ఆరు జిల్లాల్లో ఒక్కరూ ఓటెయ్యలేదు

లోక్‌సభ ఎన్నికల వేళ నాగాలాండ్‌లో దారుణ పరిస్థితి కనిపించింది. తూర్పు నాగాలాండ్‌లోని ఆరు జిల్లాల్లో ఒక్క ఓటరు కూడా పోలింగ్‌ కేంద్రం వైపు కన్నెత్తి చూడలేదు.

Published : 20 Apr 2024 04:59 IST

తూర్పు నాగాలాండ్‌లో ఎన్నికల బహిష్కరణ

కోహిమా: లోక్‌సభ ఎన్నికల వేళ నాగాలాండ్‌లో దారుణ పరిస్థితి కనిపించింది. తూర్పు నాగాలాండ్‌లోని ఆరు జిల్లాల్లో ఒక్క ఓటరు కూడా పోలింగ్‌ కేంద్రం వైపు కన్నెత్తి చూడలేదు. ఆరు జిల్లాల్లో కలిపి మొత్తం 4,00,632 మంది ఓటర్లు ఉండగా.. వారిలో ఒక్కరంటే ఒక్కరు కూడా ఓటు వేయలేదు. తూర్పు నాగాలాండ్‌కు ‘ఫ్రాంటియర్‌ నాగాలాండ్‌ టెరిటరీ (ఎఫ్‌ఎన్‌టీ)’ పేరుతో స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలని స్థానికులు కొన్నేళ్లుగా కోరుతున్నారు. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌నూ వినిపిస్తున్నారు. ఈ పోరాటానికి నేతృత్వం వహిస్తున్న ఏడు గిరిజన సంఘాల అత్యున్నత నిర్ణాయక మండలి ‘ఈస్టర్న్‌ నాగాలాండ్‌ పీపుల్స్‌ ఆర్గనైజేషన్స్‌ (ఈఎన్‌పీవో)’.. పోలింగ్‌ రోజున బంద్‌కు పిలుపునివ్వడమే తాజాగా ఎన్నికల బహిష్కరణకు కారణం. ఈ ఆరు జిల్లాల్లోని 20 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 738 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ అధికారులు ఓటర్ల కోసం వేచి చూశారు. కానీ ఒక్కరూ రాలేదు. ఆ ప్రాంతంలోని 20 మంది ఎమ్మెల్యేలూ ఓటుహక్కును వినియోగించుకోలేదు. ఈ పరిణామంపై సీఎం నీఫియూ రియో స్పందిస్తూ.. తూర్పు నాగాలాండ్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే దిశగా తాము ఇప్పటికే సిఫార్సులు చేశామని పేర్కొన్నారు. మరోవైపు- బంద్‌ పిలుపుపై ఈఎన్‌పీవోకు షోకాజ్‌ నోటీసు జారీ చేసినట్లు నాగాలాండ్‌ ప్రధాన ఎన్నికల అధికారి వయసన్‌ తెలిపారు.

 తొలిసారి ఓటేసిన శోంపెన్‌ తెగ ప్రజలు

అండమాన్‌ నికోబార్‌ దీవుల్లోని అరుదైన శోంపెన్‌ తెగ ప్రజలు ఈ సార్వత్రిక ఎన్నికల్లోనే తొలిసారిగా ఓటు వేశారు. స్థానిక అటవీ శాఖ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన ఏడుగురు శోంపెన్‌లు.. అనువాదకుడి సాయంతో తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అనంతరం అక్కడ ఎన్నికల కమిషన్‌ ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కటౌట్‌ ముందు ఫొటోలకు పోజులిచ్చారు. మొత్తం 98 మంది శోంపెన్‌లకు ఓటుహక్కు ఉన్నా.. వారిలో ఏడుగురే తమ హక్కును వినియోగించుకోవడం గమనార్హం. గ్రేట్‌ నికోబార్‌ దీవుల్లో కనిపించే ఈ తెగ ప్రస్తుతం అంతరించిపోయే ముప్పును తీవ్రస్థాయిలో ఎదుర్కొంటోంది. 2011 నాటి లెక్కల ప్రకారం శోంపెన్‌ల జనాభా కేవలం 229గా ఉంది. గతంలో వీరెప్పుడూ ఓటు వేయలేదు.

అస్సాంలో 150 ఈవీఎం సెట్ల మార్పు

అస్సాంలో శుక్రవారం లోక్‌సభ ఎన్నికల వాస్తవ పోలింగ్‌ ప్రారంభానికి 90 నిమిషాల ముందు మాక్‌ ఓటింగ్‌ నిర్వహిస్తుండగా పలు నియోజకవర్గాల్లోని ఈవీఎంలలో అధికారులు లోపాలను గుర్తించారు. దాంతో వాటి స్థానంలో కొత్త వాటిని ప్రవేశపెట్టారు. వాస్తవ పోలింగ్‌ మొదలయ్యాక కూడా ఆరు ఈవీఎంలను మార్చారు. మొత్తంగా రాష్ట్రంలో శుక్రవారం 150 ఈవీఎం సెట్లను ఇలా మార్చాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.

ఆ కేంద్రంలో ఒకే ఒక్క ఓటరు

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని అంజావ్‌ జిల్లా మాలోగామ్‌ పోలింగ్‌ కేంద్రంలో 100% ఓటింగ్‌ నమోదైంది. అబ్బో.. చాలా గ్రేట్‌.. అని అనుకుంటున్నారా? అక్కడి ఓటర్ల సంఖ్య తెలిస్తే మాత్రం ముక్కున వేలేసుకుంటారు. ఎందుకంటే అక్కడున్నది ఒకే ఒక్క ఓటరు! అవును.. నిజమే. మాలోగామ్‌ అరుణాచల్‌ తూర్పు లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తుంది. అక్కడ పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటుచేయాలంటే దాదాపు 40 కిలోమీటర్ల మేర కాలినడకన అత్యంత సంక్లిష్టమైన మార్గంలో వెళ్లాలి. నిజానికి ఇక్కడి స్థానికులంతా వేరే పోలింగ్‌ కేంద్రాల్లో తమ పేర్లను నమోదు చేసుకున్నప్పటికీ.. 44 ఏళ్ల సొకేలా తయాంగ్‌ అనే మహిళ మాత్రం అందుకు ససేమిరా అన్నారు. చేసేదేం లేక అధికారులు ఆమె కోసం ఎంతో శ్రమించి మాలోగామ్‌లో పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. శుక్రవారం మధ్యాహ్నం దాదాపు ఒంటిగంట సమయంలో తయాంగ్‌ అక్కడికి వచ్చి తన ఓటుహక్కును వినియోగించుకున్నారు.


ఈవీఎంను తీసుకెళ్తూ నదిలో మునిగిన వాహనం

అస్సాంలోని లఖింపుర్‌ నియోజకవర్గంలో ఈవీఎంను తీసుకెళ్తున్న ఓ వాహనం నదిలో మునగడం కలకలం సృష్టించింది. సాదియాలోని అమర్‌పుర్‌ ప్రాంతంలో ఓ పోలింగ్‌ కేంద్రంలోని ఈవీఎంలో సాంకేతిక లోపం తలెత్తింది. దాని స్థానంలో ఉపయోగించేందుకు సాదియా నుంచి మరో ఈవీఎంను తీసుకెళ్తున్న వాహనం.. మధ్యలో దేవపానీ నదిని దాటాల్సి వచ్చింది. వాహనాన్ని ఓ యాంత్రిక పడవలోకి ఎక్కించి ఆవలి ఒడ్డుకు వెళ్తుండగా.. నదీ ప్రవాహం ఒక్కసారిగా పెరిగి పడవ మునిగిపోయింది. అందులోని వాహనం కూడా చాలావరకు నీట మునిగింది. వాహన డ్రైవర్‌, పోలింగ్‌ అధికారి సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఈ ఘటనలో ఈవీఎం దెబ్బతింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని