మహిళలకు జై

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్‌ (బిజద) అధినేత నవీన్‌ పట్నాయక్‌ సుదీర్ఘకాలంగా ఉద్యమిస్తున్నారు.

Updated : 20 Apr 2024 06:29 IST

లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి 33 శాతం టికెట్ల కేటాయింపు
మాట నిలబెట్టుకుంటున్న ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్‌ (బిజద) అధినేత నవీన్‌ పట్నాయక్‌ సుదీర్ఘకాలంగా ఉద్యమిస్తున్నారు. దీనిపై ఆ పార్టీ ఎంపీలు పార్లమెంటు ఉభయ సభల్లో గళం వినిపించారు. మహిళా బిల్లును ఆమోదించాలని డిమాండు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన ప్రాంతీయ పార్టీల నాయకత్వాలకు గతంలో లేఖలు రాశారు. 2019 ఎన్నికల సమయంలో మహిళా బిల్లు ఆమోదం పొందకపోయినా నవీన్‌ ఒడిశాలో అమలుపరిచారు. 21 లోక్‌సభ స్థానాలకుగానూ ఏడుగురు (33 శాతం) మహిళల్ని నిలబెట్టారు. వీరిలో ఐదుగురు గెలిచారు. ఇటీవల మహిళా బిల్లుకు పార్లమెంటులో మోక్షం కలిగింది. అమలు మాత్రం ఈసారి ఎన్నికల్లో సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఈసారి 33 శాతం సీట్లను మహిళలకు కేటాయించే అవకాశం లేకపోయినా బిజద అధినేత నవీన్‌ ప్రస్తుత ఎన్నికల్లోనూ చిత్తశుద్ధి కనబరిచారు. ఏడుగురికి అవకాశమిచ్చారు.

 ముగ్గురు సిట్టింగ్‌లకు మరోసారి

2019 ఎన్నికల్లో బిజద తరఫున దిగువ సభకు ప్రమీలా బిశోయి, చంద్రాణి ముర్ము, మంజులత మండల్‌, రాజశ్రీ మల్లిక్‌, శర్మిష్ఠ శెఠి ప్రాతినిధ్యం వహించారు. ఈసారి ప్రమీలా, చంద్రాణిలకు టికెట్లు కేటాయించలేదు. సిట్టింగ్‌ ఎంపీలు జగత్సింగ్‌పూర్‌ నుంచి రాజశ్రీ, భద్రక్‌ నుంచి మంజులత, జాజ్‌పూర్‌ నుంచి శర్మిష్ఠ మళ్లీ బరిలో ఉన్నారు. కొరాపుట్‌ నుంచి కౌసల్య హికాక, అస్కా నుంచి రంజితా సాహు, బరగఢ్‌ నుంచి పరిణీత మిశ్ర, బాలేశ్వర్‌ నుంచి లేఖాశ్రీ సామంత శింగార్‌ లోక్‌సభ స్థానాలకు తొలిసారిగా పోటీ చేస్తున్నారు.

స్థానిక సంస్థల్లో 50 శాతం

స్వాతంత్య్ర సమర యోధుడు, దివంగత బిజు పట్నాయక్‌ 1990లో రెండోసారి ఒడిశా ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేశారు. వారి అభివృద్ధితోనే రాష్ట్ర ప్రగతి సాధ్యమని ఆయన పదేపదే చెప్పారు. ఆయన కుమారుడు నవీన్‌ నాయకత్వంలో ఏర్పడిన బిజద ప్రభుత్వం బిజూ ఆశయ సాధనే ధ్యేయంగా స్థానిక సంస్థల్లో 33గా ఉన్న రిజర్వేషన్లను 50 శాతానికి పెంచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని