భాజపా నేతలు నకిలీ దేశభక్తులు: జగ్గారెడ్డి

భాజపా నేతలు నకిలీ దేశభక్తులు, గ్రాఫిక్‌ లీడర్స్‌ అని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు.

Published : 20 Apr 2024 04:56 IST

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: భాజపా నేతలు నకిలీ దేశభక్తులు, గ్రాఫిక్‌ లీడర్స్‌ అని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ జోడో యాత్రతో దేశంలో ఎన్‌డీఏ గ్రాఫ్‌ తగ్గి.. ఇండియా కూటమి గ్రాఫ్‌ పెరిగిందన్నారు. పీసీసీ అధికార ప్రతినిధులు చనగాని దయాకర్‌గౌడ్‌, లింగంయాదవ్‌లతో కలిసి ఆయన శుక్రవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు ఉన్నది కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలు మాత్రమే.. భాజపాది 44 ఏళ్ల చరిత్రే.. మేమే దేశభక్తులమని ఆ పార్టీ నేతలు ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు గొప్పలు చెప్పుకొంటూ లబ్ధి పొందే పనిలో ఉన్నారని ధ్వజమెత్తారు. దేశం కోసం పోరాడిన, ప్రాణత్యాగాలు చేసిన గాంధీ కుటుంబసభ్యులే అసలైన దేశభక్తులు.. అందుకే వాళ్లు దాన్ని చెప్పుకోవడం లేదని.. ప్రజలు దీన్ని గమనించాలని కోరారు. కేసీఆర్‌ ఏ ఆలోచనతో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోతుందని అన్నారో తెలియదు కానీ, దాన్ని తిప్పికొట్టే వ్యూహం తమ దగ్గర ఉందని చెప్పారు. అధికారంలో లేని కేసీఆర్‌ గేమ్‌ ఆడితే.. సీఎం రేవంత్‌రెడ్డి ఆడకుండా ఉంటారా? అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని