అభ్యర్థుల ఆస్తుల వివరాలివీ..

రాష్ట్రంలో లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాలకు నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభం కాగా, రెండో రోజు శుక్రవారం వివిధ పార్టీల తరఫున పలువురు అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు.

Updated : 20 Apr 2024 07:00 IST

రాష్ట్రంలో లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాలకు నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభం కాగా, రెండో రోజు శుక్రవారం వివిధ పార్టీల తరఫున పలువురు అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు. వాటితో పాటు నివేదించిన అఫిడవిట్‌లలో ఆస్తులు, అప్పులు, కేసుల వివరాలు పొందుపరిచారు. వివరాలు..


పిన్నెల్లిపై 4 క్రిమినల్‌ కేసులు

ఈనాడు డిజిటల్‌, నరసరావుపేట: పల్నాడు జిల్లా మాచర్ల వైకాపా అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై 8 పోలీసు కేసులుండగా, వాటిలో 4 క్రిమినల్‌, ఒకటి ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసులు ఉన్నాయి. పిన్నెల్లి ఆస్తుల మొత్తం విలువ రూ.44.28 కోట్లు. ఇందులో చరాస్తులు రూ.12.33 కోట్లు కాగా, స్థిరాస్తులు రూ.31.95 కోట్లు. అప్పులు రూ.20.32 కోట్లు. రామకృష్ణారెడ్డి, ఆయన భార్య పేరిట హైదరాబాద్‌లోని గడ్డిఅన్నారంలో 4 ప్లాట్లు, కుత్బుల్లాపూర్‌లో భూములు, మలక్‌పేట్‌లోని ఓ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో వాటా, గచ్చిబౌలిలో కమర్షియల్‌ కాంప్లెక్స్‌, మాచర్లలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములున్నాయి.


ఎంపీ నందిగం అప్పుడు పది ఫెయిల్‌.. ఇప్పుడు తొమ్మిది పాస్‌

బాపట్ల, న్యూస్‌టుడే: బాపట్ల లోక్‌సభ వైకాపా అభ్యర్థి, ఎంపీ నందిగం సురేష్‌, భార్య బేబిలతల ఉమ్మడి ఆస్తి రూ.2.74 కోట్లుగా చూపారు. 2019లో వారి ఆస్తి రూ.41.58 లక్షలుగా పేర్కొన్నారు. ఐదేళ్లలో ఎంపీ ఆస్తులు రూ.2.33 కోట్ల మేర పెరిగాయి. సురేష్‌పై తుళ్లూరు స్టేషన్‌లో ఓ క్రిమినల్‌ కేసు ఉంది. ఎంపీకి రెండు కార్లు, భార్య పేరుతో ఓ కారు ఉన్నాయి. సురేష్‌కు రూ.77.05 లక్షలు, భార్యకు రూ.9.20 లక్షల బ్యాంకు రుణాలున్నాయి. 2019 అఫిడవిట్లో తన విద్యార్హత కింద తుళ్లూరు మండలం మందడం జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతిలో ఫెయిలైనట్లు చూపించారు. తాజా అఫిడవిట్లో ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదివినట్లు పేర్కొన్నారు.


అయ్యన్నపై ‘సామాజిక’ కేసులు

నర్సీపట్నం, న్యూస్‌టుడే: నర్సీపట్నం తెదేపా అభ్యర్థి చింతకాయల అయ్యన్నపాత్రుడిపై 17 పోలీసు కేసులున్నాయి. వీటిలో 2 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కాగా, నర్సీపట్నంలో 0.002 సెంట్ల స్థలం ఆక్రమణపై ఓ కేసు నమోదైంది. మిగతావి సీఎం జగన్‌, మంత్రి రోజాను దూషించారని, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారంటూ నమోదైన కేసులే ఉన్నాయి. అయ్యన్న పేరిట స్థిర, చరాస్తులు రూ.5.04 కోట్లు, ఆయన భార్య పద్మావతి పేరిట రూ.10.84 కోట్లు ఉండగా, ఆమె పేరిట రూ.2.86 కోట్ల అప్పులున్నాయి.


భారీగా పెరిగిన మంత్రి ఉష స్థిర, చరాస్తులు

పెనుకొండ పట్టణం, న్యూస్‌టుడే: శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ వైకాపా అభ్యర్థి, మంత్రి కేవీ ఉష శ్రీచరణ్‌ ఆస్తులు గత ఐదేళ్లలో భారీగా పెరిగాయి. ఆమె పేరిట రూ.4.16 కోట్ల చరాస్తులు, రూ.1.54 కోట్ల స్థిరాస్తులున్నాయి. రూ.1.25 కోట్ల విలువైన 5.27 కిలోల బంగారం, 78 కిలోల వెండి ఉంది. భర్త శ్రీచరణ్‌ చరాస్తులు రూ.7.02 కోట్లు, స్థిరాస్తులు రూ.37.91 కోట్లు. 1.607 కిలోల బంగారం, 48 కిలోల వెండితో పాటు ఓ బస్సు, ఇతర వాహనాలున్నాయి. 2019 అఫిడవిట్‌ ప్రకారం ఉష చరాస్తులు రూ.1.32 కోట్లు, స్థిరాస్తులు రూ.20.32 లక్షలు, బంగారం 4.150 కేజీలు మాత్రమే. అప్పట్లో ఆమె భర్త చరాస్తులు 60.94 లక్షలు, స్థిరాస్తులు రూ.7.09 కోట్లు. బంగారం 1.5 కిలోలు. మంత్రి ఉషపై 2 క్రిమినల్‌ కేసులున్నాయి.


దువ్వాడ శ్రీనివాస్‌పై ఆర్థిక, నేర అభియోగాలు

టెక్కలి, న్యూస్‌టుడే: శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై క్రిమినల్‌ కేసులు, తీవ్ర ఆర్థిక నేరారోపణలు ఉన్నాయి. హత్యాయత్నం, కుట్ర, ఆయుధాలు కలిగి ఉండటం, గ్రానైట్‌ అక్రమ తరలింపు, అధికారుల సంతకాల ఫోర్జరీ వంటి కేసులు ఏపీ, ఒడిశా రాష్ట్రాల్లో నమోదయ్యాయి. ఒడిశా ప్రభుత్వానికి వ్యాట్‌, జీఎస్టీ, మైనింగ్‌ ఛార్జీల కింద రూ.19.03 కోట్ల బకాయిలున్నాయి. శ్రీనివాస్‌ పేరిట రూ.4.41 కోట్లు, భార్య వాణి పేరిట రూ.49 లక్షల చరాస్తులున్నాయి. వీరి స్థిరాస్తుల విలువ రూ.5.50 కోట్లు. శ్రీనివాస్‌ రూ.54.65 లక్షలు, భార్య రూ.7.34 లక్షల చొప్పున బ్యాంకుల్లో; ఇతరుల వద్ద రూ.1.36 కోట్ల రుణం తీసుకున్నారు. శ్రీనివాస్‌ వద్ద 4.6 కిలోల బంగారం, 7.9 కిలోల వెండి ఉండగా, వీటి విలువ రూ.4.41 కోట్లు. భార్య వద్ద ఉన్న నగల విలువ (370 గ్రా. బంగారం, 600 గ్రా. వెండి) రూ.49.68 లక్షలు. చేతిలో రూ.15 లక్షల నగదు ఉంది. మూలపేట పోర్టుకు నిర్మాణ సామగ్రి సరఫరా కాంట్రాక్టు ద్వారా ఆదాయం సమకూరుతోందని అఫిడవిట్‌లో వెల్లడించారు.


బాలకృష్ణకు రూ.184.83 కోట్ల ఆస్తులు

హిందూపురం అర్బన్‌, న్యూస్‌టుడే: హిందూపురం తెదేపా అభ్యర్థి నందమూరి బాలకృష్ణ స్థిర, చరాస్తుల మొత్తం విలువ రూ.184.83 కోట్లు. రూ.1.52 కోట్ల విలువైన 3 కార్లు, 800 గ్రాముల బంగారం, 5 కిలోల వెండి, రూ.68.85 లక్షల విలువైన డైమండ్స్‌, రూ.9.09 కోట్ల అప్పు ఉంది. ఎలాంటి కేసులూ లేవు.


కొప్పుల రాజు ఆస్తి రూ.5.10 కోట్లు

నెల్లూరు లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి, రిటైర్డ్‌ ఐఏఎస్‌ కొప్పుల రాజు పేరిట రూ.5.10 కోట్లు, ఆయన భార్య, ఐఏఎస్‌ దమయంతి పేరుపై రూ.6.44 కోట్ల విలువైన చర, స్థిరాస్తులున్నాయి. దమయంతికి రూ.1.02 కోట్ల అప్పు ఉంది. ఆయనపై కేసుల్లేవు. కొప్పుల రాజు సుదీర్ఘకాలం నెల్లూరు కలెక్టర్‌గా పనిచేశారు.


కావలి తెదేపా అభ్యర్థికి రూ.153.27 కోట్ల ఆస్తులు

కావలి తెదేపా అభ్యర్థి దగుమాటి వెంకట కృష్ణారెడ్డి కుటుంబసభ్యుల ఆస్తుల విలువ రూ.153.27 కోట్లు. ఆయన పేరున రూ.115.68 కోట్లు, భార్య శ్రీలత పేరిట రూ.31.92 కోట్లు, కుమార్తె వెన్నెల పేరుతో రూ.5.67 కోట్ల చర, స్థిరాస్తులున్నాయి. అప్పులు రూ.14.19 కోట్లు. వీరికి సొంత కారు లేదు. కృష్ణారెడ్డిపై కేసులు లేవు.


బొండా ఉమా ఆస్తులు ఇవే..

విజయవాడ, న్యూస్‌టుడే: విజయవాడ సెంట్రల్‌ తెదేపా అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావుకు రూ.30.53 కోట్ల స్థిరాస్తులు, రూ.30.66 కోట్ల చరాస్తులున్నాయి. చేతిలో రూ.10.75 లక్షల నగదు ఉంది. ఆయన భార్య సుజాత పేరిట స్థిరాస్తులు 25.38 కోట్లు, చరాస్తులు 6.48 కోట్లు. ఇద్దరి పేరిట కలిపి రూ.23 కోట్ల అప్పులున్నాయి. ఉమాకు రూ.1.19 కోట్ల విలువైన మెర్సిడిస్‌ బెంజి కారు, సుజాత పేరిట రూ.37.95 లక్షల విలువైన కారు ఉంది.


కంగాటి శ్రీదేవికి అప్పులే ఎక్కువట

పత్తికొండ, న్యూస్‌టుడే: కర్నూలు జిల్లా పత్తికొండ వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి 2019 అఫిడవిట్‌లో రూ.3.06 కోట్ల స్థిర, చరాస్తులు, రూ.44.75 లక్షల అప్పులున్నట్లు చూపారు. తాజా అఫిడవిట్‌లో రూ.2.55 కోట్ల విలువైన సాగుభూమి, రూ.66 లక్షల విలువైన ఇళ్ల స్థలాలు, హైదరాబాద్‌లో ఇల్లు, కర్నూలు, వెల్దుర్తిలో ఇళ్ల స్థలాలు ఉండగా, రూ.3.94 కోట్ల అప్పు చూపించారు. తనకు వ్యవసాయం ద్వారానే ఆదాయం వస్తోందని, ఇతరత్రా వనరుల్లేవని పేర్కొన్నారు. వెరసి, ఆస్తుల కన్నా అప్పులే అధికంగా ఉన్నట్లుగా చూపారు.


ఆదోని భాజపా అభ్యర్థి ఆస్తులు రూ.56 కోట్లు

ఆదోని గ్రామీణం, న్యూస్‌టుడే: కర్నూలు జిల్లా ఆదోని భాజపా అభ్యర్థి డాక్టర్‌ పార్థసారథి మొత్తం ఆస్తులు రూ.56.37 కోట్లు. స్థిరాస్తి రూ.45.60 కోట్లు. రుణం రూ.13.16 కోట్లు. భార్య సుమలత పేరిట చరాస్తి రూ.1.37 కోట్లు. స్థిరాస్తి రూ.7.12 కోట్లు.


మూడున్నర రెట్లు హెచ్చిన గోపిరెడ్డి ఆస్తులు

ఈనాడు డిజిటల్‌, నరసరావుపేట: పల్నాడు జిల్లా నరసరావుపేట వైకాపా అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 2019 అఫిడవిట్‌లో తనపై 4 క్రిమినల్‌ కేసులున్నట్లు పేర్కొనగా, తాజాగా ఏమీ లేవని ప్రస్తావించారు. గోపిరెడ్డి దంపతుల ఆస్తులు 2019లో 12.87 కోట్లు కాగా, ప్రస్తుతం 46.27 కోట్లు. ఎమ్మెల్యే పేరిట రూ.1.14 కోట్ల విలువైన ఆభరణాలు, భార్య పేరిట రూ.1.44 కోట్ల విలువైన నగలు ఉన్నాయి. అప్పులు రూ.4.99 కోట్లుగా చూపారు.


తోపుదుర్తికి ఏ వాహనమూ లేదట

అనంతపుం, న్యూస్‌టుడే: రాప్తాడు ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి కుటుంబ స్థిరాస్తులు రూ.11.25 కోట్లు. ప్రకాశ్‌రెడ్డి పేరుతో రూ.3.75 కోట్లు, భార్య మనోరమ పేరుపై రూ.7.50 కోట్లు, కుమారుడు సిద్ధార్థ్‌రెడ్డి పేరిట రూ.60 లక్షలున్నాయి. ముగ్గురి చరాస్తులు.. రూ.57.13 లక్షలు. కుటుంబ సభ్యుల్లో ఎవరి పేరుతోనూ వాహనం లేదు. నిత్యం వివాదాల్లో నలిగే ప్రకాశ్‌రెడ్డిపై 6 కేసులుండగా, ఇందులో 2 క్రిమినల్‌ కేసులు.


రోశయ్య ఆస్తులు తరిగిపోయాయట!

గుంటూరు, న్యూస్‌టుడే: గుంటూరు లోక్‌సభ వైకాపా అభ్యర్థి కిలారి వెంకట రోశయ్యతో పాటు కుటుంబ సభ్యుల ఆస్తులు రూ.70.50 కోట్లు. చరాస్తులు, స్థిరాస్తులు కలిపి రోశయ్య పేరుతో రూ.24.50 కోట్లు, ఆయన భార్య పేరుతో రూ.25.17 కోట్లు, తల్లి పేరుతో రూ.8.17 కోట్లు, పిల్లల పేరుతో రూ.2.66 కోట్లుగా చూపారు. 2019 అఫిడవిట్‌లో కుటుంబ సభ్యుల ఆస్తి రూ.72.39 కోట్లుగా పేర్కొన్నారు. గతం కంటే సుమారు రూ.1.89 కోట్లు తగ్గాయి. రోశయ్య దంపతుల పేరిట రూ.5 కోట్ల అప్పుంది. ఆయనపై పెదకాకాని ఠాణాలో ఓ కేసుంది.


బొల్లా బ్రహ్మనాయుడు ఆస్తులు రూ.219.05 కోట్లు!

ఈనాడు డిజిటల్‌, నరసరావుపేట: పల్నాడు జిల్లా వినుకొండ వైకాపా అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు చరాస్తులు 2019లో రూ.142.21 కోట్లు కాగా, ప్రస్తుతం రూ.99.67 కోట్లు.  స్థిరాస్తులు 2019లో రూ.30.92 కోట్లుంటే, నేడు రూ.32.30 కోట్లు. ప్రస్తుత ఆస్తుల మొత్తం విలువ రూ.219.05 కోట్లు. భూములు, ఆభరణాలు, భవనాలు, వాహనాల రూపంలో ఈ ఆస్తులున్నట్లు పేర్కొన్నారు. అప్పు రూ.28.14 లక్షలు. విద్యార్హతల్లో చదువుకోలేదని పేర్కొన్నారు. 2019లో 6 క్రిమినల్‌ కేసులుండగా, ప్రస్తుతం 3 ఉన్నాయి.


రూ.కోట్లున్నా కారు లేని మంత్రి పెద్దిరెడ్డి

ఈనాడు, చిత్లూరు: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన భార్య స్వర్ణలత ఆస్తులు ఐదేళ్లలో బాగా పెరిగాయి. 2019లో పెద్దిరెడ్డి చరాస్తులు రూ.11.27 కోట్లు, స్థిరాస్తులు రూ.80.47 కోట్లు. తాజాగా చరాస్తులు రూ.10.59 కోట్లు, స్థిరాస్తులు రూ.114.25 కోట్లు. స్వర్ణలతకు 2019లో రూ.10.01 కోట్ల చరాస్తి, రూ.29.2 కోట్ల స్థిరాస్తి ఉండగా, నేడు చరాస్తి రూ.14.55 కోట్లు, స్థిరాస్తి రూ.66.79 కోట్లకు పెరిగింది. మొత్తంగా పెద్దిరెడ్డి ఆస్తి గత ఎన్నికల్లో రూ.91.74 కోట్లుండగా, నేడది రూ.124.84 కోట్లకు చేరింది. ఆయన భార్య ఆస్తి రూ.39.22 కోట్ల నుంచి రూ.110.55 కోట్లకు పెరిగింది. అయినా పెద్దిరెడ్డికి ఒక్క కారూ లేదు. కేసులు కూడా లేవు. వైకాపా అధికారంలోకి వచ్చాక స్వర్ణలత పేరిట తిరుచానూరు, మదనపల్లె, పుంగనూరు మండలాల్లో ఎక్కువగా భూములు కొనుగోలు చేశారు.


ఎంపీ రఘురామకృష్ణరాజు ఆస్తులు రూ.219.4 కోట్లు

పశ్చిమగోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు(తెదేపా) తరఫున ఆయన భార్య రమాదేవి నామినేషన్‌ దాఖలు చేశారు. దంపతుల పేరిట రూ.32.06 కోట్ల చరాస్తులు, రూ.187.3 కోట్ల స్థిరాస్తులు కలిపి మొత్తంగా రూ.219 కోట్ల ఆస్తులున్నాయి. బ్యాంకు డిపాజిట్లు, ప్రావిడెంట్‌ ఫండ్స్‌, షేర్లు, ఈక్విటీలు, నగల రూపేణా రఘురామ పేరిట రూ.13.89 కోట్లు, రమాదేవి పేరుతో రూ.17.79 కోట్ల పెట్టుబడులున్నాయి. తమిళనాడు, నల్గొండ, విశాఖపట్నం, రంగారెడ్డి, హైదరాబాద్‌, భీమవరం, చినఅమిరం, పెదఅమిరం ప్రాంతాల్లో వ్యవసాయ, వ్యవసాయేతర భూములున్నాయి. రఘురామకు రూ.8.15 కోట్లు, భార్యకు రూ.4.45 కోట్ల అప్పులున్నాయి. ఆయనపై 6 క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.


హోం మంత్రి ఆస్తులివే..

గోపాలపురం, న్యూస్‌టుడే: తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం వైకాపా అభ్యర్థి, హోం మంత్రి తానేటి వనిత కుటుంబ సభ్యుల చరాస్తుల విలువ రూ.3.73 కోట్లు. స్థిరాస్తులు రూ.37.09 కోట్లు. రూ.73.37 లక్షల విలువైన బంగారం ఉంది. రూ.5.94 కోట్ల అప్పుంది.


కేశినేని చిన్ని కంటే.. భార్య ఆస్తులే అధికం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: విజయవాడ లోక్‌సభ తెదేపా అభ్యర్థి కేశినేని శివనాథ్‌(చిన్ని) చరాస్తులు రూ.1.10 కోట్లు. స్థిరాస్తులు రూ.2.46 కోట్లు. అప్పుల్లేవు. రూ.43.19 లక్షల నగదు చేతిలో ఉండగా, మహీంద్ర కారు ఉంది. భార్య పేరిట రూ.16.56 కోట్ల చరాస్తులు, రూ.9.06 కోట్ల స్థిరాస్తులున్నాయి. ఆమె వద్దనున్న నగదు రూ.17.89 లక్షలు. భార్య అప్పులు రూ.21.05 కోట్లు. వ్యక్తిగత రుణం రూ.26.17 కోట్లు. 1.3 కిలోల బంగారం, రెండు కార్లు (రూ.కోటి,  రూ.23లక్షలు) ఉన్నాయి.


మాధవి ఆస్తి రూ.894.92 కోట్లు

నెల్లిమర్ల, న్యూస్‌టుడే: విజయనగరం జిల్లా నెల్లిమర్ల జనసేన అభ్యర్థి లోకం మాధవి ఆస్తుల విలువ రూ.894.92 కోట్లు. వీటిలో మిరాకిల్‌ పేరుతో సాఫ్ట్‌వేర్‌ కంపెనీ, విద్యా సంస్థలు, భూములు, ఆభరణాలు, నగదు, బ్యాంకు డిపాజిట్స్‌ వంటివి ఉన్నాయి. బ్యాంకు ఖాతాలో రూ.4.42 కోట్లు, నగదు రూపేణా రూ.1.15 లక్షలు ఉంది. చర ఆస్తులు రూ.856.57 కోట్లు కాగా, స్థిరాస్తులు రూ.15.70 కోట్లు. అప్పులు రూ.2.69 కోట్లు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని