అభ్యర్థుల ఆస్తులు.. అప్పులు.. కేసులు..

లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచేందుకు ప్రధాన పార్టీలకు చెందిన పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.

Updated : 20 Apr 2024 06:45 IST

ఈనాడు, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచేందుకు ప్రధాన పార్టీలకు చెందిన పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా తమ ఆస్తులు, అప్పులతో పాటు తమపై ఉన్న కేసులు వంటి వివరాలతో అఫిడవిట్లను రిటర్నింగ్‌ అధికారులకు అందజేశారు. ఆయా అఫిడవిట్లలో అభ్యర్థులు పేర్కొన్న వివరాలిలా ఉన్నాయి.


కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆస్తులు రూ.19.22 కోట్లు

సికింద్రాబాద్‌ భాజపా అభ్యర్థి, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి కుటుంబానికి రూ.19.22 కోట్ల ఆస్తులున్నాయి. ఆయనపై ఎలాంటి క్రిమినల్‌ కేసులు లేవు. కుటుంబానికి బ్యాంకుల్లో డిపాజిట్లు, సుమతి సీడ్స్‌లో షేర్లు, వైష్ణవి అసోసియేట్స్‌లో పెట్టుబడులు, వీ అండ్‌ టీ అసోసియేట్‌లో కొంత వాటా, 1995లో కొనుగోలు చేసిన మారుతి 800 వాహనం ఉన్నాయి. 80 తులాల బంగారంతో పాటు కందుకూరు మండలం తిమ్మాపూర్‌లో 8.28 ఎకరాల వ్యవసాయ భూమి, బంజారాహిల్స్‌, యూసుఫ్‌గూడల్లో ప్లాట్లు ఉన్నాయి. స్థిరాస్తుల విలువ రూ.10.86 కోట్లు. కుటుంబానికి రూ.1.63 కోట్ల అప్పులున్నాయి.

సంజయ్‌కు ఇల్లు, భూములు లేవు..

కరీంనగర్‌ భాజపా అభ్యర్థిగా పోటీచేస్తున్న ఎంపీ బండి సంజయ్‌కు సొంతిల్లు లేదు. గుంట భూమి కూడా లేదు. ఆయనపై మొత్తం 41 క్రిమినల్‌ కేసులున్నాయి. కుటుంబ ఆస్తుల విలువ రూ.1.12 కోట్లు. స్థిరాస్తులు లేకున్నా 3 కార్లు, 2 ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. ఆయన సతీమణికి 43 తులాల బంగారం ఉంది. సంజయ్‌ కుటుంబానికి వాహనాల కోసం తీసుకున్న అప్పులు రూ.13.4 లక్షలు ఉన్నాయి.

అర్వింద్‌కు రూ.109.90 కోట్ల ఆస్తులు 

నిజామాబాద్‌ భాజపా అభ్యర్థి, ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు రూ.109.90 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. ఆయనపై మొత్తం 22 క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. విశ్వసామాన్యు, జిఫీ టెక్‌ సొల్యూషన్స్‌, మష్రూమ్‌ ఇంపెక్స్‌, అరిస్‌ నేచురల్‌ రిసోర్సెస్‌, ధర్మపురి కన్‌స్ట్రక్షన్స్‌, సామాన్యు ఇన్‌ఫ్రా, సవిన్‌ డెల్టా ప్రాజెక్టుల్లో వాటాలున్నాయి. అర్వింద్‌ ఒక్కరే సొంతంగా రూ.45.25 కోట్లు అడ్వాన్సులుగా ఇచ్చారు. ఆయన సతీమణి వద్ద 85 తులాల బంగారు ఆభరణాలున్నాయి. మొత్తం చరాస్తుల విలువ రూ.60.08 కోట్లు. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల్లేవు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని వాణిజ్య, నివాస భవనాల విలువ రూ.49.81 కోట్లు. మొత్తం అప్పులు రూ.30.66 కోట్లు.

బూర నర్సయ్యకు భారీగా భూములు

భువనగిరి భాజపా అభ్యర్థి డాక్టర్‌ బూర నర్సయ్య కుటుంబానికి రూ.39.29 కోట్ల ఆస్తులున్నాయి. ఆయనపై ఒక క్రిమినల్‌ కేసు ఉంది. ఆయన వద్ద రూ.2.5 లక్షల విలువైన పిస్టల్‌, ఇతర వస్తువులు ఉన్నాయి. వివిధ బ్యాంకు ఖాతాల్లో నగదు నిల్వలున్నాయి. డాక్టర్స్‌ ఎస్టేట్‌, డిక్యూబ్‌ రిసార్ట్‌, కరోస్‌ ఇన్‌ఫ్రా, ఐరిస్‌ ఎడ్యుకేర్‌, బీఎన్‌జీ పాలిటెక్‌ సంస్థల్లో వాటాలున్నాయి. వివిధ సంస్థలు, వ్యక్తులకు వ్యాపార భాగస్వామ్యం కోసం నగదు అడ్వాన్సులు ఇచ్చారు. మొత్తం 2.64 కిలోల బంగారు ఆభరణాలు, 7 కిలోల వెండి వస్తువులు, భారీగా వ్యవసాయ భూములు, ప్లాట్లు, నివాస భవనాలు ఉన్నాయి. మొత్తం చరాస్తుల విలువ దాదాపు రూ.30 కోట్లు. రూ.3.22 కోట్ల అప్పులున్నాయి.

తాండ్ర వినోద్‌రావు ..6.8 కిలోల బంగారం

ఖమ్మం భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్‌రావుకు రూ.16.25 కోట్ల చర, స్థిరాస్తులున్నాయి. పలు ప్రైవేటు సంస్థల్లో పెట్టుబడులు, వినోద్‌రావు దంపతులకు కలిపి మొత్తం 6.8 కిలోల బంగారు ఆభరణాలు, 61.3 కిలోల వెండి ఆభరణాలు ఉన్నాయి. కొత్తగూడెం, మేడ్చల్‌, వికారాబాద్‌ జిల్లాల్లో విలువైన వ్యవసాయ భూములు, మేడ్చల్‌లో వ్యవసాయేతర భూములు ఉన్నాయి. చరాస్తుల విలువ రూ.9.95 కోట్లు. స్థిరాస్తుల విలువ రూ.6.30 కోట్లు. రూ.3.42 లక్షల అప్పులున్నాయి.


వంశీచంద్‌రెడ్డికి సొంతిల్లు లేదు

మహబూబ్‌నగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డికి రూ.3.31 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. ఆశ్లేష మీడియా ఇన్నోవేషన్స్‌, త్రిమూర్తి ట్రేడ్‌డెక్‌ సంస్థల్లో 90% వాటా, మహదేవ ఇన్‌ఫ్రా ఇన్నోవేషన్స్‌ సంస్థలో 9 వేల షేర్లు ఉన్నాయి. ఆయన వద్ద 24 తులాల బంగారం, సతీమణి పేరిట 1.5 కిలోల బంగారు ఆభరణాలు, రూ.75 లక్షల విలువైన డైమెండ్‌ ఆభరణాలు, రూ.7.21 లక్షల విలువైన 9 కిలోల వెండి వస్తువులు ఉన్నాయి. కుటుంబానికి 10 ఎకరాల భూమి ఉంది. సొంతిల్లు లేదు. రూ.23.42 లక్షల అప్పులున్నాయి.

గడ్డం వంశీకృష్ణకు ఒడిశాలో 10 ఎకరాలు..

పెద్దపల్లి కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌ కుమారుడు. వంశీకృష్ణకు రూ.24.09 కోట్ల ఆస్తులున్నాయి. ఆయన వ్యాపారం చేస్తుండగా, ఆయన సతీమణి బోధనవృత్తిలో ఉన్నారు. నగదు, డిపాజిట్ల రూపంలో రూ.93.27 లక్షలు, వివిధ కంపెనీల్లో షేర్ల రూపంలో రూ.11.39 కోట్లు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ అజీజ్‌నగర్‌లో 4.18 ఎకరాలు, ఒడిశాలోని సంబల్‌పుర్‌లో 10.09 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి. సొంతగా ఆయన పేరిట ఇల్లు లేదు. అప్పులు రూ.17.76 లక్షలు ఉన్నాయి. కాగా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వివేక్‌ రూ.606 కోట్ల ఆస్తులున్నట్లు వెల్లడించారు.

బలరాం నాయక్‌కు రూ.2.99 కోట్ల ఆస్తులు.. 6 క్రిమినల్‌ కేసులు

మహబూబాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి బలరాం నాయక్‌పై 6 క్రిమినల్‌ కేసులున్నాయి. మొత్తం కుటుంబ ఆస్తుల విలువ రూ.2.99 కోట్లు. మజీద్‌పూర్‌ గ్రామంలో సర్వే నం.66 నుంచి 174 వరకు మొత్తం 180.34 ఎకరాల వ్యవసాయభూమిలో 1/3వ వంతు వాటా ఉంది. కుటుంబానికి 33 తులాల బంగారు ఆభరణాలున్నాయి. రూ.2.52 కోట్ల అప్పులున్నాయి.

ఆత్రం సుగుణ వద్ద బంగారం లేదు..

ఆదిలాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఆత్రం సుగుణపై 51 క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆమె, కుటుంబ సభ్యులు, పిల్లలు ఎవరి వద్దా గ్రాము బంగారం కూడా లేదు. ఆమె కుటుంబానికి రూ.1.96 కోట్ల ఆస్తులున్నాయి. భర్త పేరిట 20 గుంటల ఎసైన్డ్‌ భూమి ఉంది. ఉట్నూరులో తక్కువ విస్తీర్ణంలో రెండు నివాస గృహాలున్నాయి. వీటి విలువ రూ.27 లక్షలు. ఇటీవల ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేశారు. ఆమె భర్త ఆత్రం భుజంగరావు ప్రభుత్వ ఉపాధ్యాయుడు.

అసదుద్దీన్‌ ఒవైసీకి రూ.23.87 కోట్ల ఆస్తులు.. 5 కేసులు..

హైదరాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీకి రూ.23.87 కోట్ల ఆస్తులున్నాయి. ఇందులో స్థిరాస్తుల విలువ రూ.20.91 కోట్లు. ఆయన కుటుంబం పేరిట వ్యవసాయ భూములేమీ లేవు. పిల్లల పేరిట స్థిర, చరాస్తులేమీ లేవు. పాతబస్తీ మిస్రీగంజ్‌, మైలార్‌దేవ్‌పల్లిల్లో ఇళ్లు ఉన్నాయి. అప్పులు రూ.7.05 కోట్లు ఉన్నాయి. ఆయన వద్ద ఒక పిస్టల్‌, రైఫిల్‌ ఉన్నాయి. ఆయనపై 5 కేసులు ఉన్నాయి.

ప్రవీణ్‌కుమార్‌కు భూమిలేదు

నాగర్‌కర్నూల్‌ భారాస అభ్యర్థి, మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌పై 5 క్రిమినల్‌ కేసులున్నాయి. మొత్తం కుటుంబ సభ్యుల ఆస్తుల విలువ రూ.1.41 కోట్లు. ప్రభుత్వం నుంచి వచ్చే సర్వీసు పింఛను ఆదాయవనరు. చరాస్తుల విలువ రూ.73.39 లక్షలు. ఇందులో ఆయన కుమార్తె పేరిట చేసిన డిపాజిట్లు, రికరింగ్‌ డిపాజిట్ల విలువ రూ.21.18 లక్షలు. ప్రవీణ్‌కుమార్‌ వద్ద 5 తులాల బంగారం, ఆయన సతీమణికి 15 తులాలు, కుమారుడికి 5 తులాలు, కుమార్తెకు 15 తులాల బంగారం ఉంది. ఎలాంటి వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, వాణిజ్య భవనాలు లేవు. సిర్పూర్‌ కాగజ్‌నగర్‌లో రూ.13.55 లక్షల విలువైన అసంపూర్తి ఇల్లు ఉంది. రూ.51.80 లక్షల అప్పులున్నాయి.

కొప్పుల ఈశ్వర్‌ ఆస్తులు రూ.5.22 కోట్లు

పెద్దపల్లి భారాస అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు రూ.5.22 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. 6 తులాల బంగారం, ఆయన సతీమణి వద్ద 20 తులాల బంగారం, కిలో వెండి ఆభరణాలు ఉన్నాయి. మొత్తం చరాస్తుల విలువ రూ.3.59 కోట్లు. ఇద్దరికీ కలిపి 20 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు వ్యవసాయేతర భూములు, వాణిజ్య భవనం ఉన్నాయి. ఈ ఆస్తుల విలువ రూ.1.63 కోట్లు. ఆస్తులతో పాటు అప్పులు రూ.2.3 కోట్లు ఉన్నాయి. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన రూ.5.03 కోట్ల ఆస్తులున్నట్లు పేర్కొన్నారు.

పద్మారావుకు రూ.4.19 కోట్ల ఆస్తులు

సికింద్రాబాద్‌ భారాస అభ్యర్థి టి.పద్మారావుకు రూ.4.19 కోట్ల ఆస్తులున్నాయి. ఆయన సతీమణి పేరిట ఉన్న బ్యాంకు ఖాతాలో రూ.79 నగదు ఉంది. ఆయనకు 60 తులాలు, సతీమణి వద్ద 75 తులాల బంగారు ఆభరణాలు, 17 కిలోల వెండి ఉన్నాయి. మొత్తం చరాస్తుల విలువ రూ.3.62 కోట్లు. కుటుంబానికి ఎలాంటి వ్యవసాయ భూములు, వాణిజ్య భవనాలు లేవు. 900 చ.అడుగుల విస్తీర్ణంలోని ఇల్లు ఉంది. వాహనాల కోసం తీసుకున్న అప్పులు రూ.50 లక్షలు ఉన్నాయి. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తన ఆస్తుల విలువ రూ.3.33 కోట్లుగా పేర్కొన్నారు.

బాజిరెడ్డికి 42 ఎకరాలు

నిజామాబాద్‌ భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌కు రూ.4.61 కోట్ల ఆస్తులున్నాయి. కుటుంబం పేరిట 100 తులాల బంగారు ఆభరణాలున్నాయి. మొత్తం 42.11 ఎకరాల వ్యవసాయ భూములు, 1000 గజాల నివాస స్థలాలు ఉన్నాయి. మొత్తం చరాస్తుల విలువ రూ.1.41 కోట్లు. స్థిరాస్తుల విలువ రూ.3.20 కోట్లు. కుటుంబానికి అప్పులేమీ లేవు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని