మోదీ మూడోవిడతకే ఈ ఎన్నికలు

ప్రధాని నరేంద్రమోదీకి మూడో విడత అవకాశం ఇచ్చేందుకు ఈ విడత సార్వత్రిక ఎన్నికలు దోహదపడనున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పేర్కొన్నారు.

Updated : 20 Apr 2024 06:51 IST

రిజర్వేషన్ల జోలికి వెళ్లం: అమిత్‌ షా

గాంధీనగర్‌: ప్రధాని నరేంద్రమోదీకి మూడో విడత అవకాశం ఇచ్చేందుకు ఈ విడత సార్వత్రిక ఎన్నికలు దోహదపడనున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ఏలుబడిలోని తప్పిదాలను సరిచేయడానికి మొదటి రెండు దఫాలు సరిపోయాయని, దేశాన్ని 2047 నాటికి వికసిత భారత్‌గా నిలబెట్టడానికి ఇప్పుడు మూడో అవకాశం కల్పించడం ఎంతైనా అవసరమని చెప్పారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌ నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్న అమిత్‌షా.. శుక్రవారం నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దాలని ప్రధాని మోదీ సంకల్పించారు. దానిని చేరుకోవాలంటే.. బలమైన పునాదులు పడాలి. రాబోయే అయిదేళ్లు ఎంతో కీలకం. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీయే పాలనలో ఏర్పడిన ‘గోతుల’ను పూడ్చడానికి పదేళ్లు పట్టింది’ అని చెప్పారు. ‘వాజ్‌పేయీ, ఆడ్వాణీ వంటి దిగ్గజ నేతలు గతంలో ప్రాతినిథ్యం వహించిన గాంధీనగర్‌ నుంచి మరోసారి పోటీ చేసేందుకు అవకాశమిచ్చిన అధిష్ఠానానికి నా కృతజ్ఞతలు. ప్రధాని మోదీ ఓటరుగా ఉన్నది కూడా ఇక్కడే. ఎంపీగా ఎన్నికయ్యేందుకు ముందు ఎమ్మెల్యేగా నేను ఎన్నికైంది కూడా ఈ లోక్‌సభ స్థానం పరిధి నుంచే. ఈ స్థానంతో నాకు 30 ఏళ్ల అనుబంధం ఉంది. బూత్‌స్థాయి కార్యకర్త నుంచి నన్ను ఎంపీని చేసింది ఇక్కడి ప్రజలే’ అని షా గుర్తుచేసుకున్నారు.

 రాజ్యాంగాన్ని మార్చాలంటే ఇప్పటికే చేసేవాళ్లం

రిజర్వేషన్ల విధానం జోలికి మోదీ సర్కారు ఎప్పుడూ వెళ్లదని, ఎవరినీ అలా చేయనివ్వబోమని ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్‌షా చెప్పారు. ‘రాజ్యాంగాన్ని మారుస్తామనేది ఊహాగానాలే. ఆ ఆలోచనే మాకు ఉంటే ఇప్పటికే చేసి ఉండేవాళ్లం. పార్లమెంటులో ఆధిక్యాన్ని మేమెన్నడూ దుర్వినియోగం చేయలేదు. అలాంటి అలవాటు కాంగ్రెస్‌కే ఉంది’ అని ఆరోపించారు. ఒక కార్యకర్తగా గాంధీనగర్‌లోని గోడలపై తాను పోస్టర్లు అంటించిన ప్రాంతాల మీదుగా గురువారం అక్కడ రోడ్‌షో కొనసాగిందని తెలిపారు. ఈసారి దక్షిణాదిలోనూ భాజపా ఉత్తమ పనితీరు కనపరుస్తుందని, ప్రధానికి ఉన్న ప్రజాదరణ సీట్ల రూపంలోకి మారుతుందని విశ్వాసం వ్యక్తపరిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని