. మరమ్మతులు చేయలేని స్థితిలో కారు ఉంది. కారు కొంచెం ఖరాబ్‌ అయిందని కేటీఆర్‌ అన్నారు. మీ కారు వర్క్‌షాప్‌ నుంచి ఇంటికి కాదు.. తుక్కు దుకాణానికే వెళ్లాలి’’ అని వ్యాఖ్యానించారు.

తెలంగాణ ద్రోహుల పార్టీ భాజపా

‘‘తెలంగాణ ద్రోహుల పార్టీ భాజపా. రాష్ట్రానికి నిధులివ్వలేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్‌ఫ్యాక్టరీ వంటి విభజన చట్టంలోని హామీల్ని కేంద్రంలోని భాజపా ప్రభుత్వం అమలు చేయలేదు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు మోదీ, కిషన్‌రెడ్డిలు జాతీయ హోదా ఇచ్చారా? సోనియా గాంధీ మంజూరు చేసిన బయ్యారం ఫ్యాక్టరీని పదేళ్లు పాతరేసిన దద్దమ్మలు భాజపా నేతలు. కాజీపేటకు సోనియాగాంధీ కోచ్‌ ఫ్యాక్టరీ మంజూరు చేస్తే.. దాన్ని మోదీ లాతూర్‌కు తరలించుకుపోయారు. ఐటీఐఆర్‌, పాలమూరు ఎత్తిపోతల పథకం, మూసీ అభివృద్ధి.. ఇలా అనేక ప్రాజెక్టుల విషయంలో కేంద్రం నిర్లక్ష్యంతో తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది. తెలంగాణ ఏర్పాటును ప్రధాని మోదీ పార్లమెంటులో అవమానించారు. నేనే ప్రత్యక్ష సాక్షిని. తల్లిని చంపి బిడ్డను బతికించారని అన్నారు. పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ ఇచ్చారని, ఆ బిల్లు చెల్లదనీ అన్నారు. తెలంగాణ ఏర్పాటును ప్రశ్నించిన భాజపా నాయకులు.. ఎలా ఓట్లడుగుతారు?

ఇద్దరు తోడు దొంగల గూడుపుఠాణి

దిల్లీలో ఉండే మోదీ.. గజ్వేల్‌లో ఉండే కేసీఆర్‌ తోడుదొంగలు. గూడుపుఠాణి చేసి.. తెలంగాణ ప్రజల హక్కుల్ని కాలరాశారు. కాళేశ్వరంలో రూ.లక్ష కోట్లు దోచుకుంటుంటే పట్టుకుని కటకటాల్లోకి నెట్టి ఊచలు లెక్కపెట్టించాల్సిన మోదీ ఏం చేశారు? కేసీఆర్‌ ఇచ్చిన కమీషన్లకు కక్కుర్తి పడి.. దోపిడీకి అనుమతి ఇచ్చారు. రైతు వ్యతిరేక చట్టాలు, నోట్ల రద్దు, జీఎస్టీ, ట్రిపుల్‌ తలాక్‌, 370 అధికరణ రద్దు.. ఇలాంటి బిల్లులకు పార్లమెంటులో మోదీకి అండగా నిలబడి భాజపా ప్రభుత్వాన్ని గెలిపించింది.. భారాస ఎంపీలు కాదా? మహబూబాబాద్‌ ఎంపీ మాలోతు కవిత తండ్రిని (రెడ్యానాయక్‌ను) ఇటీవలి ఎన్నికల్లో ఇంటికి పంపారు. కవితనూ ఇంటికి పంపించే బాధ్యతను కాంగ్రెస్‌ కార్యకర్తలు తీసుకుంటారు.

14 స్థానాల్లో గెలిపించండి

పింఛన్లు ఇవ్వాలన్నా, ఇందిరమ్మ ఇళ్లు కట్టించి ఇవ్వాలన్నా, యువతకు ఉద్యోగాలు రావాలన్నా, పరిశ్రమలు రావాలన్నా.. రాష్ట్రంలోని 14 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థుల్ని గెలిపించాలి. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్‌ న్యాయపోరాటం చేస్తోంది. వర్గీకరణను సాధించే బాధ్యత నాతో పాటు పార్టీ నేత సంపత్‌కుమార్‌ది. పాలమూరును అభివృద్ధి చేసే బాధ్యత నాది.

తెలంగాణ ఇచ్చిన దేవత సోనియాగాంధీ

ఏపీలో కాంగ్రెస్‌ మనుగడ కోల్పోతుందని తెలిసినా ప్రత్యేక తెలంగాణను సోనియా గాంధీ ఏర్పాటు చేశారు. ఆమె రాష్ట్రం ఇచ్చిన దేవత. ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు.. లోక్‌సభ ఎన్నికల్లో మోదీని, భాజపాను ఓడించడానికి సర్వశక్తులు కూడగడుతున్నాం. జూన్‌ 4న ఫలితాలు సాధించి.. రాహుల్‌ గాంధీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేస్తారు. తెలంగాణ నుంచి 14 మంది ఎంపీలతో నేను, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల దిల్లీ వెళ్లి.. ఆ పండగలో పాల్గొంటాం. 

రైతుల్ని కాల్చిచంపిన మోదీ

రైతుల ఆదాయాన్ని మోదీ రెట్టింపు చేశారా? రైతుల్ని దిల్లీలో కాల్చిచంపారు. స్విస్‌ బ్యాంకులో నల్లధనం తెచ్చి ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షల చొప్పున వేస్తానన్నారు. ఏ ఒక్కరికీ పైసలివ్వని ఆయన మూడోసారి ప్రధాని అవుతారా? రాష్ట్రంలో మేం ఇచ్చిన మాట ప్రకారం.. అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం. 4.50 లక్షల  ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రూ.22,500 కోట్లతో ప్రారంభించాం.  మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలిచ్చాం. మిగతా కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఎన్నికల కోడ్‌ అడ్డంకిగా మారింది. సంవత్సరం తిరిగేసరికే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిస్తాం. బీసీల జనాభాను బట్టి నిధులిస్తాం. ఆ బాధ్యత నాది’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


నా తెలంగాణ రైతు సోదరులకు భద్రాద్రి రాముడి సాక్షిగా, మంత్రి తుమ్మల సాక్షిగా మాట ఇస్తున్నా. పంద్రాగస్టులోపు రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేసి.. రుణం తీర్చుకుంటా. బరాబర్‌ రూ.500 బోనస్‌ ఇచ్చి వడ్లు కొంటాం. మా వంద రోజుల పాలన చూడండి. అమలు చేసిన పథకాలు చూసి 14 స్థానాల్లో గెలిపించండి.

సీఎం రేవంత్‌


ఫోన్‌ ట్యాపింగ్‌లో భాగస్వాములైనవారికి శిక్ష తప్పదు

పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన మాజీ సీఎం కేసీఆర్‌ తనకు 20 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, మంత్రులు టచ్‌లో ఉన్నారని చెబుతున్నారు. ఈ ఎన్నికలయ్యాక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భాజపాలోకి, నేను భారాసలోకి వెళ్తున్నానని ఆయన ఏ విశ్వాసంతో చెబుతున్నారు? ఫోన్‌ ట్యాపింగ్‌ పేరుతో మనిషి స్వేచ్ఛను అపహరించారు. అందులో భాగస్వాములైనవారికి శిక్ష తప్పదు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణకు రూ.10 లక్షల కోట్లు ఇచ్చామంటున్నారు. మీరు ఏమైనా భిక్షమిచ్చారా? మేము చెల్లించిన పన్నులే మాకు తిరిగిచ్చారు. నీటిపారుదల రంగానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.

పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి


ఇతర రాష్ట్రాలకు తెలంగాణ మోడల్‌

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో వంద రోజుల ప్రజాపాలనలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును తెలంగాణ మోడల్‌గా అనుసరించాలని ఇతర రాష్ట్రాలు ప్రయత్నిస్తున్నాయి. దేశంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దుతాం. త్వరలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పోతుంది.. తామే మళ్లీ అధికారంలోకి రావాలని కొందరు చూస్తున్నారు. గిరిజనులు ఎక్కడ ఉంటే అక్కడ కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తారు. మీలో ఒక్కడిగా ఎప్పటికీ మీ వెంటే ఉంటున్న బలరాంనాయక్‌ను భారీ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మనపై ఉంది.

తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయశాఖ మంత్రి


దేశం కోసం గాంధీ కుటుంబం త్యాగాలు

దేశం కోసం గాంధీ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసింది. దేశ సంపదను మిత్రులకు దోచిపెడుతున్న మోదీకి, త్యాగాలకు ప్రతిరూపంగా నిరంతరం ప్రజల మధ్య ఉంటున్న గాంధీ కుటుంబానికి మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. రాహుల్‌ గాంధీని ప్రధాని చేసేందుకు కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించుకుందాం. గతంలో కాంగ్రెస్‌ పాలనలోనే ఉపాధి హామీ, పోడుభూముల హక్కుల చట్టం, ఆహారభద్రత చట్టం లాంటివి వచ్చాయి. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్సే. మళ్లీ భాజపా అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని తీసేసే ప్రమాదం ఉంది. రాష్ట్రంలో గ్యారంటీలకే గ్యారంటీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. నాయకుల మధ్య ఏమైనా విభేదాలుంటే.. పక్కనపెట్టండి. 

సీతక్క, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి


రేవంత్‌రెడ్డితో కలిసి వంశీచంద్‌ నామినేషన్‌

ఈనాడు, మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్‌ పట్టణంలో రోడ్‌షో నిర్వహించారు. సీఎంతోపాటు వంశీచంద్‌రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్‌రెడ్డి, మైనార్టీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌, నాగర్‌కర్నూల్‌ అభ్యర్థి మల్లు రవి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్‌, వాకిటి శ్రీహరి, పర్నికారెడ్డి, జి.మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని